‘జైపూర్‌ డైలాగ్స్‌’తో సంబంధం లేదు..సునీల్‌ శర్మ వివరణ | Sunil Sharma Says Iam In No Way Related To Jaipur Dialogues Youtube Channel, Details Inside - Sakshi
Sakshi News home page

‘జైపూర్‌ డైలాగ్స్‌’తో సంబంధం లేదు.. సునీల్‌ శర్మ వివరణ

Published Sun, Mar 24 2024 1:05 PM

sunil sharma says no way related to Jaipur dialogues YouTube channel - Sakshi

జైపూర్‌: లోక్‌సభ ఎ‍న్నికలు సమీస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను  ప్రకటిస్తూ ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే గురువారం విడుదల చేసిన మూడో జాబితాలో రాజ​స్థాన్‌లోని జైపూర్‌ నియోజకవర్గంలో సునీల్‌ శర్మకు అవకాశం కల్పించింది కాంగ్రెస్‌. అయితే బీజేపీకి సంబంధించిన ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు ఉ‍న్న సునీల్‌ శర్మకు కీలకమైన జైపూర్‌ స్థానాన్నికేటాయించటం చర్చనీయాంశం అయింది.

తరచూ కాంగ్రెస్‌పై విమర్శలు చేసే.. బీజేపీ అనుకూలమైన వార్తలు ప్రసారం చేసే ‘జైపూర్‌ డైలాగ్స్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ను ఆయన 2016లో మాజీ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ దిక్షిత్‌తో కలిసి ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు సునీల్‌ శర్మ జైపూర్‌ అభ్యర్థిత్వంపై పునరాలోచించాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై సునీల్‌ శర్మ స్వయంగా​ స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘నాకు జైపూర్‌ డైలాగ్స్‌  యూట్యూబ్‌ ఛానెల్‌ లేదా ట్విటర్‌ హాండిల్‌తో ఎటువంటి సంబంధం లేదు.  కాంగ్రెస్‌ పార్టీని అపహాస్యం చేయడానికి వ్యాప్తి చేస్తున్న తప్పుడు వార్తలు, అసత్య ప్రచారం’ అని సునీల్‌ శర్మ ‘ఎక్స్‌’ వేదికగా వివరణ ఇచ్చారు.

‘నాకు జైపూర్‌ డైలాగ్స్‌ యూట్యూబ్‌ ఛానెల్‌తో ఎటువంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయాలు, భావాలు తెలియజేయటం కోసం నేను టీవీ, యూట్యూట్‌ ఛానెల్స్‌ ఆహ్వానిస్తే వెళ్తుంటాను. అదే విధంగా జైపూర్‌ డైలాగ్స్‌  కూడా సామాజిక సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ విజన్‌ గురించి మాట్లాడటానికి నన్ను ఆహ్వానించింది. నేను మతం పేరుతో జరిగే ఉన్మాదాన్ని బలంగా వ్యతిరేకిస్తాను’ అని సునీల్‌ శర్మ అన్నారు. జైపూర్‌ డైలాగ్స్‌కు సునీల్‌ శర్మ డైరెక్టర్‌ అంటూ.. సోషల్‌ మీడియా ప్రచారం జరుగుతోందని అది కేవలం రాజకీయ ‍ ప్రయోజనాల కోసమే వదంతులు సృష్టిస్తున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement