
దీపావళి నాడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున భక్తులు మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ఘనంగా పూజలు నిర్వహిస్తుంటారు. మన దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రముఖ మహాలక్ష్మీదేవి ఆలయాలున్నాయి. వాటిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గోల్డెన్ టెంపుల్ (తమిళనాడు)
తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని మహాలక్ష్మి ఆలయాన్ని దక్షిణ భారతదేశంలోని ‘గోల్డెన్ టెంపుల్’ అని పిలుస్తారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా పేరొందింది. 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయం చెన్నైకి 145 కిలోమీటర్ల దూరంలో పాలార్ నది ఒడ్డున ఉంది. ప్రతి సంవత్సరం దీపావళి నాడు వేలాది మంది భక్తులు ఈ ఆలయంలో అమ్మవారి దర్శనానికి తరలివస్తుంటారు.
మహాలక్ష్మి ఆలయం (ముంబై)
ఈ ఆలయం మహారాష్ట్రలోని ముంబైలో గల బి. దేశాయ్ మార్గ్‌లో ఉంది. ముంబై మహాలక్ష్మి దేవాలయంగా ఈ ఆలయం పేరొందింది. బ్రిటీష్ కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఛత్రపతి శివాజీకి కలలో లక్ష్మీదేవి కనిపించి, ఈ ఆలయాన్ని నిర్మింపజేసిందని చెబుతారు. ఈ మహాలక్ష్మి ఆలయ గర్భగుడిలో మహాలక్ష్మి, మహాకాళి మహాసరస్వతి విగ్రహాలు కనిపిస్తాయి.
మహాలక్ష్మి ఆలయం (కొల్హాపూర్)
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో గల మహాలక్ష్మి ఆలయానికి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో చాళుక్య పాలకుడు కర్ణదేవుడు నిర్మించాడు. షిల్హర్ యాదవ్ దీనిని తొమ్మదవ శతాబ్దంలో ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఆలయ ప్రధాన గర్భగుడిలో నాలుగు అడుగుల ఎత్తయిన మహాలక్ష్మి దేవి విగ్రహం దర్శనమిస్తుంది. ఇది దాదాపు 40 కిలోల బరువు ఉంటుంది. ఈ లక్ష్మీదేవి విగ్రహం సుమారు 7 వేల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు.
లక్ష్మీనారాయణ దేవాలయం (ఢిల్లీ)
ఢిల్లీలోని ప్రధాన దేవాలయాలలో లక్ష్మీనారాయణ దేవాలయం ఒకటి. ఈ ఆలయాన్ని 1622లో వీర్‌సింగ్ దేవ్ నిర్మించాడు. 1793లో పృథ్వీ సింగ్ ఆలయాన్ని పునరుద్ధరించాడు. అనంతరం బిర్లా కుటుంబం ఈ ఆలయాన్ని 1938లో విస్తరించి, పునరుద్ధరించింది. అందుకే ఈ ఆలయాన్ని బిర్లా టెంపుల్ అని పిలుస్తారు.
మహాలక్ష్మి ఆలయం (ఇండోర్)
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గల మహాలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ఇండోర్ నడిబొడ్డున ఉన్న రాజ్‌వాడలో నిర్మించారు. ఈ ఆలయాన్ని 1832లో మల్హర్‌రావు (II) నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయంలో మూడు అంతస్తులు ఉన్నాయి. అయితే 1933లో అగ్నిప్రమాదం కారణంగా ఆలయం ధ్వంసమైంది. 1942లో ఈ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించారు. దేశంలోని నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు తరలివస్తుంటారు.
అష్టలక్ష్మి దేవాలయం (చెన్నై)
తమిళానడులోని చెన్నైలోని ఇలియట్ బీచ్ సమీపంలో అష్టలక్ష్మి ఆలయం ఉంది. ఈ ఆలయం నాలుగు అంతస్తులలో నిర్మితమయ్యింది. లక్ష్మీదేవి ఎనిమిది రూపాల విగ్రహాలను ఈ ఆలయంలో సందర్శించవచ్చు. ఆలయంలోని రెండవ అంతస్తులో లక్ష్మీ దేవి, విష్ణువు విగ్రహాలు ప్రతిష్ఠితమయ్యాయి.
ఇది కూడా చదవండి: దీపావళికి ముందే గ్యాస్ ఛాంబర్‌లా రాజధాని
Comments
Please login to add a commentAdd a comment