లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను ఉద్దేశిస్తూ.. ప్రజలు బీజేపీకి ఓటు వేస్తే తాను తిరిగి జైలుకు వెళ్లాల్సి వస్తుందని, అందుకే ఇండియా కూటమి అభ్యర్ధులను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు.
ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఆప్, కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ చాందినీ చౌక్ లోక్‌సభ అభ్యర్థి జేపీ అగర్వాల్‌కు మద్దతుగా మోడల్ టౌన్‌లో కేజ్రీవాల్ రోడ్‌షో నిర్వహించారు.
నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నేను మీ మధ్య ఉండటానికి జైలు నుండి నేరుగా వచ్చాను. ఈ వ్యక్తులు (బీజేపీ) నన్ను కటకటాల వెనక్కి నెట్టారు. నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారని నాకు బాగా తెలుసు. నేను చిన్న వ్యక్తిని. మాది ఢిల్లీ, పంజాబ్‌లలో ప్రభుత్వాలున్న చిన్న పార్టీ అని కేజ్రీవాల్ అన్నారు.
ఇంతకీ నేను చేసిన తప్పు ఏమిటి?
నన్ను ఎందుకు జైలులో పెట్టారని నేను ఆలోచిస్తున్నాను. ఇంతకీ నేను చేసిన తప్పు ఏమిటి? అని తనని తాను ప్రశ్నించుకున్నారు.
పిల్లలకు మంచి విద్యను అందించడం, వారికి మంచి పాఠశాలలు నిర్మించడం, మొహల్లా క్లినిక్‌లు ప్రారంభించడం, ప్రజలకు ఉచితంగా మందులు అందేలా చేయడం నేను చేసిన తప్పా అని అన్నారు.
మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని
ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. నేను జైలుకు వెళ్లాలా వద్దా అన్నది మీ చేతుల్లోనే ఉంది. మీరు కమలం (బీజేపీ గుర్తు) ఎంచుకుంటే నేను మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఇండియా కూటమి అభ్యర్థిని ఎంచుకుంటే.. నేను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
ఓటు వేసేముందు ఆలోచించండి
ఓటు వేయడానికి వెళ్లినప్పుడు కేజ్రీవాల్ జైలుకు వెళ్లాలా అని మీరు ఆలోచించాలి అని ఆయన అన్నారు. నేను జైలులో ఉన్నప్పుడు తనను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని కానీ హనుమంతుడి ఆశీర్వాదం వల్ల నేను బలంగా ఉన్నాను అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment