కేక్ కట్ చేసిన ఇన్‌స్పెక్టర్లు
వేడుకలో పాల్గొన్న మాదాపూర్‌ఎస్‌హెచ్‌ఓ గడ్డం మల్లేష్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
విచారణకు ఆదేశించిన మాదాపూర్ డీసీపీ వినీత్
గచ్చిబౌలి: కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నిలిపినా..సెల్ఫీలు దిగినా, ఫుట్ పాత్‌రెయిలింగ్ , గ్రిల్స్ వద్ద నిలబడి వచ్చి పోయే పాదచారులకు ఆటకంకం కల్గించినా సెక్షన్ 76 హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ వినీత్ ఏప్రిల్ 16న ఆదేశాలు జారీ చేశారు. అయితే డీసీపీ ఆదేశాలు భేఖాతర్ చేస్తూ కేబుల్ బ్రిడ్జిపై మాదాపూర్ ఎస్‌హెచ్‌ఓ గడ్డం మల్లేష్‌తో పాటు మరో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది.
కేక్ కట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిబంధనలు పెట్టిన పోలీసులే ఉల్లంఘించడం ఏమిటని పలువురు ప్రశి్నస్తున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనదారులతో పాటు సందర్శకులకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా... పోలీసులకు వర్తించవా అని సోషల్ మీడియా ప్రశ్నించడం గమనార్హం. బర్త్ డే వేడుకలో మాదాపూర్ ఎస్‌హెచ్‌ఓ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ సమగ్ర విచారణకు ఆదేశించారు.
నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల రాత్రి సమయంలో పటాన్‌చెరు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రవణ్ కేబుల్ బ్రిడ్జి ఫుట్‌పాత్ పై కేక్ కట్ చేయగా , మాదాపూర్ ఎస్‌హెచ్‌ఓ మల్లేష్ ఆయనకు కేక్ తినిపిస్తున్నారు. ఈ ఫొటోలో రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్‌సెక్టర్ సంజయ్, ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు ఒకే బ్యాచ్‌కు చెందిన వారు కావడంతో వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటె సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో ఇప్పటిది కాదని, ఫుట్ పాత్ మీదే ఉన్నామని మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment