నిజానికి ఉడిపి కాదు, ఉడుపి అని వ్రాయాలి. ఉడుపి అంటే అర్థం నక్షత్రాలకు అధిపతి అయిన చంద్రుని భూమి అని అర్థం. ఇక ఉడుపి వంట లేక భోజనం- దీని మూలం ఉడుపిలో ఉన్న కృష్ణ దేవాలయంలో, అష్ట మఠాలలో ఉంది. ఉడుపి శ్రీ మధ్వాచార్యులు జన్మించిన ఊరు. ఇది ద్వైత సాంప్రదాయ ముఖ్య కేంద్రం. అన్నదాన సేవలో భాగంగా ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయంలో శిక్షణ పొందిన వంటవారు ఉడిపి హోటళ్లను తెరవడానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. మరీ ఉడుపి భోజనానికే ఎందుకంటే పేరుగాంచిందంటే..
కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న సైన్యానికి..
ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదుగురికి వంట చేయగలం.అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరంటే..? మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి దాదాపు 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు.
అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి. రెండవది బలరాముడు. ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి. దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది. ఉడిపిరాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు. అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు. అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు.
మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది, నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు. అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము. వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు చెపుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది. 50 లక్షల మందికి భోజనం వండటం అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుందంటూ..అందరికీ భోజనాలు తయారుచేయమని చెబుతాడు శ్రీకృష్ణుడు.
నిజానికి 50 లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు, అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం భీముడికి ముఖ్యం. అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు. అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడు అని వంట వండమని కోరతాడు శ్రీ కృష్ణుడు. నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేషుడు.
ఎలా వండేవాడంటే..
సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా, వృధాకాకుండా వండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయ్యేది. అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేశుడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయోవారు. ఇది ఎలా సాధ్యం?అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు?..అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు? అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు.
అసలు నరేషునికి ఎలా తెలుస్తుంది? ఈ రోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని, మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని?..ఇలా18 రోజులు గడిచిపోయాయి. పాండవులు గెలిచారు. పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు.. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు. కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు. ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అంటాడు.
అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని గొప్పతనం అంతా ఎవరికి ఇస్తారు అని అడిగాడు?. అప్పుడు యుధిష్టరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని చెబుతాడు. అప్పుడు నరేషుడు మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం. కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణునికే చెందుతుంది అని చెప్తాడు. ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా కారణం అని నరేషుడుని అడుగుతాడు యుధిష్టరుడు.
అప్పుడు నరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు... శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు. నేను లెక్క పెట్టి పెట్టే వాడిని. శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని.. శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలు అయితే తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.. ఆంటే శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు. దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు. ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు. ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు. ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు.
ఇదంతా 13వ శతాబ్దంలో కర్ణాటకలోని చిన్న తీర పట్టణమైన ఉడుపిలో ప్రారంభమైంది. ఇక్కడ, ఒక ప్రసిద్ధ శ్రీ కృష్ణ దేవాలయంలో భక్తులకు ఉచిత భోజనం లేదా అన్నదానం చేసే పద్ధతిని ప్రారంభించింది. మెనూలో ఆహారం ఎప్పుడు వడ్డించాలనే సమయాలు రెండూ నిర్ణయించబడ్డాయి. ఈ దేవాలయాలలో శిక్షణ పొందిన వంటవారు చివరికి బెంగళూరు, చెన్నై, ముంబై వంటి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి ఈ ప్రాంతాల్లో ఉడుపి హోటళ్లను ఏర్పాటు చేసినట్లు చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇక్కడ భోజనానికి విశేష స్థానం ఉంది. సాత్విక పద్ధతిలో చెయ్యాలి. శాకాహారం భోజనం మాత్రమే చెయ్యాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఉపయోగం చేయకూడదు.
కృష్ణ మఠంకు చాలా చాలా మంది భక్తులు వస్తారు. వాళ్ళు అందరికి ప్రసాదం రూపంలో భోజనం ప్రతి దినం ఇస్తారు. అంత మందికి భోజనం ఇవ్వాలి, అందుకే చాలా మంది వంటచేసే బ్రాహ్మణులు ఉండేవారు. ఉడుపిలో చాలమంది బ్రాహ్మణులకు వంట చేసే విషయంలో ప్రావీణ్యత దొరికింది. హోటల్ ఉద్యమం ప్రారంభించడానికి ఈ పాకశాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించారు. 1942లో ఉడిపి నుండి ముంబైకి వలస వచ్చిన ఒక యువకుడు మొదటి ఉడిపి శ్రీకృష్ణ హోటల్‌ని స్థాపించాడు. 1950వ దశకంలో, ఇద్దరు సోదరులు మావల్లి టిఫిన్ రూమ్ (ఎంటీఆర్), ఉడిపి తరహాలో మరొక హోటల్‌ని ఏర్పాటు చేశారు. 80 సంవత్సరాల వ్యాపారం తర్వాత, ఎంటీఆర్ ఇప్పుడు ఒక పెద్ద నమ్మకమైన సంస్థగా పరిగణించబడుతుంది.
ఇదంతా గత వైభోగం కాని నేడు..
దేశ వ్యాప్తంగా ఉడుపి హోటల్స్ విలుప్త అంచున ఉన్నాయి...మన ఆహార సంస్కృతి తీవ్ర ప్రమాదంలో ఉంది, అమెరికన్ ఎమ్‌ఎన్‌సీలు ఫుడ్ జెయింట్స్‌ను స్వాధీనం చేసుకోవడం ఉడిపి రెస్టారెంట్‌లను తొలగిస్తోంది. దీని పర్యవసానంగా చాలా ఉడుపి ఫుడ్ జాయింట్‌లు వేగంగా మూసుకుపోతున్నాయి. పదేళ్ళ క్రితం వరకు దేశంలో ఏ మూలకు వెళ్ళినా కుగ్రామంలో కుడా ఉడుపి హోటల్ ఉండి తీరాల్సిందే. ఉడుపి హోటల్ పేరు ఎత్తితే చాలు ఆ రవ్వ దోశలు, మసాలా దోశలు, వడ సంబారు, ఘుమఘ్జుమ లాడే కొబ్బరి చట్నీలు.....
కానీ నేడు వాటి స్థానంలో నూడుల్స్ సెంటర్లు, పాణి పూరీలు, అమెరికన్ ఎమ్‌ఎన్‌సీలు పుణ్యమా..! అని దేశీయ చాట్ సెంటర్లు కుడా కనుమరుగైపోయాయి మన పిల్లలు జంక్ ప్లాస్టిక్ ఫుడ్స్‌కు అలవాటు పడి చిన్నతనం నుంచే తీవ్ర ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ జంక్ ఫుడ్స్‌తో స్థూలకాయం, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి.
అమెరికన్ ఫుడ్ దిగ్గజా లక్ష్యం మన చిన్నారులు, యువతే. ముఖ్యంగా పిల్లల మనస్సును మరల్చగలగడమే వారి థ్యేయం. ఎందుకంటే..?మధ్య వయస్కులు, వృద్ధులు ఈ జంక్ ఫాస్ట్ ఫుడ్‌ను ఎన్నటికీ అంగీకరించరని వారికి బాగా తెలుసు. ఈలోగా చిన్నారులు యుక్తవయస్సు వచ్చే నాటికి ఈ జంక్ ఫుడ్స్‌కు బాగా బానిస అయ్యిపోతారు. నిజానికి ఇది మన ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందులో ఉపయోగించే పదార్థాలు మన రూపు రేఖల్ని అందవిహీనంగా మార్చేసి మనకి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి.
(చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!)
Comments
Please login to add a commentAdd a comment