
టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో రిషభ్ పంత్ వేసిన మాస్టర్ ప్లాన్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. మోకాలి గాయం పేరిట పంత్ ఆలస్యం చేయడం వల్ల సౌతాఫ్రికాను దెబ్బకొట్టగలిగామని పేర్కొన్నాడు. అయితే, తాము చాంపియన్లుగా నిలవడానికి ఇదొక్కటే కారణం కాదని.. సమిష్టి ప్రదర్శనతో ట్రోఫీ గెలిచామని తెలిపాడు.
ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించి
కాగా ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు పదకొండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ ఐసీసీ టోర్నీలో జయభేరి మోగించింది. తుదిపోరులో సౌతాఫ్రికాను ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది.
అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం టీమిండియా వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్.. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో గెలిచాడు. తదుపరి న్యూజిలాండ్‌తో టెస్టులతో బిజీ కానున్నాడు.
తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడు
ఈ క్రమంలో రోహిత్ శర్మ కపిల్ శర్మ షోకు హాజరైన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా వరల్డ్‌కప్ ఫైనల్ నాటి ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. ‘‘అప్పటికి సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేయాల్సిన పటిష్ట స్థితిలో ఉంది. అంతకంటే కాస్త ముందు మాకు చిన్న విరామం దొరికింది.
అప్పుడే పంత్ తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడు. అతడి మోకాలికి గాయమైనట్లుగా కనిపించాడు. ఫిజియోథెరపిస్టులు వచ్చి అతడి మోకాలికి కట్టుకట్టారు. నిజానికి అప్పుడు సౌతాఫ్రికా మంచి రిథమ్‌లో ఉంది. త్వరత్వరగా బ్యాటింగ్ ముగించేయాలని చూసింది.
అయితే, పంత్ చేసిన పనివల్ల సౌతాఫ్రికా మొమెంటమ్ కాస్త నెమ్మదించేలా చేయగలిగాం. వారి ఊపును కాస్త నిలువరించగలిగాం. ఆ సమయంలో బంతిని దబాదబా బాదేయాలని కాచుకుని ఉన్నారు బ్యాటర్లు. అయితే, పంత్ వల్ల వారి రిథమ్‌ను మేము బ్రేక్ చేయగలిగాం.
పంత్ అకస్మాత్తుగా కింద పడిపోయాడు
నేను ఫీల్డింగ్ సెట్.. చేస్తూ బౌలర్లతో మాట్లాడుతున్న సమయంలో పంత్ అకస్మాత్తుగా కింద పడిపోవడం గమనించాను. ఫిజియోథెరపిస్ట్ వచ్చి చికిత్స చేశారు. మ్యాచ్ త్వరగా మొదలుపెట్టాలని క్లాసెన్ చూస్తున్న సమయంలో ఇలాంటి ఘటన వారిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు.
అయినా, మేము గెలవడానికి ఇదొక్కటే ప్రధాన కారణం అని చెప్పను. అయితే, విజయానికి దారితీసిన పరిస్థితుల్లో ఇదొకటి. పంత్ సాబ్ మైదానంలో ఇలా తన స్మార్ట్‌నెస్ చూపిస్తూ.. మాకు మేలు చేస్తూ ఉంటాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పంత్ వల్ల జరిగిన ఆలస్యానికి జరిమానా ఎదుర్కోవడానికి కూడా తాము రిస్క్ చేసినట్లు తెలిపాడు.
పాండ్యా చేసిన అద్భుతం
కాగా సౌతాఫ్రికా విజయానికి 30 పరుగుల దూరంలో ఉన్నపుడు విధ్వంసకర వీరులు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నారు. అయితే, హార్దిక్ పాండ్యా పదిహేడో ఓవర్లో తొలి బంతికి క్లాసెన్(52)ను వెనక్కి పంపడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక ఆఖరి ఓవర్లోనూ హార్దిక్ అద్భుతం చేశాడు. మిల్లర్(21)తో పాటు టెయిలెండర్లు కగిసో రబడ(3), అన్రిచ్ నోర్జే(1)లను అవుట్ చేసి భారత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు.
ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొమ్మిది పరుగులకే పరిమితం కాగా.. పంత్ డకౌట్ అయ్యాడు. కోహ్లి 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.
చదవండి: ఐపీఎల్‌లో ఆ జట్టుకు కెప్టెన్‌గా సూర్య?.. స్పందించిన ‘స్కై’
Captain Rohit Sharma revealed the untold story of Rishabh Pant when India needed to defend 30 runs in 30 balls. Two Brothers ! 🥺❤️
pic.twitter.com/EmqIrrCFb3— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 (@IamHydro45_) October 5, 2024