IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్‌.. ఇందులోనైనా ఆర్సీబీ గెలుస్తుందా..? | Sakshi
Sakshi News home page

IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్‌.. ఇందులోనైనా ఆర్సీబీ గెలుస్తుందా..?

Published Mon, Mar 25 2024 4:16 PM

IPL 2024 Bengaluru: RCB VS PBKS Match Details And Prediction - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 25) పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. 

ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఆర్సీబీ భావిస్తుండగా.. పంజాబ్‌ సీజన్‌లో వరుసగా రెండో విజయంపై కన్నేసింది. ఆర్సీబీ సీజన్‌ తొలి మ్యాచ్‌లో  సీఎస్‌కే చేతిలో ఓటమిపాలు కాగా.. పంజాబ్‌ తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. 

తొలి మ్యాచ్‌లో ఆయా జట్ల ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం.. ఆర్సీబీ కంటే పంజాబ్‌ అన్ని విభాగాల్లో మెరుగ్గా కనిపించింది. ఆర్సీబీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పేపర్‌పై బలంగా కనిపించినప్పటికీ తొలి మ్యాచ్‌లో స్టార్‌ బ్యాటర్లంతా విఫలమయ్యారు. 8 ఫోర్లు బాది డుప్లెసిస్‌ (35) ప్రమాదకరంగా కనిపించినప్పటికీ.. ఆ మ్యాచ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ముస్తాఫిజుర్‌ అతన్ని పెవిలియన్‌కు పంపాడు. 

విరాట్‌ విషయానికొస్తే.. ఆ మ్యాచ్‌లో అతని బ్యాటింగ్‌ నత్త నడకను తలపించింది. అతను 20 బంతులను ఎదుర్కొని కేవలం 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రజత్‌ పాటిదార్‌, మ్యాక్స్‌వెల్‌ డకౌటై దారుణంగా నిరాశపర్చగా.. కోట్లు పెట్టి అరువు తెచ్చుకున్న కెమారూన్‌ గ్రీన్‌ తుస్సుమనిపించాడు. 

వికెట్‌కీపర్లు అనూజ్‌ రావత్‌ (48), దినేశ్‌ కార్తీక్‌ (38 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడకపోయుంటే ఆర్సీబీ 100 పరుగులు చేయడం కూడా కష్టంగా ఉండేది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు కూడా తేలిపోయారు. స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్‌ చేసుకునే క్రమంలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. అల్జరీ జోసఫ్‌, కర్ణ్‌ శర్మ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 

మయాంక్‌ డాగర్‌ కాస్త పర్వాలేదనిపించగా.. గ్రీన్‌ 2 వికెట్లు తీసి నాట్‌ బ్యాడ్‌ అనిపించాడు. పంజాబ్‌తో ఇవాల్టి మ్యాచ్‌లో ఆర్సీబీ అదనపు పేసర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. కర్ణ​ శర్మ స్థానంలో ఆకాశదీప్‌ తుది జట్టులోకి రావచ్చు.

పంజాబ్‌ విషయానికొస్తే.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి విజయం సొంతం చేసుకుంది. అర్ష్‌దీప్‌ సింగ్‌, రబాడ, రాహుల్‌ చాహర్‌ తమ కోటా ఓవర్లు పూర్తి చేసి పర్వాలేదనిపించగా.. హర్షల్‌ పటేల్‌ రెండు వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.  హర్ప్రీత్‌ బ్రార్‌ పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్‌ పడగొట్టాడు. బ్యాటింగ్‌లో సత్తా చాటిన సామ్‌ కర్రన్‌ ఒకే ఓవర్‌ బౌల్‌ చేశాడు.

ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పంజాబ్‌ బ్యాటర్లు పర్వాలేదనిపించారు. కర్రన్‌ (63) అర్దసెంచరీతో రాణించగా..  లివింగ్‌స్టోన్‌ (38 నాటౌట్‌), శిఖర్‌ ధవన్‌ (22), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ నాట్‌ బ్యాడ్‌ అనిపించారు. ఆర్సీబీతో ఇవాల్టి మ్యాచ్‌ పంజాబ్‌ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఢిల్లీతో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. 

ఆర్సీబీ తుది జట్టు (అంచనా): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్‌కీపర్‌), అల్జరీ జోసెఫ్‌, ఆకాశ్‌దీప్‌, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్

పంజాబ్‌ తుది జట్టు (అంచనా): శిఖర్ ధవన్ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట​్‌కీపర్‌), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
 

Advertisement
Advertisement