మాట మంచిదైతే...
మనిషి వికాసానికి ‘మాట’ ఒక అమూల్యమైన వరం. ఇతర ప్రాణులకు లేని గొప్ప వాక్ సంపద మనిషికి స్వంతమైంది. ధనధాన్యాది సంపదలైనా వాడుతూ ఉంటే అవి క్రమంగా తరిగిపోతూ ఉంటాయి. కాని ఈ మాట అనే సంపద తరిగేది కాదు. పైగా మనం తీయగా, ఆకర్షణీయంగా, మనోహరంగా ఉం డే మాటలనే మాట్లాడగలిగితే బండరాయి వంటి కఠిన హృదయాలను కూడా కదిలించవచ్చు, కరిగించవచ్చు. ‘మంచి నోరు’ అంటే మంచి మాటను పలికే నోటినే మంచి నోరంటారని దీని అంతరార్థం. అప్పుడు మనం నివసించే ఊరు వారంతా మన విషయంలో మంచివారవుతారు. మనకు మంచే చేస్తారు. మనలోని మంచినే చూస్తారు.
మంచి మాట అంటే కేవలం అందరికీ నచ్చినట్లు మాట్లాడటం అర్థం కాదు. అందులో ఇతరులందరికీ మం చిని కలిగించే మాటలు కూడా ఉండాలి. మంచి మాటలను మాట్లాడే వారితో సహవాసం చేయాలి. ఆ మంచి మాటలను వినాలి, వారికి మంచి మాటలను వినిపించాలి. మంచి మాటలకు లొంగని వారు అంటూ ఉండరు. మొరటుగా, కఠినంగా చెప్పవలసిన విషయాన్ని కూడా సున్నితంగా చెప్పేవారు అధికారుల, రాజుల మన్ననలను అందుకుంటారు. హనుమంతుని మాట మంచిదైనందునే రామసుగ్రీవులకు మైత్రి ఏర్పడింది. రాక్షస పరాజయం, రావణవధ, సీతాపరిగ్రహణం వంటి మహాఘనకార్యాలు నెరవేరాయి. హనుమంతుని మంచి మాటకారితనాన్ని స్వయంగా శ్రీరామచంద్రుడే ప్రశంసిస్తూ -
‘‘బహు వ్యాహరతానేన న కించిదపశబ్దితమ్’’
‘‘ఉచ్చారయతి కల్యాణీం వాచం హృదయహారిణీమ్’’
‘‘కస్య నారాధ్యతే చిత్త ముద్యతాసేరరేరపి’’
ఒక్క తప్పు లేకుండా, చెవులకింపుగా, మనోహరంగా, శుభప్రదంగా మాట్లాడుతున్నాడు. చంపుదామని కత్తి పట్టుకొని వచ్చినవ్యక్తి మనసును కూడా హనుమంతుని మాటలు వశపరచుకుంటాయని పేర్కొన్నాడు. అందుకే మన ‘మాట మంచిదైతే’ మనకంతటా మంచే జరుగుతుంది అనే విశ్వాసాన్ని ఏర్పరచుకోవాలి.
పూర్వం ప్రతిభావంతులైన దేవదత్తుడు, సిద్ధార్థుడు ఇద్దరు రాజకుమారులలో సిద్ధార్థుని మాట మృదువుగా, దేవదత్తుని మాట కఠినంగా ఉండేదట. ఒకనాడు దేవదత్తుడు, సిద్ధార్థుడు అడవికి వెళ్లారు. దేవదత్తునికి వేట అం టే ఇష్టం. దేవదత్తుడు వేసిన బాణానికి హంస గాయపడి నేలకొరిగింది. సిద్ధార్థుడు ఆ హంసకు గుచ్చుకున్న బాణా న్ని తీసి గాయానికి కట్టుగట్టి సపర్యలు చేయసాగాడు. దేవదత్తుడు సిద్ధార్థుడితో - ‘హంసను వేటాడింది నేను కదా, దానిని నాకిచ్చెయ్’ అని గద్దించాడు. ‘కాదు గాయం మాన్పి, హంసను రక్షించింది నేను కదా, నా దగ్గరే ఈ హంస ఉంటుందని’ సిద్ధార్థుడు బదులిచ్చాడు. ఇద్దరి మధ్య వివా దం పెరిగి న్యాయం కోసం ధర్మాధికారులను ఆశ్రయిం చారు. ధర్మాధికారి ఆ హంసను బల్లపై ఉంచండి, ఎవరి పిలుపునకు ఆ హంస దగ్గరైతే వారికిస్తాను అని చెప్పారు.
కఠిన స్వభావి, పరుష భాషియైన దేవదత్తుడు ‘ఓ హంసా! రా, రా, వస్తావా లేదా, రాకపోతే నీ పని చెప్తా, నా బాణం దెబ్బ మరిచావా’ అంటూ పిలిచాడు. మృదుస్వభావియైన సిద్ధార్థుడు - ‘తల్లీ, కల్పవల్లీ, పాలవెల్లీ, రావే’ అంటూ ప్రేమగా ముద్దుగా పిలిచాడు. హంస సిద్ధార్థుని ఒడిలోకి చెంగున వచ్చి చేరింది. వెంటనే సిద్ధార్థునికే ఈ హంస చెందాలి అని ధర్మాధికారి నిర్ధారించారు. మంచి మాటతో ఒక పక్షియే ఆకర్షింపబడింది కదా. అలాగే మాట మంచిదైతే తోటి మానవులందరూ మనకు హితులవుతారు, సన్నిహితులవుతారు అనే వాస్తవాన్ని గుర్తిం చాల్సిన అవసరం ఎంతో ఉంది.
సముద్రాల శఠగోపాచార్యులు