‘స్నేహంతో పని జరిగినప్పుడు, శత్రుత్వంతో పనెందుకు! | Sakshi
Sakshi News home page

Happy Friendship Day 2023: ‘స్నేహంతో పని జరిగినప్పుడు, శత్రుత్వంతో పనెందుకు!

Published Sun, Aug 6 2023 9:22 AM

Happy Friendship Day 2023 Inspirational Stories And Quotes - Sakshi

స్నేహితుల దినోత్సవం సందర్భంగా అంతర్జాలంలో అలనాటి సినిమా ‘దోస్తి’ (1964) తప్పనిసరిగా ప్రస్తావనకు వస్తుంది. సత్యన్‌బోస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సూపర్‌ హిట్‌ కొట్టింది. ‘బెస్ట్‌ ఫిల్మ్‌’ తో సహా ఆరు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌లు గెలుచుకుంది. ఒక యాక్సిడెంట్‌లో కాలు కోల్పోయిన రాము, కంటిచూపు లేని మోహన్‌ అనే ఇద్దరు కుర్రాళ్ల మధ్య స్నేహానికి అద్దం పట్టే చిత్రం ఇది. ఈ ఇద్దరు స్నేహితులకు పాట స్నేహితురాలు. అన్నదాత. ఎన్నో కష్టాలు, ప్రలోభాలు ఎదురైనా వారి స్నేహ ప్రపంచం చెక్కు చెదరదు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా చూడాల్సిన సినిమాలలో ఇదొకటి. 

అలాగే 'స్నేహంలో విభేదాలు ఉండవు’ అని అనుకోవడానికి లేదు. ఎన్నో కారణాల వల్ల ఫ్రెండ్‌షిప్‌ బ్రేక్‌డౌన్‌ కావచ్చు. మళ్లీ కలుసుకోవాలని, మునపటిలా హాయిగా మాట్లాడుకోవాలని ఉన్నా ఏవో ఇగోలు అడ్డుపడుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాశ్చాత్య దేశాల్లో ‘ఇన్విజిబిలియా: థెరపీ విత్‌ ఫ్రెండ్స్‌’ అనే ట్రెండ్‌ మొదలైంది. అనగా ఒక సైకాలజిస్ట్‌ విడిపోయిన ఇద్దరు స్నేహితులను ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఒకటి లేదా రెండు మూడు రోజుల సెషన్‌లతో వారి స్నేహాన్ని తిరిగి పట్టాలకెక్కిస్తారు. ‘ఇదంతా ఎందుకు?’ అనుకునేవారు దూరం అయిన ఫ్రెండ్‌కు ‘సారీ రా’ అని మెసేజ్‌ పెట్టి చూడండి చాలు...‘సారీ’కి ఉండే పవర్‌ ఏమిటో మీకే తెలుస్తుంది!

ఆ నలుగురు స్నేహితులు
ఇంగ్లీష్‌ సింగర్, సాంగ్‌ రైటర్, మ్యూజిషియన్, పీస్‌ యాక్టివిస్ట్‌ జాన్‌ లెనన్‌ తన ‘ఇమేజిన్‌’ పాటలో ఏం అంటాడు? నీ తల మీద ఆకాశం తప్ప, స్వర్గనరకాలు, మతాలు, కులాలు, సరిహద్దు ద్వేషాలు లేని ఒక కొత్త ప్రపంచం, ఆస్తులు, అంతస్తుల తేడా లేని సరికొత్త సమాజాన్ని ఊహించుకో అంటాడు. ‘ఐయామ్‌ ఏ డ్రీమర్‌ బట్‌ ఐయామ్‌ నాట్‌ ది వోన్లీ వన్‌’ అని కూడా అంటాడు. ప్రపంచంలో ఎంతోమందిలాగే ఈ పాటతో ప్రభావితమైన వాళ్లలో బెంగళూరుకు చెందిన నలుగురు స్నేహితులు ఉన్నారు. మెలిషా, వినోద్‌ లోబో, నితిన్‌ కుమార్, విగ్నేష్‌లు ‘ఇమేజిన్‌’ సాంగ్‌ స్ఫూర్తితో  ‘ఇమేజిన్‌ ట్రస్ట్‌’ ప్రారంభించారు. సేవా కార్యక్రమాలకు సంబంధించి తొలి దశలో భాగంగా ‘క్లాత్‌ బ్యాంక్‌’కు శ్రీకారం చుట్టారు. దాతల నుంచి సేకరించిన ఈ దుస్తులను పేదలు రూపాయి ఇచ్చి కొనవచ్చు.

వన్స్‌మోర్‌ ఫ్రెండ్‌షిప్‌ డైలాగ్‌లు
నిజమైన స్నేహితులు కన్నీటి చుక్కల్లాంటి వారు. మనసు బాధగా ఉన్నప్పుడు చప్పున బయటికి వస్తారు’
‘స్నేహంతో పని జరిగినప్పుడు, శత్రుత్వంతో పని ఎందుకు!’
– వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ముంబై సినిమా

నిజమైన స్నేహితుడు, స్నేహితుడి తప్పులను తన తప్పులుగా భావించి క్షమిస్తాడు.
– ఏ రస్తే ప్యార్‌ కే

స్నేహితుడు చనిపోవచ్చు. స్నేహం చనిపోదు.
                  – ఎల్‌వోసీ కార్గిల్‌

స్నేహం అనేది ఎలా బతకాలో మాత్రమే కాదు ఎలా చావకూడదో నేర్పుతుంది.
– ఏబీసీడి–ఎనీబడి కెన్‌ డ్యాన్స్‌

స్నేహితులు ఉన్న వారే అసలైన సంపన్నులు
– రంగ్‌ దే బసంతీ

స్నేహంలోని ఒక నియమం...నో సారీ...నో థ్యాంక్‌!
– కుచ్‌ కుచ్‌ హోతా హై

(చదవండి: ఔరా అమ్మకచెల్ల... భాంగ్రా  స్టెప్పులు వేయడం  ఇల్లా!)

 
Advertisement
 
Advertisement