Elon Musk: మూడు లక్షల కోట్లు తగలెట్టేశాడు | Sakshi
Sakshi News home page

Elon Musk: మూడు లక్షల కోట్లు తగలెట్టేశాడు

Published Mon, Feb 12 2024 7:36 PM

Elon Musk Bought Twitter After Parag Agrawal Refused To Ban Jet Tracker - Sakshi

అపర కుబేరుడు ఎలోన్‌ మస్క్‌ 21 ఏళ్ల కుర్రాడిపై ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం ఏకంగా రూ.3.50లక్షల కోట్లు తగలేశాడు. ఇప్పుడు ఇదే ప్రపంచ టెక్‌ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.

మస్క్‌ 2022లో ‘వాక్‌ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’. ట్విటర్‌ (ఇప్పుడు ఎక్స్‌.కామ్‌గా మారింది) ను కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి ఎలోన్‌ మస్క్‌ చెబుతున్న మాటలివి. అత్యంత ప్రభావంతమైన సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విటర్‌లో దీనిపై నియంత్రణ ఉండటం సరికాదన్నది ఆయన అభిప్రాయం. అందుకే ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం పూర్తయిన తర్వాత తొలి సందేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. 

వాక్‌ స్వాతంత్ర్యం కాదు.. 21 ఏళ్ల కుర్రాడిపై
అయితే మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు చేయడానికి వాక్‌ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కాదని, 21 ఏళ్ల కుర్రాడిపై ఆగ్రహంతో తీసుకున్న నిర్ణయం అంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

వినడానికి వింతగా ఉన్నా.. అక్షరాల ఇదే నిజం అంటూ అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ జర్నలిస్ట్‌ కర్ట్ వాగ్నెర్ (Kurt Wagner) పలు సంచలన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఆయనే స్వయంగా ఓ పుస్తకాన్ని రాశారు. ‘బ్యాటిల్‌ ఫర్‌ ద బర్డ్‌’ బుక్‌లో ట్విటర్‌ కొనుగోలుకు ముందు అప్పటి సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌కు, ఎలోన్‌ మస్క్‌ ఏం జరిగిందో కులంకషంగా వివరించారు. 

అది 2022 జనవరి నెల. ఆ నెలలో స్పేస్‌ఎక్స్‌, టెస్లా కంపెనీలతో యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ‘ఎలోన్‌ జెట్‌’ అనే ట్విటర్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేయాలని అప్పటి ట్విటర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ను కోరారు. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇదే విషయాన్ని బ్యాటిల్‌ ఫర్‌ ద బర్డ్‌లో ప్రస్తావించినట్లు  బ్లూమ్‌బెర్గ్ నివేదిక సైతం పేర్కొంది. 

ఎలోన్‌ జెట్‌ అకౌంట్‌ ఎవరిది
ఎలోన్‌ జెట్‌ ట్విటర్‌ అకౌంట్‌ 19 ఏళ్ల కుర్రాడు జాక్‌ స్వీనీ (Jack Sweeney)ది. అప్పట్లో జాక్‌ స్వీనీ తన టెక్నాలజీలో తనకున్న అపారమైన తెలివితేటలతో ఎలోన్‌ మస్క్‌ను బయపెట్టాడు. తన సొంత నైపుణ్యంతో విమానాల కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ఓ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాడు. అలా ప్రైవేటు వ్యక్తుల విమానాలు ఎప్పుడు.. ఎక్కడ.. ఉన్నాయో ఇట్టే చెప్పేస్తున్నాడు. అందుకోసం ట్విటర్‌ను వేదికగా చేసుకున్నాడు. స్వీనీ ట్రాక్‌ చేస్తున్న విమానాల్లో ఎలోన్‌ మస్క్‌తో పాటు ఇతర ప్రముఖులు సైతం ఉన్నారు. 

3లక్షలు వద్దు 37లక్షలు కావాలి
ఇదే విషయం తెలుసుకున్న మస్క్‌.. స్వీనీని ట్విటర్‌లోనే (ఆ ట్వీట్‌ను కింద ఫోటోలో చూడొచ్చు) సంప్రదించారు. తన విమానాల్ని ట్రాక్‌ చేయడం ఆపాలని కోరారు. స్వీనీ విమానాల్ని ట్రాక్‌ చేయడం వల్లే తాను ఎంత నష్టపోతున్నానో వివరించారు మస్క్‌. అందుకు 5,000 (రూ.3.75 లక్షలు) డాలర్లు ఇస్తానని ఆఫర్‌ చేశారు. కానీ, స్వీనీ అందుకు నిరాకరించాడు. తనకు 50,000 డాలర్లు (దాదాపు రూ.37.55 లక్షలు) కావాలని డిమాండ్‌ చేశాడు. ఈ మొత్తంతో తాను స్కూల్‌ ఫీజు చెల్లించడంతో పాటు టెస్లా కారు కొనుక్కుంటానని తెలిపాడు.

‘బ్యాటిల్‌ ఫర్‌ ది బర్డ్‌’
ఈ ఘటన తర్వాత జరిగిన పరిణామాలపై ఈ నెల 20న విడుదల కానున్న బ్యాటిల్‌ ఫర్‌ ది బర్డ్‌లో  “మస్క్ తన ప్రైవేట్ విమానాన్ని ట్రాక్ చేస్తున్న ట్విటర్‌ ఖాతాను తొలగించమని అగర్వాల్‌కు విజ్ఞప్తి చేశారు. అగర్వాల్ మస్క్‌ అభ్యర్థనను తిరస్కరించారు. ఇలా కొద్దిసేపటికే మస్క్‌ ట్విటర్ షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించారని కర్ట్‌ వాగ్నెర్‌ హైలెట్‌ చేశారు.  

2022 అక్టోబర్‌లో ఎలోన్ మస్క్ ట్విటర్‌ని 44 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేశారు. అనంతరం ట్విటర్‌లో సిబ్బంది తొలగించారు. సగం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించడమే కాకుండా, పలువురు జర్నలిస్టులతో పాటు జాక్ స్వీనీ ట్విటర్‌ అకౌంట్‌ ఎలోన్‌ జెట్‌ను సస్పెండ్ చేశారు. 

మస్క్‌ ట్విటర్‌ను ఎప్పుడు కొనుగోలు చేశారు?
ఎలోన్‌ మస్క్‌ ఏప్రిల్‌ 14,2022 ఒక్క షేరును 54.20 చొప్పున మొత్తం షేర్లను 44 బిలియన్‌ డాలర్లకు అంటే (సుమారు రూ.3.50లక్షల కోట్లు) ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటన

ఏప్రిల్‌ 25న ట్విటర్‌ సైతం తమ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ను మస్క్‌కు అమ్ముతున్నట్లు ధృవీకరించింది.    

మస్క్‌- ట్విటర్‌ మధ్య ఫేక్‌ ట్విటర్‌ అకౌంట్లపై వివాదం నెలకొంది. పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం జులై 8న మస్క్‌ మరో ప్రకటన చేశారు.  ట్విటర్‌ను కొనుగోలు చేయడం లేదని, ఫేక్‌ అకౌంట్లకు సంబంధించి తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో ట్విటర్‌ విఫలమైందన్న ఆరోపణలతో ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు వెల్లడించారు.  

ఎట్టకేలకు మస్క్‌-ట్విటర్‌ మధ్య కొనుగోలు ఒప్పందం పూర్తయింది. 3.50లక్షల కోట్లు వెచ్చించిన ఈ అపరకుబేరుడు ట్విటర్‌ బాస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ట్విటర్‌ను ఎక్స్‌.కామ్‌గా మార్చారు. ఇప్పుడు దానిని ఎవ్రిథింగ్‌ యాప్‌గా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు మస్క్‌.

Advertisement
Advertisement