అరటి పండు, పాలు కలిపితే అద్భుతం.. కానీ వీళ్లు జాగ్రత్త..! | Sakshi
Sakshi News home page

అరటి పండు, పాలు కలిపితే అద్భుతం.. కానీ వీళ్లు జాగ్రత్త..!

Published Fri, Apr 5 2024 5:44 PM

Check these Benefits side effects Of Banana Milk shake - Sakshi

అరటి పండు మంచి బలవర్ధకమైన ఆహారం. ముఖ్యంగా ఎదిగే ప్లిలలకు, తొందరగా శక్తిని పుంజుకోవడానికి  ఇది బాగా పనిచేస్తుంది. పాలుపౌష్టికాహారం. మరి   అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈరెండూ కలిపి తీసుకోవడం వల్ల ఏమైనా నష్టాలున్నాయా అన్నది కూడా ప్రశ్న.  ఈ మిల్క్‌ షేక్‌నుఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోకూడదు.. ఒకసారి చూద్దాం. 

వేసవి కాలం వచ్చిందంటే..పిల్లలకు ఆటవిడుపు. పరీక్షలు అయిపోయిన తరువాత ఇంట్లోనే  ఉంటారు. ఏదో ఒకటి వెరైటీగా చేసిపెట్టమని అడుగుతూ ఉంటారు. సాయంత్రం అయితే చాలు  ‘‘ఠండా..ఠండాగా కావాలి’’  అంటూ ప్రాణం తీస్తారు.  ఈ క్రమంలో  సులభంగా చేసుకోగలిగేది బనానా మిల్క్‌ షేక్‌ లేదా బనానా మిల్క్‌ స్మూతీ. రెండు  బాగా పండిన అరటిపండ్లు, కప్పు పాలు వేసి మిక్సీలో వేసి,  జ్యూస్‌ చేయాలి.  దీనికి  ఓ రెండు ఐస్‌ముక్కలు, కాస్తంత హార్లిక్స్‌.. డ్రైఫ్రూట్స్‌ అంటే ఇష్టం ఉన్నవాళ్లకి పైన బాదం జీడిపప్పు అలంకరించి ఇస్తే సరిపోతుంది. ఇష్టంగా తాగుతారు. మంచిపౌష్టికాహారం అందుతుంది.

అరటిపండు, పాలతో కలిపిన జ్యూస్‌ పొటాషియం, డైటరీ ఫైబర్, కాల్షియం, ప్రోటీన్లతో  నిండి ఉంటుంది. మిల్క్ ప్రొటీన్ కంటెంట్ పుష్కలంగా ఉన్నందున, ఎముకల ఆరోగ్యానికి చాలామంచిది. ఒక సాధారణ సైజు అరటిపండు 105 కేలరీలను అందిస్తుంది . అలాగు ఒక కప్పు  పాల ద్వారా  150 కేలరీలు లభిస్తాయి. అంటే దాదాపు ఒక రోజుకు ఒక మనిషికి ఇవి  సరిపోతాయి.  బరువు పెరగాలనుకునేవారికి చాలా మంచిది.

పాలలో బరువు పెరగడానికి అవసరమైన ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు కండరాలు, ఎముకలను బలిష్టం చేస్తాయి. అరటిపండు , మిల్క్ డైట్‌తో బరువు పెరగాలనుకుంటే,  బనానా మిల్క్‌ స్మూతీకి ప్రోటీన్-రిచ్ ఐటమ్‌లను యాడ్‌ చేసుకోవచ్చు. అంటే ఫ్లాక్స్ సీడ్స్, నట్స్, ప్రొటీన్ పౌడర్లు, చియా సీడ్స్ ఉన్నాయి.  ఇంకా కోకో పౌడర్ లేదా చాక్లెట్ సిరప్ కూడా కలుపుకోవచ్చు. అలాగే బరువుతగ్గాలనకునేవారికి ఇది మంచిటిప్‌.  పొట్టనిండినట్టుగా ఉండి తొందరగా ఆకలి వేయదు. 

అయితే ఆయుర్వేద ఆహార సూత్రాల  ప్రకారం పాల, అరటిపండ్లు కలపితే  విరుద్ధమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. పాలు, అరటిపండ్లు కలిపి తినడం ఆస్తమా రోగులకు అస్సలు మంచిది కాదని చెబుతోంది. ఎందుకంటే రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శ్లేష్మం, దగ్గు, ఆస్తమా సమస్యలు తీవ్రమవుతాయి.

ఎవరు దూరంగా ఉండాలి?
అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తినకుండా ఉండటమే మంచిది. అలర్జీ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లు, పాలకు కూడా దూరంగా ఉండాలి. 
సైనసైటిస్‌తో బాధపడేవారు  పాలు లేదా అరటిపండ్లు కలిపి తీసుకుంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. శరీరంలో టాక్సిన్ ఉత్పత్తిని పెంచుతుందని ఆయుర్వేదం  చెబుతోంది.
పాలు, అరటిపండ్లు కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రాకుండా ఉండేందుకు రోజువారీ  ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. సమస్య ఉన్నవాళ్లు అరటిపళ్లు,పాలను విడివిడిగా తీసుకోవచ్చు.  

Advertisement
Advertisement