ముహూర్త బలం | Sakshi
Sakshi News home page

ముహూర్త బలం

Published Thu, Apr 18 2024 2:00 PM

- - Sakshi

● నేటి నుంచి నామినేషన్లు ● మెదక్‌, సంగారెడ్డి కలెక్టరేట్లలో ఏర్పాట్లు

సాక్షి, సిద్దిపేట: లోక్‌సభ ఎన్నికల సమరంలో మొదటి ఘట్టం గురువారం నుంచి ప్రారంభం కానుంది. నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయనున్నారు. దీంతో నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు మంచి ముహూర్తాలను చూసుకుంటున్నారు. మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు మెదక్‌ కలెక్టరేట్‌లో, జహీరాబాద్‌ స్థానం నుంచి బరిలో ఉండే అభ్యర్థుల నామినేషన్లు సంగారెడ్డి కలెక్టరేట్‌లో స్వీకరిస్తారు. నిర్ణీత సమయాల్లో సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది.

సమాయత్తమవుతున్నారు..

అభ్యర్థులు వారి పేరు మీద ముహూర్త బలం చూసుకొని నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. పురోహితులు సూచించిన తేదీల్లో సమయానికి ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. మంచి రోజు మొదటి సెట్‌ వేసి తర్వాత భారీ ర్యాలీల ద్వారా వెళ్లి మిగతా సెట్లను వేయనున్నారు. బీజేపీ మెదక్‌ అభ్యర్థి ఎం. రఘునందన్‌ గురువారం నామినేషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్‌ పత్రాలను అయోధ్యలోని బాలరాముడి వద్ద ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. 20న మెదక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌ వేయనున్నారు. 24న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. అలాగే స్వతంత్రులు కూడా ముహూర్తాలను చూసుకుంటున్నారు.

నామినేషన్ల ప్రారంభం 18న

దాఖలుకు చివరి తేదీ 25

పరిశీలన 26

ఉపసంహరణ 29

పోలింగ్‌ మే 13

కౌంటింగ్‌ జూన్‌ 4

ముఖ్యనేతల రాక

ప్రధాన పార్టీలు నామినేషన్లు వేసే సమయంలో అభ్యర్థుల వెంట ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు పోటీ చేసే అభ్యర్థులు పలువురిని ఆహ్వానించారు. పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి నామినేషన్ల ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రధాన పార్టీలు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల 18న బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డిలు హాజరు కానున్నారు. 20న మెదక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మధు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీలు, మంత్రులు హాజరుకానున్నారు. 24న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ర్యాలీ చేపట్టనున్నారు. కార్యక్రమానికి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు రానున్నారు.

Advertisement
Advertisement