స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఏ దశలో ఉంది?  | Sakshi
Sakshi News home page

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఏ దశలో ఉంది? 

Published Fri, Mar 15 2024 6:06 AM

High Court order to owner of Visakha Steel Plant - Sakshi

పూర్తి వివరాలను మా ముందుంచండి

కేంద్ర ప్రభుత్వం, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం.. దీనిపై కేంద్రానికి సీఎం లేఖ కూడా రాశారు

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం  

సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు ప్రైవేటీకరణ ఏ దశలో ఉంది? స్టీల్‌ ప్లాంట్‌ భూములను ఏమైనా విక్రయించారా? విక్రయిస్తే ఎంత మేర విక్రయించారు? తదితర వివరాలను తమ ముందుంచాలని స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే భూములను ఇతరులకు విక్రయించారని ఆరోపిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్‌ కేఏ పాల్‌ను ఆదేశించింది.

ఏది పడితే అది ఆరోపిస్తే సరిపోదని.. ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని పాల్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ గుహనాథన్‌ నరేందర్, జస్టిస్‌ న్యాపతి విజయ్‌ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కేఏ పాల్, మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని జస్టిస్‌ నరేందర్‌ ధర్మాసనం గురువారం విచారించింది.

ఈ సందర్భంగా కేఏ పాల్‌ స్వయంగా వాదనలు వినిపిస్తూ.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా? అన్న విషయాన్ని తేల్చేందుకు హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వాస్తవానికి స్టీల్‌ ప్లాంట్‌ లాభాల్లోనే నడుస్తోందని చెప్పారు. ఒకవేళ నష్టాల్లో ఉంటే.. ఆ మొత్తాన్ని భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన 2 వేల ఎకరాల భూములను ఇప్పటికే విక్రయించారని ఆరోపించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆరోపణలు చేస్తే సరిపోదని.. భూములు విక్రయించినట్లు ఆధారాలు చూపాలని పాల్‌కు స్పష్టం చేసింది. 

ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం 
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున  ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. దీనిపై కేంద్రానికి  సీఎం జగన్‌ లేఖ కూడా రాశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ను నష్టాల నుంచి బయటపడేసేందుకు ఏం చేయాలో కూడా కేంద్రానికి సూచనలు చేశామన్నారు. భూములిచ్చిన వారు నష్టపోకూడదన్నారు.  ధర్మాసనం స్పందిస్తూ.. స్టీల్‌ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం నుంచి వివరాలు తెప్పించుకోవాల్సి ఉందని శ్రీరామ్‌ తెలిపారు. కేంద్రం తరఫు న్యాయవాది స్పందిస్తూ, ప్లాంట్‌ భూములను విక్రయించామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement