కందికుంట అడ్డంగా దొరికినా.. | Sakshi
Sakshi News home page

కందికుంట అడ్డంగా దొరికినా..

Published Sat, May 4 2024 5:02 AM

2 crore case without progress

పురోగతి లేని రూ.2 కోట్ల కేసు 

కేసును పోలీసులు తాత్సారం చేస్తుండటంపై సర్వత్రా చర్చ

సాక్షి ప్రతినిధి, అనంతపురం:  శ్రీసత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ కారులో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టివేత వ్యవహారంలో పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. నగదు తరలింపులో కందికుంట పాత్రపై పక్కా ఆధారాలు లభ్యమైనప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే కేసును పక్కదోవ పట్టించి.. కందికుంటను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కందికుంట వెంకటప్రసాద్‌ కారులో సుమారు రూ.2 కోట్ల నగదును అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా.. నాలుగు రోజుల కిందట అనంతపురం విద్యుత్‌ నగర్‌ సర్కిల్‌లో పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. అది కందికుంట డబ్బేనని కారు డ్రైవర్‌ వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇదే కారుకు ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకున్నారు. ఇన్ని ఆధారాలున్నప్పటికీ  కందికుంటపై చర్యలు తీసుకోవడానికి జాప్యమెందుకన్నది అంతుచిక్కని విషయం.

 ఈ కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో క్లిష్టమైన కేసులను ఇట్టే ఛేదించిన అనంతపురం పోలీసులు ఈ కేసు విషయంలో ఎందుకో దోబూచులాడుతున్నారు. కేసు నుంచి కందికుంటను తప్పించేందుకు ఏమైనా ప్లాన్‌ వేస్తున్నారా అన్న అనుమానాలు నెలకొన్నాయి. నాలుగు బైకులు పట్టుకుంటేనే హడావుడిగా ప్రెస్‌మీట్‌ పెట్టిమరీ వివరాలు వెల్లడించే పోలీసు అధికారులు.. సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడిన విషయంలో మాత్రం ఎందుకు నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారో అర్థం కావడంలేదు.

రోజుకో మలుపు   
భారీస్థాయిలో నగదు పట్టుబడిన ఈ కేసు మలుపులు తిరుగుతోంది. దీనిపై కిందిస్థాయి పోలీసులు ముందుకెళ్లకుండా పైస్థాయి అధికారులు బంధనాలు వేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటరి్నంగ్‌ అధికారి (ఆర్‌వో)కి సమాచారం ఇచ్చామని పోలీసులు చెప్పారు. వాస్తవానికి వారు ఆర్‌వోకి సమాచారం ఇవ్వనేలేదు. కందికుంట ఎవరి ద్వారానైనా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారా? లేదా పోలీసులకే దీనిపై ‘ప్రత్యేక శ్రద్ధ’ ఉందా అన్నది తేలడం లేదు. 

అనంతపురం పోలీసు ఉన్నతాధికారుల వద్ద ఈ కేసు విషయంపై కిందిస్థాయి పోలీసులు చర్చించడానికి కూడా భయపడుతున్నట్టు తెలుస్తోంది. కందికుంట కారులో మూడు బ్యాగులు ఉన్నట్టు పలు టీవీ చానళ్ల విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తుండగా, పోలీసులు మాత్రం రెండు బ్యాగులే ఉన్నట్లు చెబుతున్నారు. మూడో బ్యాగులోనూ డబ్బులు ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఎక్కడికి వెళ్లాయన్నది తేలాల్సి ఉంది. 

గతంలో హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారిపై భారీస్థాయిలో హవాలా నగదు పట్టుబడిన కేసులో రెండురోజుల్లోనే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. అదే ఈ కేసులో మాత్రం ‘అనంత’ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. ఆర్‌వోకి సమాచారం ఇవ్వకుండానే ఇచ్చామని ఒక సీఐ చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

ఆర్వోకి సమాచారం ఇచ్చాం 
డబ్బుకు సంబంధించి విచారణ చేస్తున్నాం. ఇందులో ఉన్నది రెండు బ్యాగులే. ఒకవేళ  ఉంటే మూడో బ్యాగు బట్టల బ్యాగ్‌ అయి  ఉండొచ్చు. ఆర్వో దగ్గరకు మా అధికారులు వెళ్లారు. ఆర్వో నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి. ఈలోగా మిగతా విచారణ జరుగుతూనే ఉంటుంది.   – ఈ నెల 2వ తేదీన  అనంతపురం టూటౌన్‌ సీఐ  క్రాంతికుమార్‌‘సాక్షి’కి చెప్పిన వివరాలు 

నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు 
కందికుంట వెంకటప్రసాద్‌కు  సంబంధించి సీజ్‌చేసిన రూ.2 కోట్ల కేసు వివరాలు ఇప్పటివరకు నాకు అందలేదు. నేను కదిరి ఆర్‌వోగా ఉన్నాను. కేసు అనంతపురంలో బుక్‌ చేశారు. అయినా నేను పోలీసులను అడిగాను. కానీ ఇప్పటివరకు వివరాలు ఇవ్వలేదు. పోలీసులు ఇచ్చే వివరాలను బట్టి మాత్రమే చర్యలు తీసుకోగలం.  – ఈ నెల 3వ తేదీన కదిరి రిటరి్నంగ్‌ అధికారి సన్నీ వంశీకృష్ణ వెల్లడి 

Advertisement
 
Advertisement