విద్యుదుత్పత్తిని ఆపేయండి | Sakshi
Sakshi News home page

విద్యుదుత్పత్తిని ఆపేయండి

Published Sat, Aug 12 2023 3:22 AM

Krishna Board directive to Telangana Genco - Sakshi

సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ­గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని తక్షణమే నిలి­పే­యాలని తెలంగాణ జెన్‌కోను కృష్ణా బోర్డు ఆదేశించింది. నీటి కేటాయింపులు చేయా­లని ఎలాంటి ప్రతిపాదన పంపకుండా, బోర్డు అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు తరలి­స్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ జెన్‌కో సీఎండీకి కృష్ణా­బోర్డు చైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌ శుక్రవారం లేఖ రాశారు.

శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తుండటం వల్ల రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని కృష్ణా బోర్డుకు బుధవారం ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేసేలా తెలంగాణ జెన్‌కోను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కృష్ణాబోర్డు చైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌ తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని తెలంగాణ జెన్‌కోను ఆదేశించారు.

కృష్ణాబేసిన్‌లో ఈ ఏడాది సగటు వర్షపాతం కంటే తక్కువగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేయడాన్ని ఎత్తిచూపారు. దాంతో కృష్ణానదిలో నీటిలభ్యత తగ్గుతుందని, ఆ మేరకు శ్రీశైలం ప్రాజెక్టులోను లభ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని సంరక్షించుకుని తాగు, సాగునీటి అవసరాల కోసం వాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

ఇకపై ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయవద్దని తెలంగాణ జెన్‌కోను ఆదేశించారు. కానీ.. తెలంగాణ జెన్‌కో కృష్ణా బోర్డు ఆదేశాల భేఖాతరు చేస్తూ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 38,140 క్యూసెక్కులను దిగువకు వదలేస్తుండటం గమనార్హం.  

Advertisement
 
Advertisement
 
Advertisement