ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇక వీటికి చోటులేదు
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు డీఎంఈ ప్రతిపాదన
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆరోగ్యశ్రీ చికిత్సలకు అప్పుడే కోత మొదలైంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న 134 చికిత్సలను ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే చేయాలని వైద్యవిద్యా సంచాలకులు నిర్ణయించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ప్రతిపాదనలు పంపించారు. వీటిలో మెజారిటీ చికిత్సలు జనరల్ సర్జరీకి సంబంధించినవే. గతంలో 171 చికిత్సలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేసేవారు.
ఇప్పుడు వీటికి అదనంగా 134 చికిత్సలను చేరుస్తూ ఆరోగ్యశ్రీ సీఈఓకు ప్రతిపాదన పంపించారు. తీవ్ర గాయాలై ఆపరేషన్లు చేయాల్సి రావడం, కడుపునొప్పి, హెరి్నయా వంటి జనరల్ సర్జరీలు ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ జరిగేవి. ఈ చికిత్సలన్నీ ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే చేయాలని ప్రతిపాదనలు వెళ్లాయి.
ఈ మేరకు బుధవారం అన్ని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్‌లు, ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివరించినట్టు తెలిసింది. తాజాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేయాలని నిర్ణయించిన చికిత్సల్లో జనరల్ సర్జరీకి సంబంధించి 129, గైనకాలజీకి సంబంధించి 5 చికిత్సలు ఉన్నాయి. తాజా ప్రతిపాదనతో కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేసే చికిత్సల సంఖ్య 305కు చేరింది. తాజాగా ప్రతిపాదించిన 134 చికిత్సలను రెండు, మూడు రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి తొలగించనున్నారు. ఈ విషయాన్ని డీఎంఈ తమకు వివరించారని అనంతపురం వైద్య కళాశాలకు సంబంధించిన ఓ అధికారి పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఆస్పత్రులపై తీవ్ర ఒత్తిడి పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment