పిఠాపురంలో సినీ ఫక్కీలో జనసేన నేతల నాటకం
మీడియాను, ప్రజల్ని పక్కదోవ పట్టించేలా వ్యూహం
అందరి దృష్టి మళ్లించేలా చెక్‌పోస్ట్ వద్ద ట్రాఫిక్ స్తంభన
ఈలోగా బస చేసిన హోటల్ నుంచి డబ్బు తరలింపు
పిఠాపురం: గోకులం గ్రాండ్ హోటల్‌లో ఏం జరిగింది?. అక్కడి నుంచి డబ్బుల బ్యాగులు ఎక్కడికి వెళ్లాయి? పిఠాపురంలో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్. జనసేన నేతలు బస చేసిన హోటల్ నుంచి భారీ మొత్తంలో డబ్బును సేఫ్‌గా ఎలా తరలించారో ఇక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన సీన్‌లో అసలు కథ ఏంటంటే.. ఇక్కడ ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఎవ్వరూ ఆపకుండానే ఓ కారు వచ్చి ఆగింది.
రోడ్డుకు అడ్డంగా పెట్టి ట్రాఫిక్ స్తంభించేలా చేశాడు ఆ కారు డ్రైవర్. ట్రాఫిక్ ఆగిపోవడంతో చెక్‌పోస్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై, వాహనాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇదే సమయంలో అడ్డంగా పెట్టిన కారులో నుంచి కనిపిస్తున్న పెద్ద అట్టపెట్టెలపై తనిఖీ సిబ్బంది దృష్టి పడింది. అనుమానం వచ్చి సోదా చేయగా.. అందులో 17 అట్టపెట్టెల్లో జనసేన గుర్తుతో ఉన్న గాజు గ్లాసులు కనిపించాయి. వెంటనే వాటిని స్వా«దీనం చేసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది తెలిసి మీడియా అంతా అటు దృష్టి పెట్టింది. పోలీసులు కారును, గాజు గ్లాసులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
పక్కదోవ పట్టించేలా పక్కా వ్యూహం
తనిఖీ అధికారులు, పోలీసులు కారులోని గాజు గ్లాసులకు ఎటువంటి బిల్లులూ లేకపోవడంతో స్వా«దీనం చేసుకుంటున్న సమయంలో ముందస్తు పథకం ప్రకారం.. కారును తనిఖీ చేస్తున్న ప్రదేశానికి కొందరు జనసేన నేతలు వచ్చి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. సరిగ్గా అదే సమయంలో అక్కడకు కిలోమీటర్ దూరంలో ఉన్న గోకులం హోటల్‌లో ప్రత్యేక బృందాలు తనిఖీ చేపట్టాయి. అక్కడ క్లీన్ చిట్ ఇచ్చేంత వరకూ జనసేన నేతలు వాగ్వాదం కొనసాగించారు.
అధికారులు కారులో గ్లాసులు స్వా«దీనం చేసుకున్నప్పుడు ఎటువంటి బిల్లులూ లేవని చెప్పిన జనసేన నేతలు.. హోటల్‌లో తనిఖీలు పూర్తి కాగానే ఆ గ్లాసులకు బిల్లులు తీసుకువచ్చి పోలీసులకు చూపించడం పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని అర్థమవుతోంది. సినీ నటులు, సహాయ నటులు ఉన్న జనసేనకు ఇలాంటి సీన్లు క్రియేట్ చేయడం పెద్ద పనేమీ కాదని, భవిష్యత్‌లో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
అసలేం జరిగిందంటే..
పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో గోకులం గ్రాండ్ అనే హోటల్‌ను నెల క్రితం జనసేన అగ్ర నేతలు అద్దెకు తీసుకుని ఇక్కడి నుంచి నియోజకవర్గం పార్టీ ఎన్నికల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే భారీ నగదు ఉంది అనే సమాచారంతో స్పెషల్ పార్టీ ఎన్నికల తనిఖీ అధికారులు శనివారం రాత్రి హఠాత్తుగా ఈ హోటల్ వద్దకు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు అధికారులు తనిఖీలు చేసి అక్కడ ఏమీ లేవని తేల్చేశారు. జనసేన నేతలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఈ హోటల్‌పై ఎన్నికల అధికారులు దాడులకు వస్తున్నారనే సమాచారం జనసేన అగ్ర నేతలకు ముందే తెలిసింది.
వెంటనే కారు డ్రామాకు ప్లాన్ చేశారు. చెక్‌పోస్టు వద్దకు పంపి ట్రాఫిక్‌ను ఆపి హైడ్రామా క్రియేట్ చేశారు. దీంతో మీడియా ఫోకస్ అటు మళ్లింది. ఈలోపు భారీ మొత్తంలో ఉన్న డబ్బును బ్యాగుల్లో నింపి కిటీకీల్లో నుంచి కిందకు పడేసి అక్కడి నుంచి వాటిని తరలించారని విశ్వసనీయంగా తెలిసింది. స్థానికులు, మీడియా, పోలీసుల దృష్టి ట్రాఫిక్‌కు అడ్డంగా పెట్టిన కారుపైకి మళ్లించి.. డబ్బును రహస్య ప్రాంతానికి మళ్లించారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment