2023 అంతా 'శుభ్‌'మయం.. రికార్డులు కొల్లగొడుతున్న టీమిండియా యంగ్‌ డైనమైట్‌ | India Vs. Australia 2nd ODI: Year 2023 Belongs To Shubman Gill | Shubman Gill Records - Sakshi
Sakshi News home page

IND VS AUS 2nd ODI: 2023 అంతా 'శుభ్‌'మయం.. రికార్డులు కొల్లగొడుతున్న టీమిండియా యంగ్‌ డైనమైట్‌

Published Sun, Sep 24 2023 7:24 PM

IND VS AUS 2nd ODI: Year 2023 Belongs To Shubman Gill - Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌లో 2023 సంవత్సరమంతా 'శుభ్‌'మయంగా మారింది. ఈ ఏడాది ఈ టీమిండియా యంగ్‌ డైనమైట్‌ ఫార్మాట్లకతీతంగా చెలరేగుతూ, సెంచరీల మీద సెంచరీలు చేస్తూ, పరుగుల వరద పారిస్తూ రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఆసీస్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 24) జరుగుతున్న రెండో వన్డేలో శతక్కొట్టిన గిల్‌ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) వన్డేల్లో ఆరో సెంచరీని, ఈ ఏడాది ఐదో వన్డే శతకాన్ని, ఓవరాల్‌గా (అన్ని ఫార్మాట్లలో) ఈ ఏడాది ఏడో శతకాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో గిల్‌ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో 5 అంతకంటే ఎక్కువ వన్డే సెంచరీలు చేసిన ఏడో భారత ఆటగాడిగా.. 25 ఏళ్లలోపే ఈ ఘనత సాధించిన ఐదో ప్లేయర్‌గా.. భారత్‌ తరఫున వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 

ఈ రికార్డులతో పాటు గిల్‌ ఈ ఏడాది దాదాపు అన్ని విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచాడు. అవేంటంటే.. 

  • వన్డే కెరీర్లో మొత్తంగా 35 మ్యాచ్‌లు ఆడి 66.10 సగటున 6 సెంచరీలు, 9 అర్ధసెంచరీల సాయంతో 1919 పరుగులు చేసిన గిల్‌.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆడిన 20 మ్యాచ్‌ల్లో 1230 పరుగులు చేసి, వన్డేల్లో ఈ ఏడాది టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 
  • 2023లో వన్డేల్లో అత్యధిక సెంచరీలు (5) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 
  • ఈ ఏడాది అత్యధిక అంతర్జాతీయ పరుగులు (అన్ని ఫార్మాట్లలో): 1763
  • ఈ ఏడాది అత్యధిక సెంచరీలు (అన్ని ఫార్మాట్లలో): 7
  • ఈ ఏడాది అత్యధిక సిక్సర్లు (అన్ని ఫార్మాట్లలో): 46
  • ఈ ఏడాది అత్యధిక ఫోర్లు (అన్ని ఫార్మాట్లలో): 186
  • ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు: 10
  • ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక బౌండరీలు: 139

ఇలా గిల్‌ ఈ ఏడాది దాదాపుగా అన్ని విభాగాల్లో టాప్‌లో కొనసాగుతున్నాడు. 

వన్డే అగ్రపీఠం దిశగా..
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న గిల్‌.. ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో విచ్చలవిడిగా పరుగులు చేస్తూ అగ్రపీఠం దిశగా దూసుకుపోతున్నాడు. ఆసీస్‌తో సిరీస్‌కు ముందు 814 రేటింగ్‌ పాయింట్లు కలిగిన గిల్‌.. ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న బాబర్‌ ఆజమ్‌ను దాటేందుకు 44 పాయింట్ల దూరంలో ఉన్నాడు. ఆసీస్‌పై తొలి వన్డేలో 74 పరుగులు, రెండో వన్డేలో 104 పరుగులు చేసిన గిల్‌.. వన్డే అగ్రస్థానం దక్కించుకునేందుకు కావాల్సిన 44 పాయింట్లను ఈ రెండు ప్రదర్శనలతోనే సాధిస్తాడు. ఈ సిరీస్‌లో మరో మ్యాచ్‌ కూడా ఉండటంతో గిల్‌ వన్డే టాప్‌ ర్యాంక్‌కు చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. 

ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ ఇరగదీసిన గిల్‌..
అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాకుండా ఈ ఏడాది గిల్‌ ఐపీఎల్‌లోనే సత్తా చాటాడు. 2023 ఐపీఎల్‌లో 17 మ్యాచ్‌లు ఆడిన గిల్‌ 59.33 సగటున, 157.80 స్ట్రయిక్‌రేట్‌తో 890 పరుగులు చేసి, ఎడిషన్‌ టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఎడిషన్‌లో మొత్తం 3 సెంచరీలు బాదిన గిల్‌.. అత్యధిక పరుగులతో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోర్‌, అత్యుత్తమ సగటు, అత్యధిక శతకాలు,అత్యధిక ఫోర్లు.. ఇలా పలు విభాగాల్లో టాప్‌లో నిలిచాడు. 

ఇదిలా ఉంటే, రెండో వన్డేలో టాస్‌ ఓడి ఆసీస్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (104), శ్రేయస్‌ అయ్యర్‌ (105) శతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 72 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (52) అర్ధసెంచరీతో రాణించగా.. ఇషాన్‌ కిషన్‌ (31) పర్వాలేదనిపించాడు.

రుతురాజ్‌ (8) ఒక్కడే విఫలమయ్యాడు. ఆసీస్‌ బౌలర్లలో కెమరూన్‌ గ్రీన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్‌ జంపా, జోష్‌ హాజిల్‌వుడ్‌, సీన్‌ అబాట్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్‌ (9), స్టీవ్‌ స్మిత్‌ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 7 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 43/2గా ఉంది. లబూషేన్‌ (12), వార్నర్‌ (19) క్రీజ్‌లో ఉన్నారు.
 

Advertisement
Advertisement