టీమిండియా భవిష్య కెప్టెన్ గురించి బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు సారథిగా పగ్గాలు చేపట్టగల అర్హత అతడికే ఉందంటూ ఓ ముంబైకర్ పేరు చెప్పాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్‌ను చేసింది బీసీసీఐ. హిట్‌మ్యాన్ సారథ్యంలో అన్ని ఫార్మాట్లలో ఏక కాలంలో నంబన్ వన్‌గా నిలిచిన టీమిండియా.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది.
ఫైనల్ వరకూ వచ్చినా
టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లోనే నిష్క్రమించిన రోహిత్ సేన.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడి ట్రోఫీని ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. అదే విధంగా.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లోనూ విజయ లాంఛనం పూర్తి చేయలేక.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఆఖరి మెట్టుపై టైటిల్‌ను చేజార్చుకుంది.
ఇక ఇప్పుడు మరో మెగా టోర్నీకి టీమిండియా సిద్ధమవుతోంది. పొట్టి ఫార్మాట్‌లో వరల్డ్‌కప్ ఈవెంట్‌కు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ శర్మ నాయకత్వంలోని పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఇందులో మిడిలార్డర్ బ్యాటర్, క్రమశిక్షణా చర్యల నేపథ్యంలో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం చోటు దక్కలేదు. అయితే, ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా మాత్రం అయ్యర్ దూసుకుపోతున్నాడు.
ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో కేకేఆర్ ఎనిమిది గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్‌ఎస్‌కే ప్రసాద్ అయ్యర్ కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలా కాదు.
‘‘హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలా కాదు.. శ్రేయస్ అయ్యర్‌ను టీమిండియా తదుపరి కెప్టెన్‌గా తీర్చిదిద్దబడ్డాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ క్రమపద్ధతిలో సారథిగా ఎదిగేందుకు బాటలు వేసుకున్నాడు.
గత రెండేళ్లలో అతడి గణాంకాలు అద్బుతం. ఇక ఇండియా-ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. నాకు తెలిసి ఇండియా- ఏ ఆడిన 10 సిరీస్‌లలో ఎనిమిది గెలిచింది. అందులో ఎక్కువసార్లు భారత జట్టును ముందుకు నడిపింది శ్రేయస్ అయ్యరే!
టీమిండియా తదుపరి కెప్టెన్‌గా అతడు తయారుచేయబడ్డాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తర్వాత సారథిగా రిషభ్ పంత్‌తో శ్రేయస్ అయ్యర్ పోటీపడుతున్నాడు.
పంత్ కంటే ముందే..
నిజానికి పంత్ కంటే కూడా శ్రేయస్ అయ్యర్ ఒక అడుగు ముందే ఉన్నాడని చెప్పవచ్చు’’ అని రెవ్‌స్ట్పోర్ట్స్‌తో ఎంఎస్‌కే ప్రసాద్ వ్యాఖ్యానించాడు. అయితే, ఇదంతా గతం. బీసీసీఐతో విభేదాల నేపథ్యంలో అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడంతో ఇప్పుడు జట్టులో స్థానం గురించి పోటీ పడాల్సిన పరిస్థితి.
చదవండి: ‘SRH అని ఎవరన్నారు?.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
Comments
Please login to add a commentAdd a comment