వడగాడ్పుల విజృంభణ | Sakshi
Sakshi News home page

వడగాడ్పుల విజృంభణ

Published Fri, Apr 19 2024 6:11 AM

Temperatures are extreme in the state - Sakshi

నేడు, రేపు మరింత తీవ్రం 

అక్కడక్కడా తేలికపాటి వానలు

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. సాధారణం కంటే 3–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఫలితంగా గురువారం రాష్ట్రంలో సగానికి పైగా జిల్లాల్లో వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచాయి. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నా­యి. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో కొన్ని­చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

కాగా.. గురువారం అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేట, పార్వతీపురం మ­న్యం జిల్లా కొమరాడల్లో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. నందవరం (నంద్యాల)లో 45.6, జామి (విజయనగరం)లో 45.5, కొవిలం (శ్రీకాకుళం), కొంగలవీడు (వైఎస్సార్‌)ల్లో 45.4, రేణిగుంటలో, దరిమడుగు (ప్రకాశం)లో 45.3,  ఉష్ణోగ్రతలు న­మో­దయ్యాయి. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు 16 జిల్లాల్లో నమోదైనట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

గురువారం 84 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 120 మండలాల్లో వడగాడ్పులు వీచా­యి. శుక్రవారం 91 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 245 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నా­యి. శనివారం 39 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 215 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలు­న్నా­యని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. 

ద్రోణి ప్రభావంతో తేలికపాటి వానలు
గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి గురువారం కొమరిన్‌ ప్రాంతం నుంచి దక్షిణ తెలంగాణ, అంతర్గత తమిళనా­డు, రాయలసీమ మీదుగా కొనసాగుతోంది. ఫలి­తంగా శుక్ర, శనివారాలు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడా పిడుగులకు ఆస్కారం ఉందని, గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. 

Advertisement
Advertisement