గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల  | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల 

Published Sun, Apr 14 2024 5:23 AM

APPSC Group-1 Prelims Results Released - Sakshi

89 పోస్టులకు 4,496 మంది అర్హత..

1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక  

సెప్టెంబర్‌ 2 నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షలు.. రికార్డు సమయంలో ప్రక్రియ పూర్తి 

సాక్షి, అమరావతి: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) విడుదల చేసింది. మెయిన్స్‌కు 4,496 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి మెయిన్స్‌ పరీక్షలను సెప్టెంబర్‌ 2–9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ శనివారం తెలిపారు. మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో 4,496 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. కేవలం 26 రోజు­ల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు వెల్లడించడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన 81 గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ గతేడాది డిసెంబర్‌ 8న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అభ్యర్థులకు 3 నెలలు సమయమిచ్చి ప్రిలిమ్స్‌ను మార్చి 17న రాష్ట్రంలోని 18 జిల్లాల్లో నిర్వహించగా, 91,463 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరికి మరో ఐదున్నర నెలల సమయం ఇచ్చి సెప్టెంబర్‌లో మెయిన్స్‌ నిర్వహిస్తారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న 81 పోస్టులకు అనంతరం మరో 8 పోస్టులను చేర్చడంతో గ్రూప్‌–1 పోస్టుల సంఖ్య 89కి పెరిగింది. ఇటీవల గ్రూప్‌–2 ఫలితాలను వెల్లడించిన ఏపీపీఎస్‌సీ 1:100 నిష్పత్తిలో 905 పోస్టులకు 92,250 మంది అభ్యర్థులను మెయిన్స్‌ కోసం ఎంపిక చేసింది. చరిత్రలో ఇంత మంది అభ్యర్థులకు అవకాశం కల్పించడం ఇదే తొలిసారి.  

ఫలించని ఎల్లో బ్యాచ్‌ వ్యూహం  
మార్చి 17న నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ను అడ్డుకునేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నం లేదు. దీనికోసం రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని కోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ వేయించారు. ఈ ప్రయత్నం కూడా ఫలించకపోయేసరికి బాబుకు దిక్కుతోచలేదు. చివరికి 2018 గ్రూప్‌–1 పోస్టుల భర్తీపై ఎన్నోసార్లు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేసి, ఓడిపోయిన అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీపీఎస్‌సీ నిర్వహించిన 2018 గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని పరీక్షను రద్దు చేయమని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు చెలరేగిపోయారు.

పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ మీడియాకు స్క్రీన్‌ ప్రెజెంటేషన్‌ కూడా ఇచ్చారు. గత మూడేళ్లల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షలను సకాలంలో నిర్వహించి, ముందే ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు పోస్టులను భర్తీ చేసింది. అయినప్పటికీ ఏపీపీఎస్‌సీ ఇచ్చిన పలు నోటిఫికేషన్లు, పోస్టుల భర్తీని అడ్డుకునేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నమంటూ లేదు. గత ఫిబ్రవరిలో గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేశారు. అప్పటికే తన బృందంతో కేసులు వేయించి పరీక్షను రద్దు చేయించాలని యత్నించారు. ఆ చిక్కులను అధిగమించి ఏపీపీఎస్‌సీ ఫిబ్రవరి 25న గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ను నిర్వహించింది. తాజాగా గ్రూప్‌–1 విషయంలోనూ తన కుట్రలు ఫలించకపోవడంతో బాబు కంగుతిన్నారు.  

Advertisement
Advertisement