Good word
-
మంచి మాట: నోరు మంచిదైతే...
నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అంటారు పెద్దలు. నోరు చేసే పనులు రెండు ఉన్నా, ఎక్కువగా మాట్లాడటం అనే అర్థంలోనే ప్రయోగిస్తూ ఉంటారు. మంచిది అంటే బాగా అందంగా ఉంది అని కాదు అర్థం. మాట మంచిదై ఉండాలి అని అర్థం. అప్పుడు ఊరు అంటే చుట్టుపక్కలవారు కూడా ఆ వ్యక్తితో మంచిగా ఉంటారు. ఆత్మీయంగా ప్రవర్తిస్తారు. అవసరానికి ఆదుకుంటారు.మంచి మాటలే ఎందుకు?ఒక మాట ఉచ్చరించటానికి కొన్ని ధ్వనులు చేయవలసి ఉంటుంది. ధ్వని తరంగాల రూపంలో ఉంటుంది. ధ్వని తరంగాలకి వాతావరణాన్ని, తద్వారా మనస్సుని ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. మంచి మాటలని ఉచ్ఛరించేప్పుడు వెలువడే ధ్వని తరంగాలు సానుకూల ప్రకంపనలని కలిగించి, వాతావరణాన్ని అనుకూలంగా ఉండేట్టు చేస్తాయి. అందుకే బాధలో ఉన్న వారికి ఓదార్పు మాటలు పలకగానే కాస్త ఉపశమనం కలిగినట్టు అనిపిస్తుంది.ఏ భాషలో అయినా అన్నిమాటలూ మంచివే! మంచివి కానివి కూడా ఉంటాయా? సందర్భాన్ని బట్టి, మాట్లాడిన తీరుని బట్టి, ముఖకవళికలని బట్టి మాట మంచిదా? కాదా? అని నిర్ణయించబడుతుంది. నిజానికి అన్ని సందర్భాలూ అందరికీ అనుకూలంగా ఉండవు. సద్దుకుపోవటానికి కూడా కుదరదు. కోపం పెల్లుబుకుతూ ఉంటుంది. తనకు ఆ విషయం నచ్చలేదు అని నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా చెప్పవచ్చు. కానీ, ఆ చెప్పటంలో కోపాన్ని వ్యక్తపరచే అసభ్యపదాలు వాడకూడదు. తప్పు చేసిన వ్యక్తి గురించి పెద్దగా పదిమందికి తెలియదు. కానీ, నోరు చేసుకున్న వ్యక్తి వాడిన పదజాలం ప్రచారమై మనిషి పైన చులకన భావాన్ని కలిగిస్తుంది. కనుక చెప్పే విషయం ఎట్లాంటిదైనా భాషను స్వరాన్ని కొద్దిగా అదుపులో ఉంచుకోగలిగితే తనను, ఎదుటివారిని జయించినట్టే! ‘‘మీరు చేసిన పని ఏ మాత్రం సరైనది కాదు. మీ వంటి తెలివైన వారు ఇట్లా చేయవచ్చా?’’ అని చెప్పిన దానికి ‘‘నువ్వు చేసిన పని ఛండాలంగా ఉంది. బుద్ధి ఉన్నవాడు ఇట్లా చేస్తాడా?’’ అన్నదానికి ఎంత తేడా ఉంది! దీనిని మనం కోర్టులో చేసే వాదనల్లోగమనించవచ్చు. ప్రతిపక్ష న్యాయవాది పరమమూర్ఖుడు అని తెలిసినా ‘‘మై లెర్న్డ్ ఫ్రండ్’’ అని మాత్రమే సంబోధిస్తారు. కొంతమంది మంచి విషయం చెప్పినా ఏదో తిట్టినట్టో, కొట్టినట్టో ఉంటుంది. ప్రేమగా మాట్లాడినా విసుక్కున్నట్టే ఉంటుంది. ఎంత గట్టిగా మాట్లాడినా మనసు మంచిదైతే, ఉద్దేశం సవ్యమైనదయితే, చెడ్డమాట కాకపోతే తోటివారికి సహాయం చేసే స్వభావం కూడా ఉంటే మంచివారుగానే పరిగణించబడతారు వారిని గురించి తెలిసినవారి చేత.‘‘గొంతు పెద్దది గాని మనసు వెన్న’’ అంటారు. కొంతమంది ఊతపదంగా అసభ్యపదాలు వాడేస్తూ ఉంటారు. వినటానికి ఇబ్బందిగా ఉంటుంది. వాతావరణాన్ని ప్రతికూలంగా చేస్తాయి. మరికొంత మంది నోటి నుండి పొరపాటున కూడా ఒక్క మంచిమాట రాదు. ఎంతసేపు ప్రతికూలంగానే మాట్లాడుతూ ఉంటారు.. మనస్సులో దురుద్దేశం ఉండవచ్చు ఉండక పోవచ్చు. అదీ చికాకే. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు, వెళ్ళిన తరువాత కూడా ఏదో అశాంతిగా అనిపిస్తుంది. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు చూడటానికి వెళ్ళి, ఆ వ్యాధి ఎంత భయంకరమైనదో, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నదో ఏకరవు పెట్టి ఆ ఇంటివారందరి మనస్సులలో దిగులు నింపుతారు. మరికొందరు ఆ వ్యాధి నుండి బయట పడిన వారి వివరాలు చెప్పి మనస్సులలో ఆశలని చిగురింప చేస్తారు. విషయమేదైనా మంచిగా, వింటున్నవారికి సంతోషం కలిగేట్టు మాట్లాడితే వచ్చే నష్టమేముంటుంది? ముఖ్య గమనిక: అది అసత్యం కాకూడదు. – డా. ఎన్. అనంతలక్ష్మి -
మాట మంచిదైతే...
మనిషి వికాసానికి ‘మాట’ ఒక అమూల్యమైన వరం. ఇతర ప్రాణులకు లేని గొప్ప వాక్ సంపద మనిషికి స్వంతమైంది. ధనధాన్యాది సంపదలైనా వాడుతూ ఉంటే అవి క్రమంగా తరిగిపోతూ ఉంటాయి. కాని ఈ మాట అనే సంపద తరిగేది కాదు. పైగా మనం తీయగా, ఆకర్షణీయంగా, మనోహరంగా ఉం డే మాటలనే మాట్లాడగలిగితే బండరాయి వంటి కఠిన హృదయాలను కూడా కదిలించవచ్చు, కరిగించవచ్చు. ‘మంచి నోరు’ అంటే మంచి మాటను పలికే నోటినే మంచి నోరంటారని దీని అంతరార్థం. అప్పుడు మనం నివసించే ఊరు వారంతా మన విషయంలో మంచివారవుతారు. మనకు మంచే చేస్తారు. మనలోని మంచినే చూస్తారు. మంచి మాట అంటే కేవలం అందరికీ నచ్చినట్లు మాట్లాడటం అర్థం కాదు. అందులో ఇతరులందరికీ మం చిని కలిగించే మాటలు కూడా ఉండాలి. మంచి మాటలను మాట్లాడే వారితో సహవాసం చేయాలి. ఆ మంచి మాటలను వినాలి, వారికి మంచి మాటలను వినిపించాలి. మంచి మాటలకు లొంగని వారు అంటూ ఉండరు. మొరటుగా, కఠినంగా చెప్పవలసిన విషయాన్ని కూడా సున్నితంగా చెప్పేవారు అధికారుల, రాజుల మన్ననలను అందుకుంటారు. హనుమంతుని మాట మంచిదైనందునే రామసుగ్రీవులకు మైత్రి ఏర్పడింది. రాక్షస పరాజయం, రావణవధ, సీతాపరిగ్రహణం వంటి మహాఘనకార్యాలు నెరవేరాయి. హనుమంతుని మంచి మాటకారితనాన్ని స్వయంగా శ్రీరామచంద్రుడే ప్రశంసిస్తూ - ‘‘బహు వ్యాహరతానేన న కించిదపశబ్దితమ్’’ ‘‘ఉచ్చారయతి కల్యాణీం వాచం హృదయహారిణీమ్’’ ‘‘కస్య నారాధ్యతే చిత్త ముద్యతాసేరరేరపి’’ ఒక్క తప్పు లేకుండా, చెవులకింపుగా, మనోహరంగా, శుభప్రదంగా మాట్లాడుతున్నాడు. చంపుదామని కత్తి పట్టుకొని వచ్చినవ్యక్తి మనసును కూడా హనుమంతుని మాటలు వశపరచుకుంటాయని పేర్కొన్నాడు. అందుకే మన ‘మాట మంచిదైతే’ మనకంతటా మంచే జరుగుతుంది అనే విశ్వాసాన్ని ఏర్పరచుకోవాలి. పూర్వం ప్రతిభావంతులైన దేవదత్తుడు, సిద్ధార్థుడు ఇద్దరు రాజకుమారులలో సిద్ధార్థుని మాట మృదువుగా, దేవదత్తుని మాట కఠినంగా ఉండేదట. ఒకనాడు దేవదత్తుడు, సిద్ధార్థుడు అడవికి వెళ్లారు. దేవదత్తునికి వేట అం టే ఇష్టం. దేవదత్తుడు వేసిన బాణానికి హంస గాయపడి నేలకొరిగింది. సిద్ధార్థుడు ఆ హంసకు గుచ్చుకున్న బాణా న్ని తీసి గాయానికి కట్టుగట్టి సపర్యలు చేయసాగాడు. దేవదత్తుడు సిద్ధార్థుడితో - ‘హంసను వేటాడింది నేను కదా, దానిని నాకిచ్చెయ్’ అని గద్దించాడు. ‘కాదు గాయం మాన్పి, హంసను రక్షించింది నేను కదా, నా దగ్గరే ఈ హంస ఉంటుందని’ సిద్ధార్థుడు బదులిచ్చాడు. ఇద్దరి మధ్య వివా దం పెరిగి న్యాయం కోసం ధర్మాధికారులను ఆశ్రయిం చారు. ధర్మాధికారి ఆ హంసను బల్లపై ఉంచండి, ఎవరి పిలుపునకు ఆ హంస దగ్గరైతే వారికిస్తాను అని చెప్పారు. కఠిన స్వభావి, పరుష భాషియైన దేవదత్తుడు ‘ఓ హంసా! రా, రా, వస్తావా లేదా, రాకపోతే నీ పని చెప్తా, నా బాణం దెబ్బ మరిచావా’ అంటూ పిలిచాడు. మృదుస్వభావియైన సిద్ధార్థుడు - ‘తల్లీ, కల్పవల్లీ, పాలవెల్లీ, రావే’ అంటూ ప్రేమగా ముద్దుగా పిలిచాడు. హంస సిద్ధార్థుని ఒడిలోకి చెంగున వచ్చి చేరింది. వెంటనే సిద్ధార్థునికే ఈ హంస చెందాలి అని ధర్మాధికారి నిర్ధారించారు. మంచి మాటతో ఒక పక్షియే ఆకర్షింపబడింది కదా. అలాగే మాట మంచిదైతే తోటి మానవులందరూ మనకు హితులవుతారు, సన్నిహితులవుతారు అనే వాస్తవాన్ని గుర్తిం చాల్సిన అవసరం ఎంతో ఉంది. సముద్రాల శఠగోపాచార్యులు