ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్‌ | AP CID registers case against Naidu and his son Lokesh | Sakshi
Sakshi News home page

ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్‌

Published Mon, May 6 2024 3:49 AM | Last Updated on Mon, May 6 2024 7:12 AM

AP CID registers case against Naidu and his son Lokesh

దుష్ప్రచార కుట్రదారు చంద్రబాబే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీఐడీ

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై పథకం ప్రకారమే విష ప్రచారం 

ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల లబి్ధకి కుతంత్రం 

ఈసీ ఆదేశాలతో కేసు నమోదు చేసిన సీఐడీ 

నియమావళిని ఉల్లంఘించినట్టు నిర్ధారణ 

టీడీపీ కార్యాలయానికి నోటీసులు జారీ 

నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశం 

చంద్రబాబు, లోకేశ్‌నూ విచారించేందుకు సిద్ధం  

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా దుష్ప్రచారానికి కుట్ర పన్నినట్లు నిర్ధారణ అయింది. భూములకు సంపూర్ణ భద్రత కల్పించే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను వక్రీకరించి అవాస్తవాలు ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలన్న కుతంత్రం వెనుక ప్రధాన కుట్రదారు చంద్రబాబేనని నిగ్గు తేలింది. టీడీపీ దుష్ప్రచారంపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్‌ తక్షణం స్పందించింది.

ఈ అంశంపై తక్షణం తగిన చర్యలు తీసుకుని తమకు నివేదించాలని సీఐడీని ఆదేశించిన విషయం తెలిసిందే. సీఐడీ చేపట్టిన దర్యాప్తులో ఈ కుట్ర గుట్టు వీడింది. చంద్రబాబు, లోకేశ్‌ పన్నాగం ప్రకారమే టీడీపీ, ఆ పార్టీ ఎన్నికల ప్రచార బృందాలు ఈ కుట్రకు తెరతీశాయని సీఐడీ నిర్ధారించింది. దాంతో ఏ 1గా చంద్రబాబు, ఏ 2గా లోకేశ్, ఏ 3గా టీడీపీ, ఆ పార్టీ ఎలక్ట్రానిక్‌ క్యాంపెయిన్‌ టీమ్‌లతోపాటు పలువురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 171(ఎఫ్‌),(జి), 188, 505(2) రెడ్‌విత్‌ 120 (బి) కింద అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. 

కుట్రదారు చంద్రబాబే..
అవాస్తవాలు, అభూత కల్పనలతో ప్రచారం చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధం. భయభ్రాంతులకు గురి చేయడం, ప్రలోభాలకు గురి చేయడం, సమాజంలో విద్వేషాలను రేకెత్తించేలా ప్రచారం చేయకూడదని ఎన్నికల నియమావళి స్పష్టంగా చెబుతోంది. భూ హక్కు చట్టం (ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌)పై పక్కా పన్నాగంతో చంద్రబాబు దుష్ప్రచార కుట్రకు తెర తీశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు పన్నిన కుట్రలన్నీ బెడిసి కొట్టడంతో ఆయనకు దిక్కు తోచడం లేదు.

సచివాలయ వ్యవస్థ, వలంటీర్లు, వృద్ధాప్య పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలపై టీడీపీ చేసిన దుష్ప్రచారం బెడిసికొట్టింది. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని ప్రజలు గుర్తించారు. దీంతో బెంబేలెత్తిన చంద్రబాబు కొత్త కుట్రకు తెరతీశారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై అపోహలు వ్యాప్తి చేయాలని పథకం వేశారు. లోకేశ్, టీడీపీ ఎలక్ట్రానిక్‌ ప్రచార విభాగంతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, సాంకేతిక నిపుణులు ఇందులో భాగస్వాములు అయ్యారు.

ఈ చట్టం ద్వారా ప్రజల భూములను గుంజుకుంటారని, కబ్జా చేసేస్తారని, పత్రాలు మాయం చేస్తారని, ఇళ్ల నుంచి వెళ్లగొడతారని ప్రజలను బెదిరింపులకు గురి చేసేలా ఈ ముఠా దుష్ప్రచారానికి తెగించింది. ఏకంగా ఓటర్లకు ఫోన్లు చేసి మరీ భయాందోళనలకు గురి చేస్తోంది. మంగళగిరితోపాటు హైదరాబాద్, బెంగళూరు, ఇండోర్, చండీఘడ్‌ తదితర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోని ఓటర్లకు ఫోన్లు చేస్తూ హడలెత్తించేందుకు యత్నించారు. టీడీపీకి వంతపాడే ఈనాడు, ఈటీవీ, ఎల్లో మీడియా పత్రికలు, చానళ్లతోపాటు టీడీపీ సోషల్‌ మీడియా విభాగం పక్కా పన్నాగంతో ఈ దుష్ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి. 

ఈసీ ఆదేశాలతో..
ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారంపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖే­శ్‌ కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేసింది. ఐవీఆర్‌ కాల్‌ రికార్డింగులతోపాటు ఇతర ఆధారాలను అందచేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎన్నికల సంఘం ఈ అంశంపై దర్యాప్తు చేసి నివేదిక సమ­ర్పించాలని సీఐడీని ఆదేశించింది. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్, ఇతర ఆధారాలను పరిశీలించి విశ్లేషించిన సీఐడీ దర్యాప్తు అధికారులు ఈ కుట్ర వెనుక చంద్రబాబు, లోకేశ్, టీడీపీ ఎలక్ట్రానిక్‌ ప్రచార విభాగం కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలతో నిగ్గు తేల్చారు.

టీడీపీ కార్యాలయానికి నోటీసులు
ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై దుష్ప్రచారం వెనుక చంద్రబాబు, లోకేశ్‌ తదితర కుట్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేసి విచారించేందుకు సిద్ధమైంది. ఈమేరకు సీఐడీ బృందం ఆదివారం నోటీసులు అందించేందుకు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లగా ఆ సమయంలో ఎవరూ అందుబాటులో లేరు. పార్టీ ప్రధాన కార్యాలయం వ్యవహారాలు పర్య­వేక్షిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుతో సీఐడీ అధికారులు ఫోన్‌లో మాట్లాడి కార్యాలయ సిబ్బందికి నోటీసులు అందించారు.

టీడీపీ ఎలక్ట్రానిక్‌ ప్రచార విభాగం ప్రతినిధులు సోమవారం సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్‌తోపాటు ఇతర టీడీపీ నేతలను కూడా విచారించాలని సీఐడీ నిర్ణయించింది. ఎన్నికల కమిషన్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈ కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

నేరపూరిత కుట్రే.. నియమావళికి విరుద్ధం
కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు 
ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై టీడీపీ సాగిస్తున్న దుష్ప్రచారం ఎన్నికల నియమావళి ఉల్లంఘనే కాకుండా నేరపూరిత కుట్రగా సీఐడీ నిర్ధారించింది. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి అక్ర­మంగా ఎన్నికల లబ్ధికి యత్నించడంతోపాటు స­మా­జంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు టీడీపీ కుతంత్రం పన్నినట్టు నిగ్గు తేల్చింది. ఐపీసీ సెక్షన్లు 171(ఎఫ్‌),(జి), 188, 505(2) రెడ్‌విత్‌ 120(బి) కింద అభియోగాలు నమోదు చేసింది. 
171(ఎఫ్‌)(జి): ఎన్నికల్లో అసత్య ప్రచారం, అభ్యంతకరమైన రీతిలో ప్రచా­రం  ద్వారా ఎన్నికల ఫలి­తా­లను ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నడం.
 

188: ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను ఉద్దేశపూ­ర్వకంగా ఉల్లంఘించడం. చట్టాన్ని ఉల్లంఘించి ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు కుట్ర పన్నడం
505(2): అసత్య ప్రచారం ద్వారా సమాజంలో వర్గ విభేదాలు రెచ్చగొట్టడం, సామరస్య వాతావరణానికి విఘాతం కల్పించడం, పరస్పర శతృత్వాన్ని ప్రేరేపించడం.
120(బి): కుట్రపూరితంగా వ్యవహరించడం, నేరానికి పాల్పడటం.

టీడీపీ ఫిర్యాదుపై నివేదిక ఇవ్వండి
తమ పార్టీపై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం మర్నాడే స్పందించింది. ఐవీఆర్‌ కాల్స్‌ ద్వారా వైఎస్సార్‌సీపీ తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శనివారం ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలన జరిపి ఎన్నికల నియమా­వళి మేరకు తగిన చర్యలు తీసుకొని నివేదిక ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.

స్వయంగా లోకేశ్‌ దుష్ప్రచారం 
ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచార కుట్రను నారా లోకేశ్‌ స్వయంగా అమ­లు చేయడం గమనార్హం. చట్టం గురించి అవాస్తవాలు, అభూత కల్పనలతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా లోకేశ్‌ మాట్లాడిన కాల్‌ రికార్డింగ్స్‌ ఐవీఆర్‌ కాల్స్‌గా ఓటర్ల సెల్‌ ఫోన్లకు వస్తున్నాయి. టీడీపీ పేరిట వస్తున్న ఈ ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌పై వెంటనే చర్యలు తీసుకో­వాలని ఈసీ శనివారం ఆదేశించిన నేప­థ్యంలో సీఐడీ ఆదివా­రం ఉద­యం కేసు నమోదు చేసింది.

అయినా సరే ఆదివారం రాత్రి కూడా లోకేశ్‌ మాటలతో ఐవీఆర్‌ కాల్స్‌ రావడం గమనార్హం. 73137­71502 అనే నంబర్‌ నుంచి లోకేశ్‌ కాల్‌ రికార్డింగులు ఓటర్ల సెల్‌ ఫోన్లకు వచ్చా­యి. ఈసీ ఆదేశాలను ఖాతరు చేయకుండా టీడీపీ ఎంతగా బరితెగించిందో స్పష్టమవు­తోంది. లోకేశ్‌ను ఏ2గా పేర్కొంటూ దీనిపై ఇప్పటికే కేసు నమోదు కాగా స్వయంగా లోకేశ్‌ మాట్లాడి రికార్డ్‌ చేసిన కాల్స్‌ రావడంతో ఈ కేసులో తీవ్రత మరింత పెరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement