
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కారుకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం(మే22)న కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓబీసీ కోటాలోని పలు క్లాసులు చట్ట విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్‌లను రద్దు చేసింది.
2012 పశ్చిమబెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలో పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు డివిజన్ బెంచ్ తెలిపింది. ఓబీసీ వర్గీకరణ చట్టవిరుద్ధంగా ఉందని స్పష్టంచేసింది.
అయితే, ఈ తీర్పును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇది కచ్చితంగా బీజేపీ కుట్రేనని ఆరోపించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎప్పటిలాగే అమలవుతాయన్నారు.