కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్‌ పిలుపు | KCR calls for State Wide protests against Congress Govt | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్‌ పిలుపు

Published Wed, May 15 2024 9:26 PM | Last Updated on Wed, May 15 2024 9:33 PM

KCR calls for State Wide protests against Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌  ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా… గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి..ఇప్పుడు  సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం,మోసం చేయడం, దగా చేయడమేనని మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను కేసీఆర్‌ ఖండించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని,  ఈ విషయం తెలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎలాప్రకటిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి వచించిందని మండిపడ్డారు. ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని, అందుకే నాలిక మడతేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారని విమర్శించారు. ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పింటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవాళ్లు. ఇప్పటికీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారన్నారు.

‘రైతుబంధు ఇవ్వకుండ , రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తుంది. అందుకే రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకే బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టింది బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలి. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటున్నది. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ వడ్ల కల్లాలకాడికి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లాలి. వారికి అండగా నిలవాలి. రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అని అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement