T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ.. | Sakshi
Sakshi News home page

USA vs BAN: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. యూఎస్‌ఏ సంచలన విజయం

Published Wed, May 22 2024 3:38 PM

Mini Team India: Fans Rejoice As T20 WC Co Hosts USA Stun Bangladesh

టీ20 ప్రపంచకప్‌-2024 ఆరంభానికి ముందే అమెరికా క్రికెట్‌ జట్టు సంచలన ఆట తీరుతో అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకొంది. పర్యాటక బంగ్లాదేశ్‌కు ఊహించని రీతిలో షాకిచ్చింది. ఏకంగా ఐదు వికెట్ల తేడాతో షాంటో బృందాన్ని చిత్తు చేసింది.

ద్వైపాక్షిక సిరీస్‌
కాగా వరల్డ్‌కప్‌ ఈవెంట్‌కు వెస్టిండీస్‌తో కలిసి అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. జూన్‌ 1 నుంచి మొదలయ్యే ఈ మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా యూఎస్‌ఏ- బంగ్లాదేశ్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ నిర్వహిస్తున్నారు.

ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌ నేపథ్యంలో హోస్టన్‌ వేదికగా తొలి టీ20 జరిగింది. ఇందులో టాస్‌ గెలిచిన ఆతిథ్య అమెరికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

హాఫ్‌ సెంచరీతో మెరిసిన తౌహీద్‌
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు లిటన్‌ దాస్‌(14), సౌమ్య సర్కార్‌(20) వికెట్లు కోల్పోయింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ నజ్ముల్‌ హుసేన్‌ షాంటో(3) కూడా పూర్తిగా విఫలమయ్యాడు.

ఈ క్రమంలో నాలుగో నంబర్‌ బ్యాటర్‌ తౌహిద్‌ హృదోయ్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. 47 బంతుల్లో 58 పరుగులతో రాణించాడు. అయితే, మిగతా వాళ్లలో మహ్మదుల్లా(22 బంతుల్లో 31) ఒక్కడు కాస్త ఫర్వాలేదనిపించాడు.

ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్‌ 153 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన యూఎస్‌ఏ అనూహ్య రీతిలో 19.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది.

మనోడు దంచికొట్టాడు
యూఎస్‌ఏ బ్యాటర్లు స్టీవెన్‌ టేలర్‌(28), ఆండ్రీస్‌ గౌస్(23) ఓ మోస్తరుగా రాణించగా ఆరు, ఏడు స్థానాల్లో వచ్చిన కోరే ఆండర్సన్‌(25 బంతుల్లో 34 నాటౌట్‌), హర్మీత్‌ సింగ్‌ దంచికొట్టారు. ముఖ్యంగా హర్మీత్‌ కేవలం 13 బంతుల్లోనే 33 పరుగులు సాధించి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇక ఈ విజయంతో బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో యూఎస్‌ఏ 1-0తో ముందంజ వేసింది. ఈ నేపథ్యంలో యూఎస్‌ఏ అభిమానులు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. భారత మూలాలు ఉన్న క్రికెటర్లు జట్టుగా ఎక్కువగా ఉండటంతో ‘మినీ టీమిండియా’ బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా యూఎస్‌ఏ విజయంలో కీలక పాత్ర పోషించిన హర్మీత్ సింగ్‌ ముంబైకి చెందిన వాడు. అండర్‌-19 క్రికెట్‌లో ముంబైకి అతడు ప్రాతినిథ్యం వహించాడు.‌  

యూఎస్‌ఏ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ తొలి టీ20 తుదిజట్లు
యూఎస్‌ఏ
మోనాక్‌ పటేల్ (కెప్టెన్, వికెట్ కీపర్), స్టీవెన్ టేలర్, ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, కోరె అండర్సన్, నితీశ్ కుమార్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నస్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రావల్కర్ 
(బెంచ్: మిలింద్‌ కుమార్‌, షాడ్లే వాన్ షాల్క్విక్, నిసర్గ్ పటేల్, షయాన్ జహంగీర్)

బంగ్లాదేశ్‌
లిటన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదోయ్, మహ్మదుల్లా, జకర్ అలీ (వికెట్ కీపర్), మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం.

చదవండి: RR vs RCB: వార్‌ వన్‌సైడ్‌.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం

 

Advertisement
 
Advertisement
 
Advertisement