రోహిత్ శర్మ (PC: ICC)
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)- 2024(ICC Mens T20I Team of the Year) ఏడాదికి గానూ పురుషుల అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. పొట్టి ఫార్మాట్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న పదకొండు మంది ఆటగాళ్ల పేర్లను శనివారం వెల్లడించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) ఎంపికయ్యాడు.
ఇక హిట్‌మ్యాన్‌తో పాటు మరో ముగ్గురు భారత స్టార్ క్రికెటర్లకు ఈ టీమ్‌లో చోటు దక్కింది. అయితే, ఇందులో విరాట్ కోహ్లి(Virat Kohli) మాత్రం లేకపోవడం గమనార్హం.
మరోవైపు.. ఈ జట్టులో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రవిస్ హెడ్ ఎంపిక కాగా.. వన్‌డౌన్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ చోటు దక్కించుకున్నాడు.
ఇక మిడిలార్డర్‌లో నాలుగో స్థానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, ఐదో నంబర్ బ్యాటర్‌గా, వికెట్ కీపర్ కోటాలో వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్ స్థానం సంపాదించాడు.
ఏడో స్థానంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక కాగా.. అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్, శ్రీలంక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. పేస్ దళంలో టీమిండియా ప్రధాన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు యువ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ స్థానం సంపాదించుకున్నారు.
రోహిత్ రిటైర్మెంట్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2024లో 11 అంతర్జాతీయ టీ20లు ఆడి 378 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది. స్ట్రైక్‌రేటు 160.16. తన అద్భుత నాయకత్వ లక్షణాలతో టీమిండియాను వరల్డ్‌కప్-2024 చాంపియన్‌గా నిలిపాడు. దాదాపు పదమూడేళ్ల తర్వాత మరోసారి టీమిండియాకు ఐసీసీ ట్రోఫీని అందించాడు.
నో కోహ్లి
ఈ మెగా టోర్నీలో భారత్ జగజ్జేతగా నిలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్‌తో పాటు ఈ ఈవెంట్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లికి మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. ఇక రోహిత్, కోహ్లిలతో పాటు రవీంద్ర జడేజా కూడా వెస్టిండీస్‌లో సౌతాఫ్రికాతో ఫైనల్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు.
ఇక గతేడాది ట్రవిస్ హెడ్ 15 టీ20లలో కలిపి 539 పరుగులు చేయగా.. ఫిల్ సాల్ట్ 17 మ్యాచ్‌లు ఆడి 467 రన్స్ చేశాడు. బాబర్ ఆజం 24 మ్యాచ్‌లలో కలిపి 734 పరుగులతో రాణించాడు. నికోలస్ పూరన్ 21 మ్యాచ్‌లలో భాగమై 464 పరుగులు చేశాడు. ఇక జింబాబ్వే తరఫున ఎప్పటిలాగానే గతేడాది కూడా సికిందర్ రజా అదరగొట్టాడు. 24 మ్యాచ్‌లు ఆడి 573 పరుగులు చేశాడు.
హార్దిక్ పాండ్యాది కీలక పాత్ర
టీమిండియా ఈసారి వరల్డ్‌కప్ గెలవడంలో భారత పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాది కీలక పాత్ర. ఇక ఓవరాల్‌గా గతేడాది అతడు 17 మ్యాచ్‌లలో కలిపి 352 పరుగులు చేయడంతో పాటు 16 వికెట్లు తీశాడు.
ఇక రషీద్ ఖాన్ 14 మ్యాచ్‌లు ఆడి 31 వికెట్లు తీశాడు. అత్యుత్తమంగా 4/14తో రాణించాడు. వనిందు హసరంగ 20 మ్యాచ్‌లలో కలిపి 179 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు పడగొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడినా 3/7 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి.. 15 వికెట్లు కూల్చాడు.
మరోవైపు.. మరో టీమిండియా స్టార్ అర్ష్‌దీప్ సింగ్ 18 మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/9. ఇతడు సాధించిన 36 వికెట్లలో పదిహేడు వరల్డ్‌కప్-2024 టోర్నీలో తీసినవే. తద్వారా నాటి మెగా ఈవెంట్లో సెకండ్ లీడింగ్‌వికెట్ టేకర్‌గానిలిచాడు.
ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2024
రోహిత్ శర్మ(కెప్టెన్- ఇండియా),ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా), ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్), బాబర్ ఆజం(పాకిస్తాన్), నికోలస్ పూరన్(వికెట్ కీపర్- వెస్టిండీస్), సికందర్ రజా(జింబాబ్వే), హార్దిక్ పాండ్యా(ఇండియా), రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), వనిందు హసరంగ(శ్రీలంక), జస్‌ప్రీత్ బుమ్రా(ఇండియా), అర్ష్‌దీప్ సింగ్(ఇండియా).
Comments
Please login to add a commentAdd a comment