2020లో భారత్‌ వృద్ధి 5.3 శాతమే! | Sakshi
Sakshi News home page

2020లో భారత్‌ వృద్ధి 5.3 శాతమే!

Published Wed, Mar 18 2020 10:17 AM

Moodys Rating on Indian GDP COVID 19 Effect on 2020 GDP - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 2020లో 5.3 శాతమే ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ.. మూడీస్‌ తాజాగా అంచనావేసింది. ఫిబ్రవరిలో వేసిన 5.4 శాతం అంచనాలను 10 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) మేర కుదించింది. అంచనాల కుదింపునకు కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ ప్రభావాన్ని కారణంగా చూపడం గమనార్హం.  2020 భారత్‌ వృద్ధి అంచనాలను మూడీస్‌ తగ్గించడం ఇది వరుసగా రెండవసారి. తొలుత 6.6 శాతం అంచనాలను ఫిబ్రవరిలో 5.4 శాతానికి కుదించడం జరిగింది. తాజాగా దీనిని 5.3 శాతానికి తగ్గించింది. 2020లో భారత్‌ జీడీపీ 5.3 శాతం. 2018లో ఈ రేటు 7.4 శాతంగా ఉంది.   తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

2021లో  వృద్ధి రేటు కాస్త పుంజుకుని 5.8 శాతంగా నమోదు కావచ్చు.  
కరోనా వైరస్‌ వల్ల దేశీయంగా డిమాండ్‌ గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. వస్తు సేవల సరఫరా చైన్లలో అంతర్జాతీయంగా తీవ్ర విఘాతం ఏర్పడ్డం దీనికి కారణం.  
పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే కరోనా ప్రభావంతో అంతర్జాతీయ మందగమన పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు మందగమన ధోరణులను ఎదుర్కొనడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సెంట్రల్‌ బ్యాంకులు తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయన్న అంశాలను వేచిచూడాల్సి ఉంది.  
ఇక అతి తక్కువ స్థాయి చమురు ధరల విషయానికి వస్తే, చమురు ఎగుమతి దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించకపోవచ్చు. అయితే దిగుమతి దేశాలకు వాణిజ్య లోటుకు సంబంధించి ఇది ఊరటనిస్తుంది. 

కోవిడ్‌ నష్టం... క్రూడ్‌ లాభం!
కాగా, కోవిడ్‌–19 వల్ల భారత్‌ ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టాన్ని తక్కువ స్థాయి క్రూడ్‌ ధర ‘తగిన భారీ స్థాయిలోనే’ సర్దుబాటు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు మంగళవారం పేర్కొన్నారు. 2020–21లో ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం తీసుకుంటున్న ఉద్దీపన చర్యలు వృద్ధికి కొంత మేర ఊపునిస్తాయని భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
 
Advertisement