క్లీన్‌ స్వీప్‌పై పార్టీ శ్రేణుల గురి | Sakshi
Sakshi News home page

క్లీన్‌ స్వీప్‌పై పార్టీ శ్రేణుల గురి

Published Thu, Apr 18 2024 10:05 AM

-

సాక్షిప్రతినిధి, కాకినాడ: నాడు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేసిన వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ‘తూర్పు’న ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనున్నారు. ఇందుకోసం మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజు గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు తెరలేచిన తరువాత తొలిసారి వస్తోన్న జగన్‌మోహన్‌రెడ్డికి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు మేమతా సిద్ధమంటూ సన్నద్ధమవుతున్నాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర వచ్చే మార్గంలో ప్రజలు అఖండ స్వాగతం పలికేందుకు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తణుకు శివారున తేతలి రాత్రి బస నుంచి బయలుదేరతారు. అక్కడి నుంచి ఈతకోట, రావులపాలెం, జొన్నాడ జంక్షన్‌ మీదుగా పొట్టిలంక చేరుకుంటారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం కడియపులంక, మేమగిరి, మోరంపూడి జంక్షన్‌, తాడితోట జంక్షన్‌, చర్చి సెంటర్‌, దేవీచౌక్‌, పేపరుమిల్లు సెంటర్‌, దివాన్‌చెరువు, రాజానగరం మీదుగా ఎస్‌టీ రాజాపురంలో రాత్రి బస చేసే శిబిరానికి చేరుకుంటారు.

ఆసక్తిగా అభిమానుల ఎదురుచూపులు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏర్పాట్లను ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ జిల్లా నేతలు నాలుగైదు రోజులుగా పరిశీలిస్తున్నారు. తొలిరోజు జగన్‌మోహన్‌రెడ్డి బస్సుయాత్ర తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌, రాజమహేంద్రవరం సిటీ, రాజానగరం, అనపర్తి ఆరు నియోజకవర్గాల్లో సాగనుంది. ఈ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సుమారు 85 కిలోమీటర్లు మేర రోడ్‌షోగా సాగేలా షెడ్యూల్‌ రూపొందించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగే ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కోసం ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బస్సు యాత్ర సాగే దారిపొడవునా ముఖ్యమంత్రి జగన్‌కు నీరాజనాలు పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. బస్సు యాత్ర విజయవాడ వచ్చిన సందర్భంలో సింగ్‌నగర్‌లో జగన్‌మోహన్‌రెడ్డిపై పదునైన వస్తువుతో దుండగుడు దాడి చేయడంతో గాయపడిన అనంతరం జిల్లాకు వస్తుండటంతో అన్ని వర్గాలు జగన్‌ను కలవాలి, తమ అభిమాన నాయకుడిని పలకరించాలి అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో ప్రవేశించే సరికి కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతించి తమ అభిమానాన్ని చాటుకోవాలని కోనసీమ వాసులు సన్నాహాలు చేసుకుంటున్నారు. కోనసీమలోని ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు రావులపాలెం సెంటర్‌కు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడి నుంచి జాతీయ రహదారి గుండా రాజమహేంద్రవరం రూరల్‌, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర వెంట జనం వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాలను వైఎస్సార్‌ సీపీ కై వసం చేసుకుంది. 19 అసెంబ్లీ స్థానాల్లో నాలుగు మినహా అన్ని స్థానాల్లోను వైఎస్సార్‌ సీపీ పాగా వేసింది. 2022 ఏప్రిల్‌లో జిల్లాల పునర్విభజన జరిగాక తూర్పుగోదావరి జిల్లా మూడు జిల్లాలైంది. తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 21 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో మూడు జిల్లాల్లో 21 స్థానాలకు 21 సెగ్మెంట్‌లలో క్లీన్‌ స్వీప్‌ చేయాలనే సంకల్పంతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. నాడు పాదయాత్రలో ప్రజల కష్టాలు కళ్లారా చూసి చలించిన ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ నూటికి నూరుశాతం అమలు చేశారు. అందుకే మీ ఇంటిలో మంచి జరిగి ఉంటేనే ఓటేయండని ముఖ్యమంత్రి జగన్‌ ధైర్యంగా అడుగుతున్న తీరు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపుతుందని నేతలు అభిలషిస్తున్నారు.

Advertisement
Advertisement