ఇన్ఫోసిస్‌పై కంప్లైంట్.. ఆఫర్ లెటర్ ఇచ్చి రెండేళ్లయినా.. | Complaint Against Infosys For Onboarding Delay | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌పై కంప్లైంట్.. ఆఫర్ లెటర్ ఇచ్చి రెండేళ్లయినా..

Published Thu, Jun 6 2024 8:16 AM

Complaint Against Infosys For Onboarding Delay

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మీద ఐటీ యూనియన్ ''నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్'' (NITES) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దాదాపు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్​లకు సంబంధించిన ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని ఆరోపించింది.

ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో రెండేళ్లకు పైగా జాప్యం జరుగుతోంది. దీనివల్ల బాధిత ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీనిపై విచారణ జరిపించాలని యూనియన్ మంత్రిత్వ శాఖను కోరింది. దీనిపైన ఇన్ఫోసిస్ ఇంకా స్పందించలేదు.

చాలా మంది ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్‌లపై నమ్మకంతో ఇతర జాబ్ ఆఫర్‌లను తిరస్కరించారు. దీనివల్ల ఆదాయం లేకపోవడం మాత్రమే కాకుండా.. ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ చేసుకుంటారనే విషయం మీద స్పష్టత లేకుండా ఉన్నారు. చాలామంది తమ కెరీర్‌ సాఫీగా ముందుకు సాగటానికి ఇన్ఫోసిస్‌ను ఎంచుకుంటున్నారు. అయితే ఇన్ఫోసిస్ ఆలస్యం వల్ల ఉద్యోగమే ప్రశ్నార్థకంగా మారిందని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు.

ఇన్ఫోసిస్ ఆన్‌బోర్డింగ్ ఆలస్యానికి.. కంపెనీ రిక్రూట్​లకు జీతం చెల్లించాలని యూనియన్ కోరింది. ఆలస్యం కారణంగా ఏర్పడిన మానసిక, భావోద్వేగ ఒత్తిడిని పరిష్కరించడానికి ఇన్ఫోసిస్ బాధితులకు సహాయం అందించాలని ఐటీ యూనియన్ కోరింది.

ఐటీ సంస్థల ఆన్‌బోర్డింగ్ ఆలస్యం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా టీసీఎస్ 200 రిక్రూట్‌ల ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేసింది. ఈ కారణంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది. ఇప్పుడు అదే సమస్య మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దీనిపైన ఇన్ఫోసిస్ స్పందించాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement