Facebook New Logo: ఫేస్‌బుక్‌ లోగో మారిందోచ్‌.. తేడా గుర్తించగలరా? | Facebook New Logo | Facebook Logo Changed; See If You Can Spot The Difference - Sakshi
Sakshi News home page

Facebook New Logo: ఫేస్‌బుక్‌ లోగో మారిందోచ్‌.. తేడా గుర్తించగలరా?

Published Thu, Sep 21 2023 6:45 PM

Facebook logo changed See if you can spot the difference - Sakshi

Facebook logo changed: ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ లోగో మారింది. కొన్ని నెలల క్రితం ఎలాన్‌ మస్క్‌ ఆధీనంలోని ట్విటర్‌ ‘X’గా రీబ్రాండింగ్ అయిన సంగతి తెలిసిందే. దాని ప్రసిద్ధ పిట్ట (లారీ ది బర్డ్‌) లోగోను కూడా తొలగించి దాని స్థానంలోకి సాధారణ ‘X’ అక్షరం లోగోను తీసుకొచ్చింది. తాజాగా మెటా యాజమాన్యంలోని ఫేస్‌బుక్‌ (Facebook) కూడా తమ లోగోలో కొన్ని మార్పులు చేసింది. అయితే ఈ సూక్ష్మ మార్పులను చాలా మంది గమనించలేకోపోయారు. తదేకంగా గమనించే కొందరు యూజర్లు మాత్రం పసిగట్టేశారు.

ఫేస్‌బుక్‌ కొత్త లోగో
తమ “ఐడెంటిటీ సిస్టమ్” అప్‌డేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఫేస్‌బుక్‌ లోగోను మెటా సర్దుబాటు చేసింది. ట్విటర్‌ లాంటి భారీ మార్పు కాకుండా సూక్ష్మమైన సర్దుబాటును మాత్రమే ఫేస్‌బుక్‌ చేసింది.  అయితే తదేకంగా గమినిస్తే తప్ప లోగోలో ఏమి మారిందో గుర్తించడం కష్టం.

ఫేస్‌బుక్‌ బ్రాండ​్‌కు డిఫైనింగ్ మార్క్‌ను సృష్టించడం తమ లక్ష్యమని, కొత్త లోగో సుపరిచితంగా, డైనమిక్‌గా, సొగసైనదిగా భావించేలా ఉండాలనుకున్నట్లు ఫేస్‌బుక్ డిజైన్ డైరెక్టర్ డేవ్ ఎన్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇంతకీ ఏం మారింది?
ఫేస్‌బుక్‌ తమ లోగోలో చాలా సూక్ష్మమైన మార్పులు చేసింది. లోగోలోని ‘f’ అక్షరం పరిమాణాన్ని  కాస్త పెంచింది. అలాగే లోగో బ్యాక్‌గ్రౌండ్‌లో నీలిరంగును కొంచెం ముదురుగా మార్చింది. అయితే ఫాంట్‌ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఫాంట్ ఇప్పటికీ Facebook Sansగానే ఉంది. ఇది ‘f’ అక్షరాన్ని మరింత ప్రత్యేకంగా చేసింది.

(Google AI Chatbot Bard: గూగుల్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. ఆ యాప్స్‌ ఇక మరింత సులువు!) 

ఇది "ఫేస్‌బుక్‌ కోసం రిఫ్రెష్ చేసిన గుర్తింపు వ్యవస్థ" మొదటి దశలో భాగమని మెటా పేర్కొంది. ఈ మార్పును వివరిస్తూ మెటా ఒక బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటన చేసింది. ఫేస్‌బుక్‌ యాప్‌లో రియాక్షన్‌లకు మరింత వైవిధ్యత తీసుకురావడానికి రియాక్షన్స్‌ కలర్‌ ప్యాలెట్‌ను అప్‌డేట్ చేసినట్లు ప్రకటించింది.

కొత్త లోగోపై ట్రోల్స్‌
ఫేస్‌బుక్‌ కొత్త లోగోపై సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ వస్తున్నాయి. ‘తేడా గుర్తించండి.. చూద్దాం’ అంటూ ఒకరు, ‘మరింత నీలం’ అంటూ మరొకరు..యూజర్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ‘ఇది అత్యంత భారీ మార్పు’ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement