చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్‌ | AP Elections 2024: CM YS Jagan Speech At Repalle Road Show | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: రేపల్లె రోడ్‌షోలో సీఎం జగన్‌

Published Mon, May 6 2024 12:18 PM | Last Updated on Mon, May 6 2024 1:31 PM

AP Elections 2024: CM YS Jagan Speech At Repalle Road Show

బాపట్ల, సాక్షి: పద్నాలుగేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు నాయుడి పేరు చెబితే ఒక్క పథకం, చేసిన మంచి గుర్తుకు రాదని.. 58 నెలల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులెన్నో తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం రేపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

రేపల్లె సిద్ధమేనా? మండుటెండను లెక్క చేయకుండా వచ్చిన మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య మీ బిడ్డ ఇక్కడకు వచ్చిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ జగన్‌ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. చంద్రబాబును నమ్మడం అంటే.. మళ్లీ మోసపోటం. చంద్రముఖిని నిద్ర లేపడమే. చంద్రబాబును మళ్లీ నమ్మడం అంటే.. కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు ఇదే అర్థం. ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోండి.

చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి

దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2లక్షల 70 వేల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అయ్యాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.. నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులు వెళ్లిపోయాయి. మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది  గతంలో ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా?

గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వం ఇది. మీ బిడ్డ పాలనలోనే ఈ మార్పు అంతా.

ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ మీకు అందాయా అని మీరే ఆలోచించండి. గవర్నమెంట్‌ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బైలింగువల్‌ టెక్స్ట్‌ బుక్స్‌, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన.. చదువుల కోసం తెచ్చిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా చూసారా?..

అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని తోడుగా ఉంటూ..  ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వారిపేరిట రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమంతో పాటు  అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం కూడా చేపట్టాం. అక్కచెల్లెమ్మల స్వాలంబన, సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎక్కడైనా ఉందా?

అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌ కానుక. ఇంటి వద్దకే పౌర సేవలు, పథకాలు.. ఇవన్నీ ఇంటికే వచ్చే పాలనగానీ, పథకాలుగానీ గతంలో ఎప్పుడైనా చూశారా?.  రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా రైతుభరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.

స్వయం ఉపాధికి అండగా తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర,  నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?

పేదవాడు ఆరోగ్యం కోసం అప్పులు పాలవ్వకూడదని... పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్‌. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.

గ్రామ సచివాలయ వ్యవస్ధతో సమూల మార్పులు. గ్రామంలో అడుగు పెడుతూనే ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 60-70 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థ. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను.

గ్రామంలోకి అడుగుపెడుతూనే ఒక సచివాలయ వ్యవస్థ. ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్‌. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు-నేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం ఓ మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల ఫోన్‌లో దిశ యాప్. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.

మరో పక్క 14 ఏళ్లు సీఎంగా చేసానంటాడు చంద్రబాబు. 3 సార్లు సీఎం అంటాడు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఆయన చేసిన మంచి ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని నా అవ్వాతాతలను, అక్కాచెల్లెమ్మలను అడుగుతున్నాను. చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్‌ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతున్నాను. మరి ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చంద్రముఖి. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో...ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను.

మన రాష్ట్రం ఒక పంట పొలం అనుకుంటే.. ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యతను జగన్‌ అనే ఒక రైతుకి ఇచ్చారనుకోండి. ఆ జగన్‌ అనే మీ బిడ్డ.. మీ అన్న ఈ ఐదేళ్లలో రాష్ట్రమనేఘీ పొలంలో గడగడా చెప్పిన స్కీమ్‌లు, చేసిన మార్పులు, విప్లవాత్మకమార్పులు.. వీటినే విత్తనాలుగా ఇంటింటా అభివృద్ధి, సంక్షేమం, మంచి భవిష్యత్తు అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ. ఇవాళ్టికి ఐదు సంవత్సరాలు అయ్యింది. ప్రతీ గ్రామం, పట్టణం, సామాజిక వర్గంలో నాటిన మొక్కలు ఐదేళ్లుగా పెరుగుతూ వచ్చాయి. మరో పదిహేనేళ్లలో ఇవి వృక్షాలు అవుతాయి. పిల్లలు క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు. బతుకులు, తలరాతలు మారుతాయి. పేదరికం మటుమాయమైపోతుంది. ఈ బిడ్డ ప్రతీ ఆలోచన పేదవాడి బతుకు ఎలా మార్చాలనే.  

మరో వంక చంద్రబాబుని చూస్తే 14 ఏళ్లు పని చేసిన ఈ పెద్దమనిషి పేరు చెబితే.. తాను ఫలానా మంచి చేశాను, స్కీమ్‌ ఇచ్చానని చెప్పుకోలేని స్థితి. ఆయన మోసాలు గమనించాలి. చంద్రబాబు అధికారం వస్తే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన ఈ పాంప్‌లెంట్‌ చూస్తే అర్థమవుతుంది.

ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్‌ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి.. ప్రధాన హామీల పేరుతో సంతకం పెట్టిన ఈ పాంప్లెట్‌ను మీ ప్రతి ఇంటికీ పంపించాడు. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి.

రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా?

రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్కాచెల్లెమ్మల పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు,  ఏకంగా రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇందులో ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా?.

మూడో ముఖ్యమైన హామీ.. అక్కా మూడో ముఖ్యమైన హామీ.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఒక్కరి ఖాతాలో అయినా కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ వేశాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

ముఖ్యమైన హామీల్లోనాలుగోది.. ఇంటింటికీ ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

ఐదో హామీ.. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు.  ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌, చేనేత పవర్‌ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు.. అయ్యిందా?. విమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు.. చేశాడా?.  సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? మన రేపల్లెలో ఏమైనా కనిపిస్తోందా? మరి ఆలోచన చేయమని అడుగుతున్నా. కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అయిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చాడా? దాన్నీ అమ్మేశాడు. మరి నేను అడుగుతున్నా. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా?..

ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురూ కూటమిగా ఏర్పడ్డారు. ఇదే చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ అంట నమ్ముతారా?, సూపర్‌ సెవెన్‌ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.

ఇలాంటి మోసగాళ్లతో, వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. మళ్లీ వలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్‌ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఫ్యాన్‌ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు.. సిద్ధమేనా?.

ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, అక్కడ చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్.. అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి.

మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈవూరు గణేష్, ఎంపీ అభ్యర్థిగా నందిగాం సురేష్‌లపై‌పై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను అని చెబుతూ సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement