సాధారణానికి మించి..! | Sakshi
Sakshi News home page

సాధారణానికి మించి..!

Published Fri, Apr 19 2024 1:25 AM

తలకు రుమాలు చుట్టుకుని వెళ్తున్న వాహనదారుడు - Sakshi

సాక్షి, వరంగల్‌ : జిల్లాలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నాలుగు రోజుల నుంచి సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతుండడంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. దీనికితోడు ఉక్కపోత కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో హైరానా పడుతున్నారు. వారం క్రితం కాస్త చల్లబడిన వాతావరణం గత ఆదివారం నుంచి మళ్లీ వేడెక్కుతోంది. 40.4 డిగ్రీ సెల్సియస్‌ నుంచి ఇప్పుడు ఏకంగా 45.1 డిగ్రీ సెల్సియస్‌ వరకు చేరుకుంది. అంటే సాధారణ ఉష్ణోగ్రతను మించి 8 డిగ్రీ సెల్సియస్‌ అత్యధికంగా గురువారం నమోదైంది. 2022 మేలో వరంగల్‌లో రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో నెలరోజులు మిగిలి ఉండగానే ఆ స్థాయిలో ఏప్రిల్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా మంది వడదెబ్బ తగిలి చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో గురువారం ఉష్ణోగ్రత 45.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

రాజకీయ పార్టీలకు గండం..

ఎండ వేడిమి ధాటికి జనాలు ఉదయం 8 దాటిందంటేనే బయటకు రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇక మధ్యాహ్నం వేళ అవసరమైతేనే తప్ప ఎవరూ రోడ్ల పైకి రావడం లేదు. జిల్లాలో ఖిలా వరంగల్‌, గీసుకొండ, దుగ్గొండి, పర్వతగిరి, నెక్కొండ, సంగెం మండలాల్లో 45 డిగ్రీ సెల్సియస్‌ వరకు ఉండగా.. మిగలిన మండలాల్లో 40 నుంచి 42 డిగ్రీ సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒంటిపూట బడులకు వెళ్లి వచ్చే విద్యార్థులకు తిప్పలు తప్పలేదు. పిల్లలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకోవైపు పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు రాజకీయ సభలకు బదులు ఫంక్షన్‌హాళ్లలోనే సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఎండతో పాటు వడగాలుల ధాటికి ఏసీ ఫంక్షన్‌హాళ్లలోనే తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎండలకు భయపడి వీటికి కూడా చాలా మంది రాకపోవడం గమనార్హం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోని రావాలని, నీరు, పండ్ల రసాలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. గంటలకొద్దీ ప్రయాణం చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

జిల్లాలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత ల వివరాలు..

నాలుగు రోజులుగా జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

గీసుకొండ మండలం గొర్రెకుంటలో 45.1 డిగ్రీల నమోదు

భానుడి ప్రతాపంతో ప్రజల బెంబేలు..

సభలకు బదులు ఫంక్షన్‌హాళ్లలో

రాజకీయ పార్టీల సమావేశాలు

అవసరమైతేనే బయటకు రావాలని వైద్యాధికారుల సూచన

రోజు ప్రాంతం డిగ్రీ

సెల్సియస్‌లలో

ఆదివారం ఉర్సుగుట్ట 40.4

సోమవారం ఖిలా వరంగల్‌ 42.4

మంగళవారం కల్లెడ (పర్వతగిరి) 43.4

బుధవారం రెడ్లవాడ (నెక్కొండ) 43.7

గురువారం గొర్రెకుంట (గీసుకొండ) 45.1

వరంగల్‌లో గొడుగు పట్టుకుని వెళ్తున్న యువతులు
1/1

వరంగల్‌లో గొడుగు పట్టుకుని వెళ్తున్న యువతులు

Advertisement
 
Advertisement
 
Advertisement