'దీపెన్‌' దారి దీపం.. | Sakshi
Sakshi News home page

'దీపెన్‌' దారి దీపం..

Published Fri, Jan 19 2024 1:33 PM

Deepen As A Successful Entrepreneur - Sakshi

'సమస్య గురించి నిట్టూర్చేవారు కొందరు. సమస్యకు పరిష్కారం వెదకాలని ప్రయత్నించేవారు కొందరు. దీపెన్‌ బబారియా రెండో కోవకు చెందిన వ్యక్తి. కాలేజీ రోజుల్లో ఎదురైన సమస్య  స్టార్టప్‌ ఐడియాకు ఊపిరి పోసింది. ఇనోవేటర్‌గా, ‘రోడ్‌మాట్రిక్స్‌’ రూపంలో సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌గా దీపెన్‌ను మార్చింది..'

దీపెన్‌ బబారియా అతని ఫ్రెండ్‌ ఒకరోజు రాత్రి పనిపై బైక్‌పై ఎక్కడికో వెళుతున్నారు. లొకేషన్‌ తెలియక నావిగేషన్‌ కోసం గూగుల్‌ మ్యాప్స్‌ను ఓపెన్‌ చేశారు. ‘ఫాస్టెస్ట్‌ రూట్‌’ అని చూపించింది. తీరా చూస్తే అది గుంతలతో కూడిన రోడ్డు. మరోవైపు స్ట్రీటు లైట్లు లేకపోవడంతో బైక్‌ ముందుకు వెళ్లడానికి ఇబ్బంది ఎదురైంది. ‘దూరం, వేగాన్ని లెక్కలోకి తీసుకొని ఈ మ్యాప్స్‌ షార్టెస్ట్‌ రూట్‌ను గుర్తిస్తాయి తప్ప అధ్వానంగా ఉన్న రోడ్లను మాత్రం గుర్తించవు’ అంటున్న దీపెన్‌ ఈ సమస్యకు ఏఐ ద్వారా పరిష్కారం చూపాలని కాలేజిరోజులలో గట్టిగా అనుకున్నాడు.

సూరత్‌(గుజరాత్‌)కు చెందిన దీపెన్‌ ఏఐ స్పెషలైజేషన్‌తో ఇంజనీరింగ్‌ చదువుకుంటున్న రోజుల్లో రోడ్ల స్థితిగతులను తెలిజేసే అప్లికేషన్‌ను మొబైల్‌ ఫోన్‌ల కోసం రూపొందించానుకున్నాడు. ఈ ఆలోచన క్రమంగా పెరిగి పెద్దదై స్టార్టప్‌ రూపం తీసుకుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనే కలతో స్టార్టప్‌ల కేంద్రం అయిన బెంగళూరులో అడుగు పెట్టాడు దీపెన్‌. అక్కడ దీపెన్‌ ఐడియాపై నిఖిల్‌ ప్రసాద్‌ ఆసక్తి చూపించాడు. యూఎస్‌లో ఆటోమోటివ్‌ కారు కంపెనీలలో పని చేసిన నిఖిల్‌ ఇండియాకు తిరిగి వచ్చాడు. స్టార్టప్‌ కో–ఫౌండర్‌లలో నిఖిల్‌ ఒకరు.

తక్కువ సమయంలోనే ఈ స్టార్టప్‌పై ఇన్వెస్టర్‌లు ఆసక్తి ప్రదర్శించారు. 100ఎక్స్‌.వీసి ఫస్ట్‌ ఫండింగ్‌ చేసింది. రోడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్లానును అందించే ఏఐ–బేస్డ్‌ స్టార్టప్‌ ‘రోడ్‌మెట్రిక్స్‌’ బెంగళూరు కేంద్రంగా ్రపారంభమైంది. ‘కాలేజీరోజుల్లో ఎన్నో ప్రాజెక్ట్‌ల్లో పనిచేసిన నాకు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా అనిపించింది. రోడ్డు సేఫ్టీ అనేది ముఖ్యమైన అంశం. అయితే రోడ్డు హెల్త్‌ను తెలియజేసే సాఫ్ట్‌వేర్‌లు మన దగ్గర లేవు. ఈ లోటును పూరించేలా రోడ్‌మెట్రిక్స్‌ను తీసుకువచ్చాం’ అంటాడు దీపెన్‌.

మొబైల్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని మొదట్లో అనుకున్న ఐడియాపై వర్క్‌ చేశాడు దీపెన్‌. మొబైల్‌ అప్లికేషన్‌గా పనిచేసే సెన్సర్‌ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం బాగున్నప్పటికీ వైబ్రేషన్స్‌ను క్యాప్చర్‌ చేయడానికి రోడ్డు ప్రతి భాగంలో డ్రైవ్‌ చేయాల్సి ఉంటుంది. ఇదొక సమస్య. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర కో–ఫౌండర్‌లతో కలిసి దీపెన్‌ మరింత రిసెర్చ్‌ చేసి ఇమేజ్‌ బేస్డ్, కంప్యూటర్‌ విజన్‌ బేస్డ్‌ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్‌ చేశాడు. వీరు రూపొందించిన ఏఐ అల్గారిథమ్‌ పది రకాల రోడ్‌ డిఫెక్ట్స్‌ను గుర్తిస్తుంది. ఫాస్టెస్ట్, మోస్ట్‌ కంఫర్టబుల్, ట్రాఫిక్‌లెస్‌ రోడ్లను గుర్తించడానికి వినియోగదారులకు ఉపకరించే రోడ్‌మెట్రిక్స్‌ మ్యాప్స్‌ను కూడా అభివృద్ధి చేశారు. మొదట బెంగళూరు, ముంబై రోడ్లను మ్యాపింగ్‌ చేసిన తరువాత అస్సాం, బిహార్‌లలో కూడా పనిచేశారు.

‘మా సాఫ్ట్‌వేర్‌ అంచనా వేసిన డ్యామేజ్‌ రిపోర్ట్‌ల ఆధారంగా మున్సిపాలిటీలు, ప్రైవేటు సంస్థలు నిధుల కేటాయింపు గురించి సరిౖయెన నిర్ణయం తీసుకోవచ్చు’ అంటున్న దీపెన్‌ రోడ్డు సమస్యలను గుర్తించడంలో జంషెడ్‌పూర్‌లోని టాటాగ్రూప్‌నకు సహాయం అందించాడు. టాటా గ్రూప్, మహీంద్రా గ్రూప్‌తో కలిసి పనిచేస్తున్న ‘రోడ్‌మెట్రిక్స్‌’ ప్రభుత్వ మున్సిపాలిటీలతో పనిచేయడానికి చర్చలు జరుపుతోంది. మన దేశంలో వేలాది కిలోమీటర్‌లు కవర్‌ చేసిన కంపెనీ ఇక్కడితో ఆగిపోలేదు. ‘సిటీ ఆఫ్‌ లండన్‌’ మ్యాపింగ్‌ కూడా స్టార్ట్‌ చేసింది. అక్కడ కూడా స్టార్టప్‌కు క్లయింట్స్‌ ఉన్నారు.

‘మన రహదారులను సాధ్యమైనంత సురక్షితంగా మార్చాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలనుకుంటున్నాం’ అంటున్నాడు దీపెన్‌ బబారియ. ‘రోడ్‌ మెట్రిక్స్‌’ స్టార్టప్‌ మొబిలిటీ ఏఐ గ్రాండ్‌ ఛాలెంజ్, బెస్ట్‌ ఏఐ స్టార్టప్‌ అవార్డ్‌తో సహా ఎన్నో అవార్డ్‌లను సొంతం చేసుకుంది.

ఇవి చదవండి: వీధి కుక్క దాడిలో చేతిని కోల్పోయిన మహిళ..ట్విస్ట్‌ ఏంటంటే..?

Advertisement
Advertisement