డివిడెండ్‌ పంపిణీ పన్ను కట్టాల్సిందే.. | Sakshi
Sakshi News home page

డివిడెండ్‌ పంపిణీ పన్ను కట్టాల్సిందే..

Published Sat, Sep 16 2023 6:25 AM

Cognizant Rs 19,000cr buyback attracts dividend tax - Sakshi

న్యూఢిల్లీ: షేర్ల బైబ్యాక్‌కు సంబంధించి డివిడెండ్‌ పంపిణీ పన్నును చెల్లించవలసిందిగా ఆదాయపన్ను శాఖ అపిలేట్‌ ట్రిబ్యునల్‌(ఐటీఏటీ) తాజాగా ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ఇండియాకు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ కాగ్నిజెంట్‌ చేసిన అపీల్‌ను ఐటీఏటీ చెన్నై బెంచ్‌ కొట్టివేసింది. దీంతో మద్రాస్‌ హైకోర్టు అనుమతిమేరకు చేపట్టిన రూ. 19,080 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ పథకంలో భాగంగా కాగ్నిజెంట్‌ డివిడెండ్‌ పంపిణీ పన్నును చెల్లించవలసి ఉంటుంది.

2017–18 అసెస్‌మెంట్‌ ఏడాదిలో కంపెనీ యూఎస్, మారిషస్‌లోని తమ వాటాదారుల నుంచి 94,00,534 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 20,297 చొప్పున వీటిని సొంతం చేసుకుంది. కంపెనీ దాఖలు చేసిన రిటర్నులను పరిశీలించిన తదుపరి ఐటీ శాఖ రూ. 4,853 కోట్లకుపైగా డివిడెండ్‌ పంపిణీ పన్నును చెల్లించవలసి ఉన్నట్లు డిమాండ్‌ చేసింది. ఆదాయపన్ను శాఖ నిబంధనల ప్రకారం మూలధన వినియోగం కారణంగా పన్ను చెల్లించవలసి ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ అంశంపై కాగ్నిజెంట్‌ అపీల్‌కు వెళ్లింది. 

Advertisement
Advertisement