ధోని ఉన్నా కూడా.. అందుకే 19వ ఓవర్లో చహర్‌ చేతికి బంతి! | Sakshi
Sakshi News home page

ధోని ఉన్నా కూడా.. అందుకే 19వ ఓవర్లో చహర్‌ చేతికి బంతి!

Published Thu, May 2 2024 4:45 PM

When Asked Him To Bowl Against Dhoni: Sam Curran On Why Rahul Chahar 19th Over

ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని మూడో  మ్యాచ్‌ నుంచి బ్యాటింగ్‌కు వచ్చి.. వరుసగా ఏడు మ్యాచ్‌లలో అజేయంగా నిలిచాడు. అంతేకాదు ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో వింటేజ్‌ తలాను గుర్తు చేస్తూ అభిమానులను అలరించాడు.

కానీ పంజాబ్‌ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌తో ఈ ఫీట్లకు తెరపడింది. చెపాక్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న ధోని ఒక ఫోర్‌, ఒక సిక్స్‌ సాయంతో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి.. రనౌట్‌ అయ్యాడు.

నిజానికి రుతురాజ్‌ గై​క్వాడ్‌(48 బంతుల్లో 62) అవుటైన తర్వాత ఏడో స్థానం(పద్దెనిమిదో ఓవర్‌ ఆఖరి బంతి)లో క్రీజులోకి వచ్చిన ధోని ప్రమాదకరంగా మారతాడని భావించగా.. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ అనూహ్యంగా స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ను బరిలోకి దించాడు.

అప్పటికి పేసర్‌ హర్షల్‌ పటేల్‌ ఒక్క ఓవర్‌ మాత్రమే వేసి ఉన్నా.. చహర్‌ వైపే మొగ్గు చూపి సామ్‌ కరన్‌ కీలక సమయంలో ప్రయోగానికి దిగాడు. అయితే, అతడి అంచనాలను నిజం చేస్తూ రాహుల్‌ చహర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు.  

ధోని లాంటి అద్భుతమైన ఫినిషర్‌ క్రీజులో ఉన్నా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. కీలకమైన పందొమ్మిదో ఓవర్లో కేవలం 
3 పరుగులే ఇవ్వడంతో పాటు మొయిన్‌ అలీ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో చెన్నై విజయానంతరం పంజాబ్‌ సారథి సామ్ కరన్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రయోగాలు అన్నిసార్లూ ఫలితాలను ఇస్తాయనే నమ్మకం లేదు. కానీ నేను రాహుల్‌ చహర్‌ ఆత్మవిశ్వాసాన్ని చూసి అతడి చేతికి బంతినిచ్చాను.

అతడు తన ప్రణాళికలను పక్కాగా అమలు చేసి ఫలితం రాబట్టాడు. ప్రత్యర్థిని కట్టడి చేయగలిగాడు’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ 17.5 ఓవర్లలోనే ఛేదించి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement