భారత్ 2023లో సౌరశక్తి ఉత్పాదనలో జపాన్‌ను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సౌరశక్తి ఉత్పాదక దేశంగా అవతరించింది. గ్లోబల్ ఎనర్జీ సెక్టార్‌లో పనిచేస్తున్న పరిశోధనా సంస్థ అంబర్ తన నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది.
2015లో సౌరశక్తి వినియోగంలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. భారత్ గత కొన్ని ఏళ్లుగా సౌరశక్తి వినియోగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. దాని ఫలితమే ఈ విజయం. ‘గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ’ పేరుతో అంబర్ ఈ నివేదికలో 2023లో ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో 5.5 శాతం సౌరశక్తి రూపంలో లభించిందని పేర్కొంది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వృద్ధి 2023లో ఆశా జనకంగా ఉందని, అయితే చైనాలో కరువు కారణంగా జలవిద్యుత్ ఉత్పత్తి ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిందని ఆ నివేదిక పేర్కొంది.
ప్రపంచంలో అత్యంత చౌకైన సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశం భారతదేశం అయితే అత్యంత ఖరీదైన సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశం కెనడా. 2023 నాటికి భారతదేశం సౌరశక్తి ఉత్పత్తి విషయంలో ప్రపంచంలోనే నాల్గవ దేశంగా నిలిచింది. ఈ విషయంలో చైనా, అమెరికా, బ్రెజిల్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. సౌరశక్తి వృద్ధిలో ఈ నాలుగు దేశాల వాటా 2023లో 75 శాతంగా ఉంది. జపాన్.. భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.
భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తిలో సౌరశక్తి సహకారం 2015లో 0.5 శాతంగా ఉండగా, ఇది 2023లో 5.8 శాతానికి పెరిగింది. సౌర శక్తి 2030 నాటికి ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో 22 శాతానికి పెరగనున్నదనే అంచానాలున్నాయి. 2030 నాటికి పునరుత్పాదక సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలని యోచిస్తున్న కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment