పాక్‌ కెప్టెన్‌గా మళ్లీ బాబర్‌!.. అల్లుడికి అండగా షాహిద్‌ ఆఫ్రిది | Sakshi
Sakshi News home page

పాక్‌ కెప్టెన్‌గా మళ్లీ బాబర్‌!.. అల్లుడికి అండగా షాహిద్‌ ఆఫ్రిది

Published Wed, Mar 27 2024 3:43 PM

Shahid Afridi Blunt Message To PCB On Son In Law Likely Sacking As T20 Captain - Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తీరును ఆ దేశ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది విమర్శించాడు. బోర్డు పెద్దలు మారినప్పుడల్లా వారికి అనుగుణంగా నిర్ణయాలు మారిపోతూ ఉంటాయని.. తమ క్రికెట్‌ వ్యవస్థలో ఉన్న అతిపెద్ద సమస్య ఇదేనని పేర్కొన్నాడు.

కాగా పీసీబీ యాజమాన్యం తరచూ మారుతున్న విషయం తెలిసిందే. ప్రధాని షాబాజ్‌ జోక్యం నేపథ్యంలో రమీజ్‌ రాజాను అధ్యక్షుడిగా తప్పించి.. నజమ్‌ సేథీని తాత్కాలిక చైర్మన్‌గా నియమించారు. అనంతరం నజమ్‌ సేథీ కూడా వైదొలగడంతో.. అతడి స్థానంలో జకా అష్రాఫ్‌ బాధ్యతలు చేపట్టాడు.

అతడు కూడా రాజీనామా చేయడంతో సుప్రీం కోర్టు న్యాయవాది షా ఖవార్‌ నియమితులయ్యారు. తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన పీసీబీ ఎన్నికలు ముగిసే వరకు ఈ పదవిలో కొనసాగుతారని ప్రకటించారు. అనంతరం ఎలక్షన్‌లో గెలిచిన మొహ్సిన్‌ నఖ్వీ పీసీబీ బాస్‌ అయ్యాడు.

ఇదిలా ఉంటే..  వన్డే వరల్డ్‌కప్‌-2023లో కనీసం సెమీస్‌ కూడా చేరుకుండా పాకిస్తాన్‌ నిష్క్రమించడంతో కెప్టెన్‌ బాబర్‌ ఆజంపై వేటు వేశారు. అతడి స్థానంలో టెస్టు కెప్టెన్‌గా షాన్‌ మసూద్‌, టీ20 కెప్టెన్‌గా షాహిన్‌ ఆఫ్రిదిని నియమించారు.

అయితే, వీరిద్దరి సారథ్యంలో తొలి సిరీస్‌లలోనే పాకిస్తాన్‌ ఘోర పరాజయాలు మూటగట్టుకుంది. ఈ క్రమంలో కొత్త సెలక్షన్‌ కమిటీ బాబర్‌ ఆజంను తిరిగి కెప్టెన్‌ చేయాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా టీ20లకు షాహిన్‌ ఆఫ్రిదిని తప్పించి బాబర్‌తో భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలపై స్పందించిన షాహిద్‌ ఆఫ్రిది.. తన అల్లుడు షాహిన్‌ ఆఫ్రిదికి అండగా నిలిచాడు. ‘‘ఒకరిని కెప్టెన్‌గా నియమించినపుడు తనను తాను నిరూపించుకునేందుకు కొంత సమయం కూడా ఇవ్వాలి.

అంతేగానీ కొత్త వాళ్లు రాగానే మళ్లీ మార్పులు చేస్తాం అంటే.. సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఒక ఆటగాడిని సారథిని చేసి వెంటనే తొలగించాలనుకుంటున్నారంటే ఆ నిర్ణయం తప్పుడైది ఉండాలి.

లేదంటే మళ్లీ మార్చాలనుకున్న నిర్ణయమైన సరైంది కాకపోయి ఉండాలి’’ అని పీసీబీ తీరును విమర్శించాడు. తన అల్లుడు షాహిన్‌కు మరికొంత సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. 

Advertisement
 
Advertisement
 
Advertisement