బొండా బ్యాచ్‌ స్కెచ్‌.. సీఎం జగన్‌ను హత్య చేసేందుకే.. | Sakshi
Sakshi News home page

బొండా బ్యాచ్‌ స్కెచ్‌.. సీఎం జగన్‌ను హత్య చేసేందుకే..

Published Fri, Apr 19 2024 5:29 AM

A1 Satish Arrested in CM Jagan Stone Incident - Sakshi

తలపై సున్నిత భాగంలో దాడికి పక్కా ప్రణాళిక

కుట్రదారుల ప్రోద్బలంతో హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడు ఏ1 సతీశ్‌

పదునైన సిమెంట్‌ కాంక్రీట్‌ రాయితో సీఎంపై దాడి

శాస్త్రీయ ఆధారాలతో కుట్రను ఛేదించిన పోలీసులు 

ఏ2తోపాటు తెరవెనుక కుట్రదారుల పాత్రపై కొనసాగుతున్న దర్యాప్తు

రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకినిందితులిద్దరూ 

బొండా ఉమాతో కలసి దిగిన ఫొటోలు వైరల్‌ 

సాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని హత్య చేయాలన్న పక్కా కుట్రతోనే ఆయనపై పదునైన సిమెంట్‌ కాంక్రీట్‌ రాయితో దాడికి పాల్పడ్డారు. కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడు వేముల సతీశ్‌ కుమార్‌ను ప్రేరేపించి ముఖ్యమంత్రి జగన్‌పై దాడికి పాల్పడేలా పురిగొల్పారు. విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ యాత్ర సందర్భంగా వివేకానంద పాఠశాల వద్ద దాడికి పాల్పడి సీఎంను హతమార్చాలన్నది కుట్రదారుల పన్నాగం. ముఖ్యమంత్రి జగన్‌ తలపై సున్నిత భాగంలో పదునైన రాయితో బలంగా దాడి చేయడం ద్వారా హతమార్చాలన్నది ప్రణాళిక’ అని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విజయవాడలో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.

విజయవాడ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీశ్‌ కుమార్‌ ఈ హత్యాయత్నానికి పాల్పడినట్టు ఆధారాలతో సహా గుర్తించారు. సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు లో ప్రధాన నిందితుడైన వేముల సతీశ్‌ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం టీడీపీ నేత బొండా ఉమాతో సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కేసులో ఏ 2గా ఉన్న నిందితుడు కూడా బొండా ఉమాకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు కుట్రదారుల పన్నిన పన్నాగాన్ని పోలీసులు ఆధారాలతో వెలికితీశారు.

హత్యాయత్నానికి పాల్పడిన వేముల సతీష్ను ప్రధాన నిందితుడు (ఏ1)గా పేర్కొంటూ గురువారం విజయవాడ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్‌ విధించింది. సీఎం జగన్‌పై హత్యాయత్నానికి సతీష్ను ప్రేరేపించిన మరో కీలక నిందితుడిని ఏ 2గా పేర్కొంటూ,  ఈ కుట్ర కోణాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్‌ నివేదికలో పేర్కొన్నారు. కాగా, ఏ2 గా ఉన్న నిందితుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు ప్రధాన అనుచరుడు. సెంట్రల్‌ నియోజవర్గ టీడీపీ బీసీ సెల్‌లో కీలక నేత. అంతేగాక సెంట్రల్‌ నియోజకవర్గ టీడీపీ సోషల్‌ మీడియా విభాగంలోనూ కీలక నేత కావడం గమనార్హం. రిమాండ్‌ నివేదికలోని

ప్రధానాంశాలు ఇవీ....  గతంలోనూ నేర చరిత్ర.. 
ముఖ్యమంత్రి జగన్‌ను హత్య చేయాలని కుట్రదారులు పన్నాగం పన్నారు. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో ఆయనపై దాడికి పాల్పడి హతమార్చాలన్నది వారి కుట్ర. ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో పదునైన రాయితో దాడి చేసి అంతం చేయాలని పథకం రూపొందించారు. అందుకు విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్‌ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ముఖ్యమంత్రిపై దాడి చేసేందుకు వేముల సతీష్‌ కుమార్‌ను ఎంపిక చేశారు. గతంలో నేర చరిత్ర కూడా ఉన్న అతడు ఏ2కి కీలక అనుచరుడు. ముఖ్యమంత్రిపై దాడి చేసి హత్య చేయాలని సతీష్ను ఏ2 ప్రేరేపించాడు.  

ముందే చేరుకుని మాటు వేసి.. 
కుట్రదారుల పన్నాగాన్ని వేముల సతీష్‌ అమలు చేశాడు. ముఖ్యమంత్రి జగన్‌ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఈ నెల 13న విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌లోకి ప్రవేశించక ముందే అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద పదునైన సిమెంట్‌ కాంక్రీట్‌ రాయిని సేకరించి జేబులో వేసుకుని వివేకానంద స్కూల్‌ వద్దకు చేరుకుని మరి కొంతమందితో కలసి మాటు వేశాడు. ఆ రోజు రాత్రి 8.04 గంటలకు సీఎం జగన్‌ తన వాహనంపై నిలబడి యాత్ర నిర్వహిస్తూ అక్కడికి చేరుకున్న సమయంలో వేముల సతీష్‌ తన ఫ్యాంట్‌ జేబులోని పదునైన సిమెంట్‌ కాంక్రీట్‌ రాయిని తీసి సీఎం వైఎస్‌ జగన్‌పై  బలంగా విసిరి దాడికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తూ ఆ సిమెంట్‌ కాంక్రీట్‌ రాయి ముఖ్యమంత్రి తలపై సున్నిత భాగంలో కాకుండా ఎడమ కన్ను పైభాగంలో తగలడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది.  

తెరవెనుక కుట్రదారులపై దృష్టి 
ఈ కుట్ర కోణంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. మరి కొందరు సాక్షులను విచారించడంతోపాటు సాంకేతికపరమైన డేటాను మరింత విశ్లేíÙంచాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే గుర్తించిన ఏ 2తోపాటు తెరవెనుక ఉన్న ప్రధాన కుట్రదారులపై పోలీసులు దృష్టి సారించారు. కుట్రదారులు ప్రేరేపించడంతోనే వేముల సతీశ్‌ ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు నిర్ధారించారు. అతడిని ప్రేరేపించిన ఏ2ని కూడా గుర్తించారు. ఏ2 పాత్రకి సంబంధించి మరింత సమాచారంతోపాటు అతడి వెనుక ఉన్న కీలక కుట్రదారుల హస్తాన్ని పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తులో దూకుడు పెంచారు. ఈ కేసులో త్వరలోనే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నట్లు స్పష్టమవుతోంది. కీలక వ్యక్తుల సహకారం లేకుండా ఈ కుట్రను ఇంత పకడ్బందీగా అమలు చేయడం సాధ్యం కాదని పోలీసులు పేర్కొంటున్నారు.  

సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు 
ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు, సీఎం బస్సు చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డ్‌ అయిన దృశ్యాలు,  స్థానికులు తమ సెల్‌ఫోన్లో తీసిన వీడియోలు, కాల్‌ డేటా తదితర ఆధారాలను విశ్లేషించారు. ఆ ఆధారాలన్నీ హత్యాయత్నం కుట్రలో ఏ1 వేముల సతీష్, ఏ 2 పాత్రను నిర్ధారించాయి.   

మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్‌ 
దర్యాప్తు బృందాలు ఈ నెల 17 సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన నిందితుడు వేముల సతీష్‌ను విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కేజీఎఫ్‌ అపార్ట్‌మెంట్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నాయి. ఈ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న అనంతరం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్‌ చేశారు. నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. సతీష్‌ ఇంట్లో సోదాలు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన రోజు అతడు ధరించిన దుస్తులను స్వా«దీనం చేసుకున్నారు. అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా సతీష్ను అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి  లాకప్‌లో ఉంచారు. నిందితుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతోపాటు సీఆర్‌పీసీ 50 కింద నోటీసులు కూడా జారీ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement