మళ్లీమళ్లీ పాత హామీలే ఇచ్చిన చంద్రబాబు
కురుపాం: ఎన్నికల ప్రచారంలో భాగంగా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో ప్రజాగళం సభకు గురువారం వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలే మళ్లీ ఇవ్వడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు కొమరాడ మండలంలోని పూర్ణపాడు–లాభేసు వంతెన నిర్మాణం కోసం హామీ ఇచ్చి అరకొరగా నిధులు మంజూరు చేయడంతో అది సగంలోనే నిర్మాణం ఆగిపోయిన విషయం విదితమే.
మళ్లీ తాజాగా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కురుపాంలో నిర్వహించిన ప్రజాగళం సభలో పూర్ణపాడు–లాభేసు వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని, గుమ్మిడిగెడ్డ పై మినీరిజర్వాయర్ నిర్మాణం చేపడతామని, గుమ్మలక్ష్మీపురంలో జీడిపరిశ్రమ ఏర్పాటు చేస్తామని, తోటపల్లి పాత ప్రధాన కాలువకు రూ.45 కోట్లతో ఆధునికీకరణ పనులు చేసి ఏడువేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జగనన్న భూ హక్కు పథకం కాగితాల్ని, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కాగితాలను బహిరంగ సభలో చంద్రబాబు దహనం చేశారు. గతంలో కూడా ఇవే హామీలిచ్చి విస్మరించడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగే ప్రతిసారీ ఎన్నికలప్రచారానికి వచ్చనప్పుడు పూర్ణపాడు–లాభే సు వంతెన నిర్మాణానికి ఒక అస్త్రంలా వినియోగంచుకుంటున్నారని సభకు హాజరైన గిరిజన ప్రజలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిరీక్షించి వెనుదిరిగిన జనం
ప్రజాగళం సభకు చంద్రబాబు వస్తుండడంతో టీడీపీ శ్రేణులు జనసమీకరణ చేసినా ఉదయం 11 గంటలకు రావాల్సిన చంద్రబాబు మధ్యాహ్నం 1.30 వరకు రాకపోవడంతో మండుటెండలో నిరీక్షించి విసిగివేశారిన ప్రజలు వెనుదిరిగారు. వారిని ఆపేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment