నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అంటారు పెద్దలు. నోరు చేసే పనులు రెండు ఉన్నా, ఎక్కువగా మాట్లాడటం అనే అర్థంలోనే ప్రయోగిస్తూ ఉంటారు. మంచిది అంటే బాగా అందంగా ఉంది అని కాదు అర్థం. మాట మంచిదై ఉండాలి అని అర్థం. అప్పుడు ఊరు అంటే చుట్టుపక్కలవారు కూడా ఆ వ్యక్తితో మంచిగా ఉంటారు. ఆత్మీయంగా ప్రవర్తిస్తారు. అవసరానికి ఆదుకుంటారు.
మంచి మాటలే ఎందుకు?
ఒక మాట ఉచ్చరించటానికి కొన్ని ధ్వనులు చేయవలసి ఉంటుంది. ధ్వని తరంగాల రూపంలో ఉంటుంది. ధ్వని తరంగాలకి వాతావరణాన్ని, తద్వారా మనస్సుని ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. మంచి మాటలని ఉచ్ఛరించేప్పుడు వెలువడే ధ్వని తరంగాలు సానుకూల ప్రకంపనలని కలిగించి, వాతావరణాన్ని అనుకూలంగా ఉండేట్టు చేస్తాయి. అందుకే బాధలో ఉన్న వారికి ఓదార్పు మాటలు పలకగానే కాస్త ఉపశమనం కలిగినట్టు అనిపిస్తుంది.
ఏ భాషలో అయినా అన్నిమాటలూ మంచివే! మంచివి కానివి కూడా ఉంటాయా? సందర్భాన్ని బట్టి, మాట్లాడిన తీరుని బట్టి, ముఖకవళికలని బట్టి మాట మంచిదా? కాదా? అని నిర్ణయించబడుతుంది.
నిజానికి అన్ని సందర్భాలూ అందరికీ అనుకూలంగా ఉండవు. సద్దుకుపోవటానికి కూడా కుదరదు. కోపం పెల్లుబుకుతూ ఉంటుంది. తనకు ఆ విషయం నచ్చలేదు అని నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా చెప్పవచ్చు. కానీ, ఆ చెప్పటంలో కోపాన్ని వ్యక్తపరచే అసభ్యపదాలు వాడకూడదు. తప్పు చేసిన వ్యక్తి గురించి పెద్దగా పదిమందికి తెలియదు. కానీ, నోరు చేసుకున్న వ్యక్తి వాడిన పదజాలం ప్రచారమై మనిషి పైన చులకన భావాన్ని కలిగిస్తుంది. కనుక చెప్పే విషయం ఎట్లాంటిదైనా భాషను స్వరాన్ని కొద్దిగా అదుపులో ఉంచుకోగలిగితే తనను, ఎదుటివారిని జయించినట్టే!
‘‘మీరు చేసిన పని ఏ మాత్రం సరైనది కాదు. మీ వంటి తెలివైన వారు ఇట్లా చేయవచ్చా?’’ అని చెప్పిన దానికి ‘‘నువ్వు చేసిన పని ఛండాలంగా ఉంది. బుద్ధి ఉన్నవాడు ఇట్లా చేస్తాడా?’’ అన్నదానికి ఎంత తేడా ఉంది! దీనిని మనం కోర్టులో చేసే వాదనల్లో
గమనించవచ్చు. ప్రతిపక్ష న్యాయవాది పరమమూర్ఖుడు అని తెలిసినా ‘‘మై లెర్న్‌డ్ ఫ్రండ్’’ అని మాత్రమే సంబోధిస్తారు. కొంతమంది మంచి విషయం చెప్పినా ఏదో తిట్టినట్టో, కొట్టినట్టో ఉంటుంది. ప్రేమగా మాట్లాడినా విసుక్కున్నట్టే ఉంటుంది.
ఎంత గట్టిగా మాట్లాడినా మనసు మంచిదైతే, ఉద్దేశం సవ్యమైనదయితే, చెడ్డమాట కాకపోతే తోటివారికి సహాయం చేసే స్వభావం కూడా ఉంటే మంచివారుగానే పరిగణించబడతారు వారిని గురించి తెలిసినవారి చేత.‘‘గొంతు పెద్దది గాని మనసు వెన్న’’ అంటారు.
కొంతమంది ఊతపదంగా అసభ్యపదాలు వాడేస్తూ ఉంటారు. వినటానికి ఇబ్బందిగా ఉంటుంది. వాతావరణాన్ని ప్రతికూలంగా చేస్తాయి. మరికొంత మంది నోటి నుండి పొరపాటున కూడా ఒక్క మంచిమాట రాదు. ఎంతసేపు ప్రతికూలంగానే మాట్లాడుతూ ఉంటారు.. మనస్సులో దురుద్దేశం ఉండవచ్చు ఉండక పోవచ్చు. అదీ చికాకే.
కొంతమంది మాట్లాడుతున్నప్పుడు, వెళ్ళిన తరువాత కూడా ఏదో అశాంతిగా అనిపిస్తుంది. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు చూడటానికి వెళ్ళి, ఆ వ్యాధి ఎంత భయంకరమైనదో, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నదో ఏకరవు పెట్టి ఆ ఇంటివారందరి మనస్సులలో దిగులు నింపుతారు. మరికొందరు ఆ వ్యాధి నుండి బయట పడిన వారి వివరాలు చెప్పి మనస్సులలో ఆశలని చిగురింప చేస్తారు.
విషయమేదైనా మంచిగా, వింటున్నవారికి సంతోషం కలిగేట్టు మాట్లాడితే వచ్చే నష్టమేముంటుంది? ముఖ్య గమనిక: అది అసత్యం కాకూడదు. – డా. ఎన్. అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment