నిరుద్యోగులపై చంద్రబాబు మరోసారి మాయా వల
జాబు రావాలంటే బాబు రావాలంటూ 2014 ఎన్నికల్లో ప్రచారం
కరపత్రాలు వేసి ఊరూరా పంపిణీ
ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ.. అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లపాటు ఆ ఊసేలేదు
ప్రతిపక్ష నేత అసెంబ్లీలో బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తే అసలా పథకమే లేదన్న అచ్చెన్న
ఆ ఒత్తిడి తట్టుకోలేక 2017–18 బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లు కేటాయింపు
అయినా అమలుచేయని చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఆరునెలల ముందు ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో పథకం
నెలకు రూ.1,000 చొప్పున ఇస్తామని ప్రకటన
సవాలక్ష ఆంక్షలతో కేవలం 12 లక్షల మంది నిరుద్యోగులకు అర్హత
కానీ, 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల
చివరికి 1.62 లక్షల మంది మాత్రమే అర్హులని తేల్చిన బాబు
1.70 కోట్ల నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన బాబు
ఎన్నికలు రావడంతో మళ్లీ యువతకు గేలం.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలు
బాబు గత చరిత్ర చూడండి.. ఆయన్ను నమ్మొద్దంటూ యువతకు విద్యావేత్తలు, మేధావులు హితవు
సాక్షి, అమరావతి: ‘‘జాబు రావాలంటే బాబు రావాలి.. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా.. ఇంటికొక ఉద్యోగం ఇస్తా.. ఉద్యోగం ఇవ్వకపోతే ఉపాధి కల్పిస్తా.. మీరేమీ చదువుకోకపోయినా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలిస్తా’’.. ఈ హామీ గుర్తుందా? 2014 ఎన్నికల్లో చంద్రబాబు సంతకంతో కూడిన కరపత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఊరూరా పంచుతూ ప్రచారం చేసింది. సీన్ కట్‌చేస్తే ఆ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. చెప్పినట్లుగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలుచేశారా అంటే అనేకానేక హామీల్లాగే అదీ బాబు అటకెక్కించేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి హామీతోనే ఆయన మరోసారి యువతకు వల విసురుతున్నారు. ఆయన మాయలో పడొద్దని.. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మేధావులు, విద్యావేత్తలు యువతకు సూచిస్తున్నారు.
నిరుద్యోగ భృతి ఇవ్వబోమన్న అచ్చెన్న..
ఇక అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబు ఆ ఊసే ఎత్తలేదు. కానీ, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం సందర్భం వచ్చిన ప్రతీసారి ఈ అంశంపై చంద్రబాబు సర్కారును నిలదీస్తూనే ఉన్నారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తానని యువతకు మాటిచ్చి ఎలా విస్మరిస్తారంటూ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నకు నిరుద్యోగ భృతి అనే పథకమేలేదని, ఈ ప్రశ్న ఉత్పన్నమే కాదంటూ నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చన్నాయుడు అసెంబ్లీలో అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. శిక్షణనిచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇవ్వబోమని, బాబు వస్తే జాబు వస్తుందనే నినాదంతో ఎన్నికల్లో వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు.
అయినా, నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో జగన్ పట్టువిడవకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుండడంతో 2017–18లో బడ్జెట్‌లో టీడీపీ ప్రభుత్వం కంటితుడుపుగా రూ.500 కోట్లు కేటాయించింది. దీనిపై జగన్ మండిపడుతూ.. జాబు రావాలంటే బాబు రావాలని, జాబు ఇవ్వకపోతే ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ఎన్నికల ముందు ఇంటింటా ప్రచారం చేసి ఇప్పుడు గొప్పగా రూ.500 కోట్లు కేటాయించామని చెప్పడం నిరుద్యోగులను నిలువునా మోసం చేయడమేనని ఉతికి ఆరేశారు. అంతేకాక.. రాష్ట్రంలో 1.75 కోట్ల కుటుంబాలున్నాయని, ఒక్కో కుటుంబానికి నెలకు రెండువేల చొప్పున భృతి ఇవ్వాలని.. ఇందుకు నెలకు రూ.3,500 కోట్లు అవసరమని, అలాగే ఏడాదికి రూ.40 వేల కోట్లు అవసరమైతే రూ.500 కోట్లు ఏ మూలకు సరిపోతాయంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ చీల్చిచెండాడారు.
ఉన్న ఉద్యోగాలకు బాబు ఎసరు..
ఇలా నిరుద్యోగ భృతి ఇస్తానంటూ నాలుగున్నరేళ్ల పాటు ఎగమనామం పెట్టి ఎన్నికల ముందు ఆర్నెల్లపాటు యువతను మోసం చేయడానికి కంటితుడుపు చర్యగా ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో చంద్రబాబు ఎత్తుగడ వేశారు. కానీ, నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఆరోగ్య మిత్రలను, ఫీల్డ్ అసిస్టెంట్లను, గోపాల మిత్రలను ఉద్యోగాల నుంచి చంద్రబాబు తొలగించారు. దీంతో.. మళ్లీ ఇప్పుడు ఎన్నికల ముందు యువతను, నిరుద్యోగులను మోసం చేయడానికి చంద్రబాబు కుయుక్తులు, మోసపూరిత ప్రకటనలతో వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త నిరుద్యోగులూ.. అంటూ మేధావులు, విద్యావేత్తలు యువతను అప్రమత్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతిపై 2014 ఎన్నికల ముందు ఇంటింటా ప్రచారం చేసి అధికారం దక్కాక ఎలా మోసం చేశారో అచ్చు అలాగే చంద్రబాబు మళ్లీ యువతకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి అంటూ అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నారని.. చంద్రబాబు వలలో పడి మరోసారి మోసపోవద్దని వారు సూచిస్తున్నారు.
వైఎస్ జగన్ ఒత్తిడితో.. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు..
ఇక 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ చంద్రబాబు పైసా ఖర్చు పెట్టలేదు. ప్రతిపక్ష నేత జగన్ తన ఒత్తిడి కొనసాగిస్తుండడంతో ఇక 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నాలుగు నెలల కోసం నిరుద్యోగ భృతి కాదు ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగులకు నెలకు రూ.1,000 ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. ఈ ఉపసంఘం సవాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించింది.
⇒ టెన్త్, ఇంటర్ చదివిన వారు అనర్హులని ఆంక్షలు విధించింది.
⇒ 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారు డిగ్రీ చదివిన వారికే భృతి వర్తిస్తుందని, దారిద్య్ర రేఖకు దిగువనున్న వారు.. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని షరతులు విధించింది.
⇒ దీంతో వచ్చిన దరఖాస్తుల్లో 12 లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చింది.
⇒ ఆ తరువాత అది పది లక్షలు, మళ్లీ మళ్లీ వడపోత తర్వాత 2.10 లక్షల మందే అర్హులంటూ వెల్లడించి మళ్లీ దానిని 1.62 లక్షలకు కుదించింది.
⇒ అనంతరం 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చేసి ఈ–కేవైసీ మెలిక పెట్టింది.
⇒ అలాగే, ప్రతినెలా వేలిముద్ర వేస్తేనే నిరుద్యోగ భృతి అంటూ ఆంక్షలు పెట్టుకుంటూ పోయి ఎన్నికల వరకు తాత్సారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment