IPL 2023 LSG VS PBKS: Dhawan Says Strategy To Playing With Extra Bowler BackFired - Sakshi
Sakshi News home page

IPL 2023 LSG VS PBKS: ఆ నిర్ణయమే పంజాబ్‌ కొంపముంచిందట..!

Published Sat, Apr 29 2023 11:41 AM

LSG VS PBKS: Dhawan Says Playing With Extra Bowler BackFired - Sakshi

ఐపీఎల్‌-2023లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 28) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 56 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం పంజాబ్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ మీడియాతో మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. తాను తీసుకున్న ఓ నిర్ణయం మిస్‌ ఫైర్‌ అయ్యి, అదే తమ కొంపముంచిందని అభిప్రాయపడ్డాడు.

ఎక్స్‌ట్రా ఫాస్ట్‌ బౌలర్‌తో బరిలోకి దిగడమే తాము చేసిన అతిపెద్ద తప్పిదమని, అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగిన లక్నోకు అదే కలిసొచ్చిందని తెలిపాడు. రాహుల్‌ చాహర్‌ (4-0-29-0) మినహా తమ బౌలర్లంతా ధారళంగా పరుగులు సమర్పించుకున్నారని, అందుకు తగిన మూల్యం జట్టు మొత్తం చెల్లించుకుందని అన్నాడు. ఇది తమకో గుణపాఠమని చెప్పిన ధవన్‌.. భారీ లక్ష్య ఛేదనలో తాను త్వరగా ఔట్‌ కావడంపై కూడా స్పందించాడు.

బంతి తాను ఊహించినంత క్విక్‌గా లేదని, అందుకే తానాడిన షాట్‌ నేరుగా ఫీల్డర్‌ చేతుల్లోకి వెళ్లిందని తెలిపాడు. ఛేదనలో ఓ దశలో (అథర్వ ధాటిగా ఆడుతున్నప్పుడు) గెలుపుపై ఆశలు చిగురించాయని, అయితే లక్నో బౌలర్లు అద్భుతంగా చేసి తమను కట్టడి చేశారని పేర్కొన్నాడు. షారుక్‌ ఖాన్‌ను ఆఖర్లో ఆడించడంపై స్పందిస్తూ.. లివింగ్‌స్టోన్‌, సామ్‌ కర్రన్‌ లాంటి భారీ హిట్టర్లు ఉండగా, షారుక్‌ను ముందు పంపే సాహసం చేయలేదని చెప్పుకొచ్చాడు. 

కాగా, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 56 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో తడబడిన పంజాబ్‌, తమ శక్తి మేరకు ప్రయత్నించి 201 పరుగులకు (19.5) ఆలౌటైంది. లక్నో ఇన్నింగ్స్‌లో కైల్‌ మేయర్స్‌ (54), ఆయూష్‌ బదోని (43), స్టోయినిస్‌ (72), పూరన్‌ (45) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడగా.. పంజాబ్‌ తరఫున అథర్వ టైడే (66), సికందర్‌ రజా (36), లివింగ్‌స్టోన్‌ (23), కర్రన్‌ (21), జితేశ్‌ శర్మ (24) ఓ మోస్తరుగా రాణించారు. లక్నో బౌలర్లు యశ్‌ ఠాకూర్‌ 4, నవీన్‌ ఉల్‌ హాక్‌ 3, బిష్ణోయ్‌ 2, స్టోయినిస్‌ ఓ వికెట్‌ సాధించారు.  

Advertisement
Advertisement