ప్రతి నిమిషం.. సినిమా ధ్యాసే.. | lakshmi nimisha gummadi in 78th Cannes Film Festival Competition | Sakshi
Sakshi News home page

ప్రతి నిమిషం.. సినిమా ధ్యాసే..

Published Fri, Nov 8 2024 7:36 AM | Last Updated on Sat, Nov 9 2024 7:36 AM

lakshmi nimisha gummadi in 78th Cannes Film Festival Competition

ప్రొడక్షన్‌ డిజైనర్‌గా లక్ష్మీ నిమిషా సత్తా 

అమెరికాలో తెలుగు ఫీచర్, షార్ట్‌ ఫిల్మ్స్‌తో బిజీ 

మ్యూజిక్‌ వీడియోలతో యువతలో ప్రజాదరణ 

ఇప్పటికే వందలాది అంతర్జాతీయ అవార్డులు సొంతం 

78వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ పోటీలో ‘డాస్‌ బ్రోస్‌ ఫోర్స్‌’

చిత్ర పరిశ్రమలో దర్శకత్వ విభాగంలో సక్సెస్‌ కావాలంటే, అందులోనూ ఓ మహిళ ఆ స్థాయిలో అవ్వాలంటే సామర్థ్యంతో పాటు సృజనాత్మకత తప్పనిసరి. సమకాలీన అంశాలను అర్థవంతంగా తెరకెక్కిస్తేనే ప్రేక్షకాదరణ పొందుతుంది. అలాంటిది హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఎంతో అంకితభావం, చిత్తశుద్ధితో పాటు ధైర్యసాహసాలు కావాలి. ఒకటి కాదు రెండు కాదు వందలాది అంతర్జాతీయ అవార్డ్‌లతో ఔరా అనిపిస్తోంది మన తెలుగమ్మాయి లక్ష్మీ నిమిషా గుమ్మడి. తాజాగా ఆమె ప్రొడక్షన్‌ డిజైనర్‌గా రూపొందించిన ‘డాస్‌ బ్రోస్‌ ఫోర్స్‌’ ఫీచర్‌ ఫిల్మ్‌ అత్యంత ప్రతిష్టాత్మకమైన 78వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పోటీలో నిలిచింది. ఇది చాలదూ.. హాలీవుడ్‌లో లక్ష్మీ సత్తా ఏంటో చెప్పేందుకు!?  

హైదరాబాద్‌లోని సంఘమిత్ర స్కూల్, ఓబుల్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌లో +12 వరకూ చదివిన లక్ష్మీ.. ఆ తర్వాత కర్నాటకలోని మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్, కాలిఫోరి్నయాలోని అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఏఎఫ్‌ఐ)లో ‘ప్రొడక్షన్‌ డిజైన్‌’లో ఎంఎస్‌ పూర్తి చేసింది. సమకాలీన డిజైన్స్‌తో సాంస్కృతిక అంశాలను మిళితం చేసే సామర్థ్యం ఈమె సొంతం.  

తెర వెనక పాత్రల గురించి తెలిసి.. 
చిన్నతనంలో సినిమాలు చూసేటప్పుడు క్యారెక్టర్స్‌లో లీనమై అతిగా భావోద్వేగానికి లోనయ్యేదానినని తరుచూ స్నేహితులు ఆమెను ఆటపట్టించేవారు. చిన్నతనం నుంచే తనపై సినిమాల ప్రభావం ఉండటంతో నటి కావాలని అనుకునేది. ఆ వయసులో తెరవెనక దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు, నిర్మాతల పాత్ర గురించి ఆలోచించే స్థాయిలేదు కానీ, పెద్దయ్యాక సినిమా మేకింగ్‌ గురించి తెలిసిన తర్వాత ఆమె ఆసక్తి నటన నుంచి ప్రొడక్షన్‌ వైపు మళ్లింది.

ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌ ‘తహనన్‌’.. 
అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్న ‘తహనాన్‌’ అనే ఫీచర్‌ ఫిల్మ్‌ లక్ష్మీ రూపొందించిందే. దీనికి లాస్‌ ఏంజిల్స్‌లోని కల్వర్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ చలనచిత్ర అవార్డ్‌ వరించింది. అమెరికాలో మ్యూజిక్‌ వీడియోలు, వాణిజ్య ప్రకటనలు కూడా ఈమె రూపొందిస్తోంది. టేలర్‌ స్విఫ్ట్సŠ, ఫోర్ట్‌నైట్, రెడ్‌ క్రిస్మస్, రోబోట్, ఎలిఫెంట్‌ ఇన్‌ ది డార్క్, స్టక్‌ వంటి ఎన్నో మ్యూజిక్‌ వీడియోలకు లక్ష్మీ పనిచేసింది. అలాగే ఎల్రక్టానిక్‌ ఉపకరణాల సంస్థ డీఈఎక్స్‌ వంటి పలు బహుళ జాతి కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు రూపొందించింది.

తెలుగు చిత్రం రిలీజ్‌.. 
ఈజిప్ట్, ఫ్రాన్స్, పోర్చుగల్, జర్మనీ, ఇస్తాంబుల్, యూకే వంటి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 50 ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో 15 అంతర్జాతీయ 
అవార్డ్‌లు లక్ష్మీ సొంతం. తాజాగా ‘డాస్‌ బ్రోస్‌ ఫోర్స్‌’ చిత్రం వచ్చే ఏడాది మేలో జరగనున్న ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పోటీలో నిలిచింది. అర్జున్‌ ది స్టూడెంట్, మీన్‌ గోల్స్, ది హల్కైన్‌ డేస్, బాడీ చెక్‌ వంటి ఎన్నో ఫీచర్, షార్ట్‌ ఫిల్మŠస్‌ను రూపొందించింది. ఇండియాతో పాటు కెనడా, గ్రీస్, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి దేశాల్లోని ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో అవార్డ్‌లను దక్కించుకుంది. రవికుమార్‌ వాసు దర్శకత్వంలో శివకుమార్‌ రామచంద్ర వరపు కథానాయకుడిగా తెరకెక్కిన తెలుగు చలనచిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement