ఇవ్వడమే జగన్‌కు తెలుసు: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

ఇవ్వడమే జగన్‌కు తెలుసు: సీఎం జగన్‌

Published Thu, May 2 2024 4:20 AM

CM YS Jagan Fires On Chandrababu At Bobbili Eluru Payakaraopeta

బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు సభల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

జగన్‌ భూములిచ్చేవాడే కానీ.. నీలా లాక్కునేవాడు కాదు చంద్రబాబూ 

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారం 

దేశంలో వందేళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతోంది 

రికార్డులు అప్‌డేట్‌ చేసి రైతన్నలకు అందజేస్తున్నాం 

వారిపై పైసా భారం పడకుండా పనులు చేపట్టాం 

కోర్టులు, ఆఫీసుల చుట్టూ తిరిగే దుస్థితిని తప్పించాం 

బాబును ఓడించడమంటే.. పేదలను గెలిపించడమే 

జగన్‌ ఎప్పుడూ పేదలు, పేదలు అంటుంటే తట్టుకోలేకపోతున్నారు.. మన 59 నెలల పాలనలో జరిగిన మార్పులన్నీ విప్లవాలే 

నేర ప్రవృత్తికి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు 

వెన్నుపోట్లు, హత్యలతోనే ఆయన రాజకీయం 

వైఎస్సార్‌ గాలిలో కలిసిపోతాడని అసెంబ్లీ సాక్షిగా అనలేదా? 

ఇప్పుడు జగన్‌ను చంపేస్తే తప్పేమిటని అంటున్నాడు 

చంద్రబాబు మాదిరిగా నాకు జెడ్‌ ప్లస్‌ భద్రత లేదు.. జగన్‌కు జనమే రక్ష  

జగన్‌ను చంపేస్తే తప్పేమిటంటున్నాడు..
మీ బిడ్డ జగన్‌ను ఓడించలేమని, ఆ పేద అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, వారి కుటుంబ సభ్యులు మోసపోవడానికి సిద్ధంగా లేరని, ఎంత ప్రలోభపెట్టినా తన మాటలు నమ్మట్లేదని గ్రహించిన చంద్రబాబు నోట జగన్‌ను చంపేస్తే ఏమవుతుంది? అన్నమాట వినిపిస్తోంది. నాడు వైఎస్సార్‌ గాల్లో కలిసిపోతాడని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశాడు. నేడు జగన్‌ను చంపేస్తే తప్పేమిటని అంటున్నాడు. రాజకీయాల్లో ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా?
– బొబ్బిలి సభలో సీఎం జగన్‌

తట్టుకోలేకపోతున్నారు..
పేదల గురించి జగన్‌ మాట్లాడుతుంటే పెత్తందారులైన చంద్రబాబు, ఈనాడు, ఆం«ధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, వదినమ్మకు చాలా బాధగా, విపరీతమైన కోపంగా ఉంటుంది. జగన్‌ ఎప్పుడూ పేదలు.. పేదలు అంటుంటే విని తట్టుకోలేక­పోతున్నారు. ఈ రోజు జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. రాష్ట్రంలో క్లాస్‌ వార్‌ జరుగుతుంది. పేదలు ఒక ఒకవైపు, పెత్తందారులు మరోవైపు ఉన్నారు. 

కులం పరంగా, ఫలానా పార్టీ పట్ల అభిమానం వల్ల కావొచ్చు.. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంటికి వెళ్లాక మీ కుటుంబానికి ఎవరి వల్ల మంచి జరిగిందో మీ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని చర్చించండి. ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుందో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా.
– ఏలూరు సభలో  సీఎం జగన్‌

దీవించండి..
బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి చిన్నఅప్పలనాయుడు, విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్‌ యాదవ్, ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నానీని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా.  

సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘జగన్‌ ఎలాంటివాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకూ తెలుసు చంద్రబాబూ! జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ నీలా భూములు లాక్కునేవాడు కాదు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అంటే చంద్రబాబుకు తెలియదు. వందేళ్ల క్రితం బ్రిటీష్‌ హయాంలో జరిగిన సర్వే తర్వాత ఇప్పుడు చేపట్టిన సర్వేతో పక్కాగా రికార్డులు సృష్టించి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయడమే దీని ఉద్దేశం. 15 వేల గ్రామ సచివాలయాల్లో 15 వేల మంది సర్వేయర్లను నియమించి ఇలా సర్వే చేసిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. 

రైతన్నలు కోర్టులు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చి ప్రతి ఒక్కరికీ వారి భూములపై సంపూర్ణ హక్కులు కల్పించాలనే లక్ష్యంతో రీ సర్వే ద్వారా సరిహద్దు రాళ్లను నాటించి రికార్డులు అప్‌డేట్‌ చేసి ఆ పత్రాలన్నీ రిజిస్ట్రేషన్‌ చేసి రైతన్నలకు ఇస్తున్నాం. ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలేగానీ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. మనం అమలు చేసిన పథకాల గురించి చెబుతుంటే చంద్రబాబుకు కోపం వస్తోంది. 

గత 59 నెలల కాలంలో ఎన్నడూ లేని విప్లవాత్మక సంస్కరణలను మీ బిడ్డ తెచ్చినందుకే ఆయనకు కోపం వస్తోంది. ఈ ఎన్నికల్లో బాబును ఓడించడమంటే పేదలను గెలిపించడమే’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. నేరప్రవృత్తికి చంద్రబాబు నిలువెత్తు నిదర్శనమని, వెన్నుపోట్లు, హత్యలతోనే ఆయన రాజకీయాలు ముడిపడి ఉంటాయని ధ్వజమెత్తారు. సొంతమామ ఎన్టీఆర్‌ను, వంగవీటి రంగాను, పింగళి దశరథరామ్‌ను, ఐఏఎస్‌ అధికారి రాఘవేంద్రరావును కుట్రలతోనే కడ తేర్చారన్నారు. బుధ­వారం విజయనగరం జిల్లా బొబ్బిలి, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, ఏలూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్‌ మాట్లాడారు. 

ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి
మరో 13 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. ఇది జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు.. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. రాబోయే ఐదేళ్ల పాటు మీ ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి. ఓటుతో మీ తలరాతలు మారతాయి. 

ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపే, మళ్లీ మోసపోవడమే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. బాబుకు ఓటు వేయడమంటే  కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే. పేదలంటే బాబు ముఠాకు కోపం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీతో నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. మీ బిడ్డ ఇచ్చింది ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. 

మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలను అమలు చేశాం. నేను వరుసబెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్‌ల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోంది. మీరంతా చూస్తున్నారు కదా ఆ కోపాన్ని.. ఆయనకు మనమీద ఎందుకంత పిచ్చికోపం వస్తోందంటే.. గతంలో ఎన్నడూ చూడని విధంగా మీ బిడ్డ విప్లవాలు తెచ్చాడు కాబట్టే. నేను చెబుతున్న విష­యాలు గతంలో ఎప్పుడైనా అమలు జరిగాయో లేదో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. 

జగన్‌ను చంపితే ఏమవుతుందంటున్న బాబు
మీ జగన్‌ ప్రజలకు ఏం చేశాడో గుర్తుచేస్తూ ప్రచారం చేస్తున్నాడు. చంద్రబాబు మాత్రం ఏం మాట్లాడు­తున్నాడో మీరంతా గమనిస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లా బుచ్చి­రెడ్డి­పాలెంలో ఇదే పెద్దమనిషి రేపు జగన్‌ను చంపితే ఏం జరుగుతుంది? అని వ్యాఖ్యలు చేశాడు. ఆయన మానసిక పరిస్థితి, ఆ ఆలో­చనలు ఎలా ఉన్నాయో గమనించాలని కోరుతున్నా. ఏమయ్యా చంద్రబాబూ..! ప్రజలు నీకు ఎందుకు ఓటు వేయాలి? అని నేను అడుగుతుంటే నీ సమాధానం అదా?

అక్కచెల్లెమ్మలే రక్షించుకుంటారు.. 
అయ్యా చంద్రబాబూ.. నువ్వు అనుకుంటే సరిపోదు. ఈ 59 నెలల్లో మంచి జరిగిన ఆ కోట్ల మంది అక్కచెల్లెమ్మల కుటుంబాలు జగన్‌కు తోడుగా ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ జగన్‌కు తోడుగా, అండగా ఉన్నారయ్యా చంద్రబాబూ! వారి జగన్‌ను వారే రక్షించుకుంటారు. నాకు నీ మాదిరిగా జడ్‌ ప్లస్, జడ్‌ డబుల్‌ ప్లస్‌ సెక్యూరిటీ అక్కర్లేదయ్యా. అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ లంచాలు, వివక్ష లేకుండా ఇచ్చిన రూ.2.70 లక్షల కోట్ల డీబీటీ బటన్‌లే నాకు శ్రీరామరక్ష. 

పిల్లలు బాగుండాలని ఇచ్చిన అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, అక్కచెల్లెమ్మలు బాగుండాలని ఆరాటపడుతూ అందించిన చేయూత, ఆసరా, సున్నావడ్డీ, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం.. ఇవన్నీ నాకు రక్ష అని చంద్రబాబుకు చెబుతున్నా. నా అవ్వాతాతలకు మంచి చేస్తూ ఇంటివద్దే అందించిన పెన్షన్లతో దేవుడికి చేస్తున్న ప్రార్థనలే నాకు శ్రీరామ రక్ష. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల ప్రార్థనలే వారి బిడ్డ జగన్‌కు శ్రీరామరక్ష. మంచిని అందుకున్న నా రైతన్నలు ఆ భూమాత, పంచ భూతాల సాక్షిగా చేస్తున్న ప్రార్థనే నాకు శ్రీరామ రక్ష. 

జగన్‌ మార్కు సామాజిక న్యాయం
అసెంబ్లీ, ఎంపీ సీట్లు కలిపి మొత్తం 200 స్థానాలకుగానూ 100 స్థానాల్లో నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,  మైనార్టీలకు టికెట్లు ఇచ్చాం. మంత్రి పదవుల్లో ఏకంగా 68 శాతం నా ఎస్సీ, ఎస్టీ,  బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటే నాలుగు పదవులు ఆ వర్గాలకే కేటాయించి గౌరవించాం. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు వారికే కల్పిస్తూ చట్టం తెచ్చాం. 

ఇంత సామాజిక న్యాయం, తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? వలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా రెండు బటన్లు ఫ్యాను గుర్తు మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి. మీ అందరికీ మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌ లోనే ఉండాలి. 

బాబు వ్యాఖ్యలు నేరప్రవృత్తికి నిదర్శనం
ఆ రోజు నా తండ్రి రాజశేఖరరెడ్డి చేస్తున్న మంచి పనులు, ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అక్కసుతో అసెంబ్లీ సాక్షిగా నాన్ననుద్దేశించి ‘నువ్వు ఆ గాలిలోనే కలిసిపోతావ్‌...!’ అన్న నీ వ్యాఖ్యలను నేను ఎప్పటికీ మర్చిపోలేను 
చంద్రబాబూ. నాడు నా తండ్రిని, నేడు నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక నువ్వు మాట్లాడుతున్న మాటలు నీ దిగజారుడుతనానికి, నీ నేర ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి.

పేదలకు పథకాలు అందాలా.. లేదా?
చంద్రబాబును అడుగుతున్నా.. ఒక ముఖ్యమంత్రి, ఒక నిజమైన నాయకుడు, ఒక నిజమైన లీడర్‌ రాష్ట్రంలో 90 శాతం మంది పేదలకు ఈ రోజు మంచి చేయడం కొనసాగాలా.. వద్దా? ఎవరు మేలు చేశారు? నిజమైన నాయకుడు ఎవరో ఆలోచన చేయాలని అందరినీ కోరుతున్నా. రాష్ట్రంలో తెల్లరేషన్‌ కార్డులున్న కుటుంబాలు 1.44 కోట్లు. అంటే జనాభాలో 90 శాతం. వీరందరూ పేదలు కాదా? వీరికి పథకాలు అందాలా? లేదా? ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులున్న వారు జనాభాలో 95 శాతం ఉన్నారు. 

వీరికి పథకాలు అందాలా లేదా? ఉన్నత చదువులు చదువుతున్న 93 శాతం మందికి పూర్తి ఫీజుల చెల్లిస్తూ విద్యాదీవెన, ఖర్చులకు వసతి దీవెన అందాలా.. లేదా? పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న నా అక్కచెల్లెమ్మలు 1.05 కోట్ల మంది పేదలు కాదా? వీరందరికీ పథకాలు అందాలా.. లేదా? రాష్ట్రంలో అవ్వా­తాతలు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి అక్కలు 66 లక్షల మందికిపైగా పెన్షన్లు తీసుకుంటున్నారు. రైతు భరోసాతో 55 లక్షల మంది రైతన్నలకు అండగా నిలిచాం. మరో 60 లక్షల మంది అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన తీసుకుంటున్నారు. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చి 22 లక్షల గృహ నిర్మాణాలు చేపట్టాం. ఇప్పుడు చెప్పండి.. వీరంతా పేదలు కాదా? వీరికి పథకాలు అందాలా లేదా?


ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ విషయంలో దుష్ప్రచారం జరుగుతోంది. జగన్‌ మీ భూములు కాజేస్తాడంటూ ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లు పంపుతూ, ఫోన్లు చేసి చెబుతున్నారు. అయ్యా చంద్రబాబూ.. జగన్‌ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకూ తెలుసు. జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ నీలా భూములు లాక్కునేవాడు కాదు
– పాయకరావుపేట సభలో సీఎం జగన్‌

మీ బిడ్డ తెచ్చిన కొన్ని విప్లవాలివీ..
⇒ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే రూ.3 వేల పెన్షన్‌ కానుక విప్లవమా? కాదా?
⇒ గవర్నమెంట్‌ బడుల్లో నాడు–నేడు, ఇంగ్లీష్‌ మీడియం, బడి తెరిచే సమయానికే విద్యా­కానుక, బైజూస్‌ కంటెంట్, 3 తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, సబ్జెక్ట్‌ టీచర్లు, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, 6వ తరగతి నుంచి డిజిటల్‌ బోధన, ఐఎఫ్‌పీలు లాంటివి విప్లవమా? కాదా?

⇒ తొలిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్యువల్‌ టెక్ట్స్‌బుక్స్, పూర్తి ఫీజులు చెల్లిస్తూ ఇంజనీరింగ్, డాక్టర్, డిగ్రీ లాంటి ఉన్నత చదువులు అభ్యసించే 93శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అంతర్జాతీయ వర్సిటీలు అందించే ఆన్‌లైన్‌ సర్టిఫైడ్‌ కోర్సులను మన కరిక్యులమ్‌లో భాగం చేయడం లాంటివి విప్లవాలు కాదా?

⇒ మీ పిల్లలను బడికి పంపించండమ్మా.. మీకు తోడుగా మీబిడ్డ ఉన్నాడంటూ అమ్మఒడి అందిం­చడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? 

⇒ అక్కచెల్లెమ్మలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయూత, కాపునేస్తం, సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, వైఎస్సార్‌ ఆసరా,  సున్నా­వడ్డీ­తో­­పాటు 31లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరిటే రిజిస్ట్రేషన్, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, గ్రామంలోనే మహిళా పోలీస్, భద్రత కోసం దిశ యాప్, నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది మీ జగన్‌ కాదా? ఇవన్నీ విప్లవాలు అవునా? కాదా? 

⇒ మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఆర్బీకేలు, ఈ–క్రాప్, ఉచిత పంటల బీమా, పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, నష్టపోతే సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఆర్బీకేల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు, జీఎల్‌టీ, ఆక్వా రైతులకు రూపా­యి­న్నరకే కరెంట్, ఆయిల్‌పామ్‌ రైతులకు మెరుగైన ధర ఇచ్చిందెవరు? ఇవన్నీ విప్లవాలు కాదా?

⇒ వైద్యం కోసం అప్పులపాలు కాకుండా విస్తరించిన ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షలదాకా ఉచిత వైద్యం, ఆపరేషన్‌ తరువాత విశ్రాంతి సమ­యంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా ఆరోగ్య ఆసరా, మన గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష లాంటివి అమలు చేసింది మీ బిడ్డ పాలనలో కాదా? ఇవన్నీ వైద్య రంగంలో విప్లవాలు కాదా? 

⇒ మత్స్యకార భరోసా, నేతన్ననేస్తం, వాహన­మి­త్ర, చేదోడు, తోడు, ఎంఎస్‌ఎంఈలకు సంపూర్ణ మద్దతు, లా నేస్తం లాంటివి తెచ్చిందెవరు?

⇒ గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఈరోజు ఊరిలోకి అడుగుపెట్టిన వెంటనే గ్రామ సచివాలయం కనిపిస్తోంది. ఏకంగా 600 రకాల సేవలు మన ఇంటివద్దే అందుతు­న్నాయి. వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ప్రతి 60–70 ఇళ్లకు పెన్షన్‌ నుంచి పౌరసేవలు, పథకాలు, రేషన్‌ దాకా డోర్‌ డెలివరీ అవుతు­న్నాయి. అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకేస్తే విలేజ్‌ క్లినిక్, నాడు–నేడుతో మారిన ఇంగ్లీష్‌ మీడియం బడులు, గ్రామానికే ఫైబర్‌ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ గతంలో ఉన్నాయా? 

⇒ మీ బిడ్డ ప్రభుత్వం రాకముందు గవర్నమెంట్‌ ఇచ్చే డబ్బులు లంచాలు, తిరుగుళ్లు లేకుండా నేరుగా మీ చేతికే అందుతాయంటే ఎవరైనా నమ్మేవారా? నా అక్కచెల్లెమ్మలు, వాళ్ల కుటుంబాలు, పిల్లలు బాగుండాలని 130 సార్లు బటన్‌ నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు పారదర్శకంగా అందించడం ఓ విప్లవాత్మక చరిత్ర కాదా?

అబద్ధాలకు రెక్కలు...
చంద్రబాబు తన అబద్ధాలు, మోసాలకు రెక్కలు కడుతున్నాడు. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్‌ను అడ్డుకుని మనపై నెపం వేస్తున్నాడు. ఏ రోజైనా ఆయన అవ్వాతాతల బాధలు, కష్టాలను పట్టించుకున్నాడా? ఏనాడైనా ఇంటికే పెన్షన్‌ ఇచ్చాడా? తన మనిషి నిమ్మగడ్డ రమేశ్‌తో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాయించి ఇంటివద్దే అందిస్తున్న పెన్షన్లను అడ్డుకున్నాడు. ఆ అవ్వాతాతలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంతో మీబిడ్డపై నెపం మోపుతున్నాడు.

ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారా?
⇒ 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్క మంచి పనిగానీ, పథకంగానీ గుర్తుకొస్తుందా? ఆ పెద్దమనిషి తన జీవిత కాలంలో ఏ రోజూ పేదలకు మంచి చేసిందిలేదు. 2014లోనూ ఇదే మాదిరిగా హామీలిచ్చి వంచించాడు. ఒక్కసారి వాటిని గుర్తుచేసుకుంటే ప్రపంచంలో ఎవరైనా చంద్రబాబును నమ్ముతారేమో మీరే చెప్పండి.

⇒ రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ జరిగిందా? 
⇒ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానంటూ ఏకంగా రూ.14,205కోట్లు  ఎగనామం పెట్టాడు. 
⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు కాదు కదా ఎవరికైనా ఒక్క రూపాయి అయినా బ్యాంకులో జమ చేశాడా? 

⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఏ ఒక్క 
ఇంటికైనా 60 నెలల్లో రూ.2వేలు చొప్పున రూ.1.20 లక్షలు ఇచ్చాడా? 
⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు అన్నాడు. ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? 
⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత పవర్‌ లూమ్స్‌ మాఫీ అన్నాడు. జరిగిందా? 

⇒ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాడా? 
⇒ సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మాణం జరిగిందా? మన బొబ్బిలి, పాయకరావుపేటలో ఎక్కడైనా కనిపిస్తున్నాయా? 
⇒ ప్రత్యేక హోదా తీసుకురాకపోగా అమ్మేశాడు. 
⇒ ఇప్పుడు మళ్లీ మోసగించేందుకు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, 
బెంజ్‌ కారు అంటూ నమ్మబలుకుతున్నారు. 

Advertisement
Advertisement