How To Find And Pick Undervalued Stocks, Check Here - Sakshi
Sakshi News home page

‘నేను తీసుకున్న ఇంటి రుణాన్ని ఇలా చెల్లించవచ్చా’?

Published Mon, Nov 28 2022 7:17 AM

How To Find And Pick Undervalued Stocks - Sakshi

గ్రాట్యుటీతో గృహ రుణం తీర్చేయడం సరైనదేనా? నాకు గృహ రుణం ఉంది. మరో 5 ఏళ్లకు ఇది పూర్తవుతుంది. గ్రాట్యుటీ రూపంలో పెద్ద మొత్తంలో రానుంది. ఈ గ్రాట్యుటీతో గృహ రుణాన్ని తీర్చివేయాలా లేక ఎక్కడైనా ఇన్వెస్ట్‌ చేసుకోవాలా?  –క్రిష్‌ 

రుణాలలో గృహరుణం ఒక్క దానిని కొనసాగించుకోవచ్చు. అధిక వడ్డీ రేటు ఉండే ఇతర రుణాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఇతర రుణాలు తీసుకుని ఉంటే, అప్పుడు వాటిని ముందుగా తీర్చేయడాన్ని పరిశీలించొచ్చు. గృహ రుణం కొనసాగించడం వల్ల నష్టం లేదనడానికి పలు కారణాలు ఉన్నాయి. ఒకటి అద్దె రూపంలో కొంత ఆదా చేస్తుంటారు. రుణంపై వడ్డీ చెల్లింపులకు పన్ను ప్రయోజనం ఉంది. పైగా చాలా తక్కువ రేటుకు వచ్చే రుణం ఇది. గృహ రుణం రేటుతో పోలిస్తే పెట్టుబడులపై దీర్ఘకాలంలో అధిక రాబడి వస్తుంది. కనుక గృహ రుణం లాభదాయకమే. భవిష్యత్తులో వచ్చే ఆదాయం గురించి ఆందోళన చెందుతుంటే లేదా గృహ రుణం చెల్లించడం ద్వారా ప్రశాంతంగా ఉంటానని అనుకుంటే గ్రాట్యుటీ ద్వారా వచ్చే మొత్తంతో ఆ పనిచేయవచ్చు. అలా కాకుండా గృహ రుణాన్ని భారంగా భావించకపోతే, భవిష్యత్తు ఆదాయంపై నమ్మకం ఉంటే గృహ రుణాన్ని కొనసాగించుకోవచ్చు.

అంతర్గతంగా ఎంతో విలువ దాగి ఉన్న స్టాక్స్‌ను గుర్తించడం ఎలా?– కపిల్‌  
వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్‌ అవుతున్న (అండర్‌ వ్యాల్యూడ్‌) స్టాక్‌ను గుర్తించం అన్నది ఆర్ట్, సైన్స్‌తో కూడుకున్నది. డిస్కౌంటింగ్‌ సూత్రాన్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో చూడాలి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అన్నది కూడా చూడాలి. కంపెనీ నుంచి నిధులను మింగేస్తారా? విశ్వసనీయత కలిగిన వారేనా? అలాగే, ఆ కంపెనీ పనిచేస్తున్న రంగంలో మంచి వృద్ధికి అవకాశం ఉందా? భవిష్యత్తు ఉన్నదేనా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, మీకు మంచిగా కనిపించిన కంపెనీల గురించి ఎన్నో ప్రతికూల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని పెట్టుబడులను కొనసాగించే బలం కూడా కావాలి. 

చదవండి👉 ధర ఎంతైనా తగ్గేదేలే..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి!

Advertisement

తప్పక చదవండి

Advertisement