దొంగతనం చేస్తుండగా గుర్తుపట్టిందని.. ప్రాణం తీశాడు | Sakshi
Sakshi News home page

దొంగతనం చేస్తుండగా గుర్తుపట్టిందని.. ప్రాణం తీశాడు

Published Mon, Apr 24 2023 1:18 AM

వివరాలు వెల్లడిస్తున్న  ఎస్పీ ఎం.దీపిక (వెనుక ముసుగులో నిందితుడు)  - Sakshi

విజయనగరం క్రైమ్‌: ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో చెడు మార్గాన్ని ఎంచుకుని, చివరకు సొంత పెద్దమ్మనే హత్యచేశాడో ప్రబుద్ధుడు. ఆమె వద్దనుంచి బంగారు ఆభరణాలు తీసుకుని విశాఖలోని గోల్డ్‌లోన్‌ కంపెనీలో తాకట్టుపెట్టాడు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిఘా పెట్టడంతో ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ ఎం.దీపిక ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.

ఎల్‌.కోట మండలం జమ్మాదేవిపేటకు చెందిన మాదాబత్తుల కృష్ణ తన దగ్గర బంధువు (పెద్దమ్మ) ఇంట్లో చోరీకి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఈ నెల 15న కొత్తవలస కుమ్మరివీధిలో ఉన్న పెద్దమ్మ మాదాబత్తుల సూర్యకాంతం ఇంటికి వెళ్లాడు. ఇంట్లో కుటుంబసభ్యులెవరూ లేకపోవడంతో ఆమె మెడలో ఉన్న రెండుపేటల బంగారు పుస్తెల తాడును తెంపేందుకు ప్రయత్నించాడు.

దీంతో ఆమె ప్రతిఘటించి, అతని ముఖానికి ఉన్న కర్చీఫ్‌ను తొలగించి, బంధువు మాదాబత్తుల కృష్ణ (వరసకు కుమారుడిగా) గుర్తించింది. ఎందుకు ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నావని, పెనుగులాడుతుండగా, నిందితుడు కృష్ణ ఆమెను వంట గదిలో ఉన్న కత్తిపీటతో తలపైన విచక్షణారహితంగా కొట్టడంతో రక్తపు మడుగులో పడిపోయింది.

సంఘటనా స్ధలంలో ఆనవాళ్లు లేకుండా, పోలీసు జాగిలాలు నిందితుడి ఆచూకీని గుర్తించకుండా ఉండేందుకు వంటగదిలో కారం తీసి, సంఘటనా స్ధలంలో జల్లి, రక్తపు మడుగులో పడిపోయిన సూర్యకాంతం మెడలోని పుస్తెల తాడును, ఒక చెవికి గల ఎత్తు గొలుసును కృష్ణ తీసుకుని అక్కడినుంచి పరారయ్యాడు. విశాఖలోని గోపాలపట్నం అటికా గోల్డ్‌ లోన్‌ సంస్థలో తన ఆధార్‌ కార్డ్‌ను గుర్తింపుగా ఇచ్చి దోచుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టాడు.

అతని బ్యాంక్‌ అకౌంట్‌కు రూ.లక్షా 48 వేలు జమయ్యాయి. భార్యాపిల్లలతో అత్తవారింటికి వెళ్లి అక్కడి నుంచి విజయవాడ వెళ్లి తలనీలాలు సమర్పించి, అమ్మవారిని దర్శించుకుని, భార్యాపిల్లలను అత్తవారింటివద్ద వదిలేసి కూలిపనుల నిమిత్తం కర్నాటక రాష్ట్రంలోని కొప్పల్‌కి వెళ్లిపోయాడు.

అయితే నిందితుడి భార్య ఫోన్‌ చేసి, మాదాబత్తుల సూర్యకాంతాన్ని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌లో చేర్చగా చనిపోయిందని, పిల్లలకు ఆరోగ్యం బాగోలేదని, రమ్మనమని కోరడంతో ఎల్‌.కోట మండలం జమ్మాదేవి పేట రాగా పోలీసులు అరెస్టు చేశారు.

పోలీస్‌ సిబ్బందికి అభినందనలు

కేసులో క్రియాశీలక పాత్ర పోషించిన కొత్తవలస సీఐ ఎస్‌.బాలసూర్యారావు, సీసీఎస్‌ సీఐ ఎం.బుచ్చిరాజు, సాంకేతిక ఆధారాలు సేకరించి, హత్యకు పాల్పడిన నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి సీఐలు ఎస్‌.బాలసూర్యారావు, ఎం.బుచ్చిరాజు, ఎస్సైలు వైవీ.జనార్దన్‌, హేమంత్‌ కుమార్‌, సాగర్‌ బాబు, సీసీఎస్‌ పోలీసులను ఎస్పీ అభినందించి, ప్రశంసపత్రాలను అందజేశారు. సమావేశంలో విజయనగరం ఇన్చార్జ్‌ డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు, కొత్తవలస సీఐ ఎస్‌.బాలసూర్యారావు, ఎస్బీ సీఐ జి.రాంబాబు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement