Viral Video: ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అశ్విన్‌ను చూసే నేర్చుకోవాలి..! | Sakshi
Sakshi News home page

IND VS ENG 5th Test Day 1: ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అశ్విన్‌ను చూసే నేర్చుకోవాలి..!

Published Thu, Mar 7 2024 5:56 PM

IND VS ENG 5th Test Day 1: Iconic Moment Between Ashwin And Kuldeep - Sakshi

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. తొలుత ఇంగ్లండ్‌ను 218 పరుగులకే కుప్పకూల్చిన భారత్‌.. ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ రెచ్చిపోయి భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తుంది.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్‌ నష్టపోయి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (57) మెరుపు అర్దశతకం చేసి ఔట్‌ కాగా.. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (52) హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. రోహిత్‌కు జతగా శుభ్‌మన్‌ గిల్‌ (26) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్‌.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు కేవలం 83 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. 

కాగా, ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ పూర్తయిన తర్వాత మైదానంలో తారసపడిన ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేసిన అనంతరం భారత ఆటగాళ్లు పెవిలియన్‌కు వెళ్తుండగా వందో టెస్ట్‌ ఆడుతున్న​ అశ్విన్‌ను ముందుగా నడవమని సహచర ఆటగాళ్లు కోరారు.

అయితే ఐదు వికెట్లు తీసిన కుల్దీప్‌ ఇన్నింగ్స్‌ హీరో కావడంతో అశ్విన్‌ సహచరుల మాటకు ఒప్పుకోలేదు. కుల్దీప్‌నే ముందుగా నడవాల్సిందిగా కోరాడు. ఇలా నువ్వు-నేను అంటూ అశ్విన్‌, కుల్దీప్‌ మధ్య కాసేపు చర్చ జరిగింది. చివరికి అశ్విన్‌.. కుల్దీప్‌ను ఒప్పించాడు. కుల్దీప్‌ టీమ్‌ను లీడ్‌ చేస్తూ పెవిలియన్‌వైపు నడిచాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడయో నెట్టింట వైరలవుతుంది. వందో టెస్ట్‌ ఆడుతూ 500కు పైగా వికెట్లు తీసిన అశ్విన్‌ హుందాతనం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంత ఎదిగినా ఒదగడం అశ్విన్‌ను చూసే నేర్చుకోవాలంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. కుల్దీప్‌ యాదవ్‌ (5/72), అశ్విన్‌ (4/51), జడేజా (1/17) దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్‌ 27, పోప్‌ 11, రూట్‌ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్‌ 0, ఫోక్స్‌ 24, హార్ట్లీ 6, వుడ్‌ 0, ఆండర్సన్‌ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్‌ బషీర్‌ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement