జడ్డూ అవుట్‌ కావాలి కదా? కమిన్స్‌ ఎందుకు వదిలేశాడు? వైరల్‌ | Sakshi
Sakshi News home page

జడ్డూ అవుట్‌ కావాలి కదా? కమిన్స్‌ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్‌

Published Sat, Apr 6 2024 8:59 AM

IPL 2024 Cummins Withdraws Run Out Appeal vs Jadeja Field Obstruction Viral - Sakshi

IPL 2024- SRH Crush CSK By 6 Wickets: ఐపీఎల్‌-2024లో సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి విజయ గర్జన చేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను మట్టికరిపించి ఉప్పల్‌లో జయభేరి మోగించింది. హోం గ్రౌండ్‌లో వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. 

హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన రైజర్స్‌.. సీఎస్‌కేను 165 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగి పదకొండు బంతులు మిగిలి ఉండగానే పని పూర్తి చేసింది. ఆరు వికెట్ల తేడాతో సీఎస్‌కేపై విజయం సాధించింది.

ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉప్పల్‌ పిచ్‌పై పరుగులు రాబట్టేందుకు సీఎస్‌కే బ్యాటర్లు కష్టపడుతున్న వేళ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. మొత్తంగా 23 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 31 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.

నిజానికి 19వ ఓవర్‌ నాలుగో బంతికే జడ్డూ అవుట్‌ కావాల్సింది. సన్‌రైజర్స్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన జడేజా విఫలమయ్యాడు. పరుగు కోసం క్రీజును వీడిన జడ్డూ.. భువీ చేతికి బంతి చిక్కడాన్ని గమనించి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. 

ఈ క్రమంలో రనౌట్‌ కాకుండా.. ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డుతగిలినట్లు కనిపించింది. విషయాన్ని గమనించిన సన్‌రైజర్స్‌ వికెట్‌ కీపర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ నిబంధనల ప్రకారం.. ‘‘అబ్‌స్ట్రకింగ్‌ ది ఫీల్డ్‌’’కు సిగ్నల్‌ ఇచ్చాడు.

అంపైర్లు సైతం ఈ విషయం గురించి స్పష్టత కోసం థర్డ్‌ అంపైర్‌ను సంప్రదించేందుకు సిద్ధమయ్యారు. అయితే, అనూహ్యంగా సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ జడేజా విషయంలో అప్పీలును వెనక్కి తీసుకున్నాడు. ఫలితంగా లైఫ్‌ పొందిన జడ్డూ ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచాడు.

ఈ క్రమంలో జడ్డూ ‘అబ్‌స్ట్రకింగ్‌ ది ఫీల్డ్‌’ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌.. ప్యాట్‌ కమిన్స్‌ క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాడంటూ ప్రశంసిస్తున్నారు. అయితే, మరికొంత మంది నెటిజన్లు మాత్రం ధోని ముందుగా బ్యాటింగ్‌కు రావడాన్ని అడ్డుకునేందుకే కమిన్స్‌.. జడ్డూ విషయంలో అప్పీలు వెనక్కి తీసుకున్నాడని అభిప్రాయపడుతున్నారు.

అబ్‌స్ట్రకింగ్‌ ది ఫీల్డ్‌?
ఫీల్డింగ్‌ చేస్తున్న జట్టుకు తన మాటలు లేదంటే చర్యల ద్వారా ఒక బ్యాటర్‌ ఉద్దేశపూర్వకంగా అడ్డుతగిలితే.. అబ్‌స్ట్రకింగ్‌ ది ఫీల్డ్‌ నిబంధన కింద అతడిని అవుట్‌గా ప్రకటిస్తారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement