టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. పదిహేను రోజుల్లోపే అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఈ ఈవెంట్‌కు తెరలేవనుంది.
క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్-2024కు మే 26న శుభం కార్డు పడనుండగా.. జూన్ 1 నుంచి ఈ టోర్నమెంట్ రూపంలో మరోసారి పొట్టి క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత మజా దొరకనుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. కాగా టీమిండియా తమ లీగ్ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే ఆడనుంది.
ఇక మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా జూన్ 1న బంగ్లాదేశ్‌తో ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడనున్న రోహిత్ సేన.. జూన్ 5న తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ జట్టులో భాగమైన భారత ఆటగాళ్లలో మెజారిటీ మంది మే 25న అమెరికాకు ప్రయాణం కానున్నట్లు సమాచారం.
తొలి దఫా బ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సహా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తదితరులతో పాటు సహాయక సిబ్బంది కూడా న్యూయార్క్‌కు బయల్దేరతారని బీసీసీఐ వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.
నిజానికి మే 21నే వీరంతా అమెరికాకు పయనం కావాల్సి ఉందని అయితే, ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్ ఉంది కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకునేందుకు బోర్డు అనుమతినిచ్చిందని పేర్కొన్నాయి. ఇక మిగిలిన వాళ్లలో సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లి తదితరులు ఐపీఎల్-2024 ఫైనల్ పూర్తైన మరుసటి రోజు అంటే మే 27న భారత్‌ను వీడనున్నారు.
టీ20 ప్రపంచకప్-2024కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్..
Comments
Please login to add a commentAdd a comment